ఫ్రీ లాన్స్.. గిగ్ వర్క్

Update: 2024-10-05 08:30 GMT

ఐటీ కంపెనీలు లే ఆఫ్స్ ప్రకటిస్తున్నాయి. వివిధ రకాల కారణాలు చూపుతూ ఉద్యోగులను ఇంటికి పంపుతున్నాయి. ఖర్చుల తగ్గుదల పేరుతో ఇతర రంగాల్లోనూ ఇలాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. ఈ సమయంలో ‘గిగ్ వర్క్’ యువతకు ఆసరాగా నిలుస్తున్నది. సమయానుసారంగా పనిచేసే వెసులుబాటు కల్పిస్తున్నది. ఈ గిగ్ వర్క్‌లో ఎన్ని అనుకూలతలు ఉన్నాయో, అదే స్థాయిలో ప్రతికూలతలు సైతం ఉన్నాయి. రాబోయే కాలంలో ఇలాంటి ఉద్యోగాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెప్తున్నారు. దీంతో ఉద్యోగులకు నెల జీతాలూ, పెన్షన్లూ, బోనసులూ, ఇతర సదుపాయాలు మెల్లమెల్లగా కనుమరుగయ్యేలా కనిపిస్తున్నాయి.

మహమ్మద్ ఆరిఫ్

నో గ్యారంటీ..

పూర్తిస్థాయి ఉద్యోగం, ఉదయం నుంచి సాయంత్రం వరకు పని చేసే విధానానికి భిన్నంగా.. తాత్కాలికంగా, నిర్దేశిత రోజులు, అనుకూలంగా ఉన్న సమయాల్లో మాత్రమే, ఒప్పందం మేరకు పని చేయడమే గిగ్ వర్క్. వీరిలో ఫుడ్‌ ఆర్డర్‌ తెచ్చిచ్చే డెలివరీ బాయ్, ఓలా, ఉబర్‌ డ్రైవర్లతోపాటు కంటెంట్ రైటర్లు, వెబ్‌ డిజైనర్లు, కంప్యూటర్ ప్రోగ్రామర్లు, ఎలక్ట్రీషియన్లు, బ్యూటీషియన్లు, బ్లాగర్లు ఇలా వందల వృత్తులవారు పని చేస్తూ ఉపాధి పొందుతున్నారు. తాత్కాలిక, స్వల్పకాలిక కొలువులు ఉండే ఆర్థిక వ్యవస్థే గిగ్ ఎకానమీ. ఓలా, ఊబర్, స్విగ్గి, జోమాటో లాంటి సంస్థలు వచ్చాక గిగ్ ఉద్యోగుల సంఖ్య క్రమంగా పెరుగుతూ పోతున్నది. పని చేసిన మేరకు, ఆ పనిలో నాణ్యత చూపిన మేరకు మాత్రమే ఇక్కడి నుంచి ఆదాయాన్ని పొందవచ్చు. అయితే ఇలాంటి ఉద్యోగాల్లో ఎలాంటి గ్యారంటీ ఉండదు. నైపుణ్యం లేని వారి కంటే నైపుణ్యం కలిగిన వర్కర్లు ఇందులో బేరసారాల శక్తి ఎక్కువగా కలిగి ఉంటారు.

పరోక్ష ఒత్తిడి

గిగ్ వర్క్ చేసే ఫుడ్ డెలివరీ కార్మికులైనా.. గమ్యానికి చేర్చే ట్యాక్సీ డ్రైవర్లయినా సమయం విషయంలో తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నట్టు స్పష్టమవుతోంది. ఇది నేరుగా కంపెనీల నుంచి కాకుండా పరోక్షంగా వీరిపై ఒత్తిడి పెరుగుతోంది. రోజులో ఎన్ని ఎక్కువ డెలివరీలు చేస్తారో అంత ఎక్కువ సంపాదన వారికి వస్తుంది. అంతేకాకుండా ప్రత్యేక ఇన్సెంటివ్ కోసం రోజులో కనీసం పదికి పైగా డెలివరీలు చేయాల్సి ఉంటుంది. త్వరగా డెలివరీ చేసిన వారికే మరిన్ని ఎక్కువ డెలివరీ ఆర్డర్లను కంపెనీలు కేటాయిస్తున్నాయి. అధిక ఆర్డర్లు పొందడానికి ఇలాంటి ఒత్తిడిని ఓలా, ఊబర్, జొమాటో, స్విగ్గీ లాంటి సంస్థల్లో పని చేస్తున్న లక్షల మంది డ్రైవర్లు, డెలీవరీ బాయ్స్ ఎదుర్కొంటున్నారు. నైపుణ్యం లేని గిగ్ కార్మికులు ఉదయం నుంచి రాత్రి వరకు పని చేసినా రూ. 500 నుంచి రూ. వెయ్యి వరకు కూడా సంపాదించలేకపోతున్నారు. రాత్రి సమయాల్లో పని చేస్తున్న వారు పడే ఇబ్బందులైతే వర్ణనాతీతం. విద్యార్హతలకు సరిపడా ఉద్యోగాలు లభించక.. నైపుణ్య శిక్షణ అందక చాలా మంది గిగ్ వర్క్ వైపు వెళ్తున్నారు. మరికొందరు కొన్ని కోర్సుల్లో శిక్షణకు అవసరమయ్యే ఫీజుల కోసం గిగ్‌ కార్మికులుగా మారుతున్నారు.

ఫ్రీలాన్సర్లకు డిమాండ్ ఎక్కువే..

గిగ్ వర్క్ ఫోర్స్‌లో 47 శాతం మంది మీడియమ్ స్కిల్ వర్కర్స్ ఉండగా, 33 శాతం మంది తక్కువ నైపుణ్యం కలిగిన వారు ఉన్నారు. అధిక నైపుణ్యం కలిగిన వారు రెండు శాతం మాత్రమే. టెక్నికల్ స్కిల్స్ ఉన్న వారిని కంపెనీలు ప్రాజెక్టుల వారీగా పని చేసే సౌకర్యాన్ని కల్పిస్తున్నాయి. వీరిని ఫ్రీలాన్సర్లు, లేదా ఫ్లెక్సీ వర్కర్లుగా పిలుస్తున్నారు. ఎనలిటిక్స్‌, ఆటోమేషన్‌, ఐటీ ఆర్కిటెక్చర్‌, ఏఐ వంటి హైటెక్‌ రంగాల్లో ఫ్లెక్సి వర్కర్ల సేవలను టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌, విప్రో, హెచ్‌సీఎల్‌ వంటి ఐటీ దిగ్గజాలు ఉపయోగించుకుంటున్నాయి. అమెరికా, చైనా, బ్రెజిల్‌, జపాన్‌ల తరవాత ఫ్రీలాన్సర్లు భారతదేశంలో అధికంగా ఉన్నారు. ఇప్పటికే 70 శాతం భారతీయ కంపెనీలు ఏదో ఒక సమయంలో గిగ్‌-ఫ్రీలాన్స్‌ వర్కర్ల సేవలను ఉపయోగించుకున్నట్లు ఒక సర్వేలో తెలిపాయి. నేడు ప్రపంచంలో ప్రతి నలుగురు ఫ్రీలాన్సర్లలో ఒకరు ఇండియాకు చెందినవారే. ప్రతిభావంతులైన ఫ్రీలాన్సర్లు ఏడాదికి రూ. 20 లక్షల నుంచి రూ. 60 లక్షల వరకు ఆర్జిస్తున్నారని పేపాల్‌ అనే సంస్థ తెలిపింది. అయితే గణనీయ సాంకేతిక నైపుణ్యాలు ఉన్న వారికి మాత్రమే ఇది సాధ్యం. అయితే సాంకేతిక అర్హతలు లేకపోయినా.. సృజనాత్మకత ఉంటే చాలు.. గిగ్ వర్క్ ద్వారా ఉపాధి పొందుతున్న వారు చాలా మందే ఉన్నారు.

గిగ్ వర్కర్స్ సంతోషంగా ఉన్నారా..!

భారత్‌లో గిగ్ ఎకానమీలో పని చేస్తున్న వారు సంతోషంగా ఉన్నారా అంటే.. లేదనే 90 శాతం మంది జవాబు చెప్తున్నారు. దీనికి ప్రధానంగా నాలుగు కారణాలు ఉన్నాయి. మొదటిది అస్థిర ఆదాయం. పనికి తగ్గ ఆదాయం తమకు అందడం లేదని కార్మికులు చెబుతున్నారు. రెండో కారణం అధిక ఆదాయం కోసం ఎక్కువ సేపు పని చేయాల్సి రావడం. దీని వల్ల కార్మికుల శారీరక, మానసిక ఆరోగ్యం దెబ్బతింటున్నది. అంతేకాకుండా కుటుంబాలతో గడిపే సమయం తక్కువవుతుండడంతో మానసిక ఒత్తిడి పెరుగుతున్నది. మూడో కారణం సామాజిక భద్రత లేకపోవడం. సాధారణ ఉద్యోగుల్లాగా పరిమిత పని గంటలు, హెల్త్ బెనిఫిట్స్ లాంటి ఇతర ప్రయోజనాలు గిగ్ కార్మికులకు అందవు. నాలుగో కారణం మంచి కస్టమర్ రేటింగ్ కోసం తీవ్ర ఒత్తిడిని ఎదుర్కోవడం. రేటింగ్ బాగా లేదని చాలా మంది కార్మికులను ఎన్నో సంస్థలు పని ఇవ్వడానికి నిరాకరించిన ఘటనలు సైతం ఉన్నాయి. గిగ్ వర్క్‌లో పని చేసే వారికి స్వాతంత్ర్యం, సమయానుసారంగా పని చేసే స్వేచ్ఛ ఉంటుందనే అభిప్రాయాలున్నా.. జీవనోపాధి కోసం చేసే వారికి మాత్రం ఇది కడుపు నింపలేకపోతున్నది. పట్టణాల్లో పెరిగిన జీవన వ్యయంతో.. వీటి ద్వారా వచ్చే ఆదాయంతో చాలా మంది తమ కుటుంబాలను పోషించుకోలేకపోతున్నారు.

అనుకూలతలు ఇవీ..

కరోనా తర్వాత ఉపాధి లేక, ఉన్న ఉద్యోగాలు ఊడిపోయి ఆర్థిక కష్టాల్లో ఉన్న చాలా మందికి గిగ్ ఉద్యోగాలు చాలా వరకు ఆదుకున్నాయి. ఎలాంటి సంపాదన లేకపోవడం కంటే ఎంతో కొంత సంపాదన ఉండడం చాలని చెప్పేవారు చాలా మంది ఉన్నారు. గిగ్ ఎకానమీలో పని చేసే వారు ఫ్రీలాన్సింగ్ విధానంలో సంస్థలకు సేవలందించి ఆదాయం ఆర్జిస్తుంటారు. దీని ద్వారా ఇంకో ప్రయోజనం ఏమిటంటే ఒకే సమయంలో ఒకటి కంటే ఎక్కువ సంస్థలకు పనిచేసే అవకాశం కూడా లభిస్తుంది. ఆ మేరకు ఆదాయం కూడా అందుతుంది. అంతేకాకుండా గిగ్ వర్క్ ద్వారా పని చేయడానికి మహిళలు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. ఆన్ లైన్ ద్వారా లేదా అనుకూలంగా ఉన్న సమయాల్లో పని చేసే అవకాశం లభిస్తుండడం దీనికి కారణం. కస్టమర్ సర్వీస్, కంటెట్ చెక్, ఫోన్ సేల్స్, సర్వే వంటి గిగ్ వర్క్ ద్వారా మహిళలు ఉపాధి పొందుతున్నారు. దేశంలోని అర్బన్ ప్రాంతాల్లో చేసిన సర్వే ప్రకారం గిగ్ వర్కర్లలో మహిళలు 16 నుంచి 23 శాతం వరకు ఉన్నారని, వీరిలో ఎక్కువ మంది చదువు పూర్తయిన వెంటనే, పెళ్లయిన తర్వాత గిగ్ వర్కర్లుగా పని చేస్తున్నారని నీతి ఆయోగ్ రిపోర్టులో చెప్పింది. అంతేకాకుండా ప్రధాన నగరాల్లో ఓ వైపు చదువుకుంటూనే సాయంత్రం వేళల్లో పాకెట్ మనీ కోసం చాలా మంది విద్యార్థులు ర్యాపిడో, స్విగ్గీ, జోమాటో, ఓలా లాంటి సంస్థల ద్వారా తమ ఖర్చులకు డబ్బులు సంపాదించుకోగలుగుతున్నారు.

ఊరటనిచ్చిన తెలంగాణ ప్రభుత్వం

బలమైన గిగ్ ఆర్థిక వ్యవస్థ ఉన్న దేశాల్లో భారతదేశం ప్రపంచవ్యాప్తంగా ఐదో స్థానంలో ఉన్నది. దేశంలో వేదిక ఆధారిత గిగ్ కార్మికుల సంఖ్య 2016లో 80 లక్షలు ఉండగా.. 2029-30 నాటికి ఇది 2.35 కోట్లకు చేరుకుంటుందని నీతి ఆయోగ్ తన నివేదికలో పేర్కొన్నది. అంటే ఇది దేశంలోని వర్క్ ఫోర్స్ లో 4.1 శాతం. దీంతో రాబోయే రోజుల్లో దేశ యువతకు ఉపాధికి అతిపెద్ద దిక్కుగా గిగ్‌ ఎకానమీ అవతరించే అవకాశమున్నది. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, స్విగ్గీ, జొమాటో, ర్యాపిడో వంటి సంస్థల్లో గిగ్‌ కార్మికులుగా పని చేస్తున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నా.. వారి సంక్షేమానికి ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. సెలవులు, ఈపీఎఫ్‌ వంటి సామాజిక భద్రత అందడం లేదు. వారికి జరగరానిది జరిగితే కుటుంబాల జీవనం ప్రశ్నార్థకమవుతున్నది. అయితే గిగ్ వర్కర్ల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం త్వరలో సామాజిక భద్రతా పథకాన్ని ప్రకటించే అవకాశం కనిపిస్తున్నది. ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లతో చర్చల తర్వాత పథకంపై నిర్ణయాన్ని తీసుకోనున్నట్టు సమాచారం. తెలంగాణ రాష్ట్రంలో దాదాపు నాలుగు లక్షల మంది గిగ్ వర్కర్లు ఉండగా.. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రూ. 5 లక్షల వరకు ప్రమాదబీమా సదుపాయం కల్పిస్తూ జీవో జారీ చేసింది. అంతేకాకుండా రూ. 10 లక్షల ఆరోగ్యబీమా సౌకర్యం కల్పించనున్నట్లు ప్రకటించింది. కర్ణాటకలోనూ ప్లాట్ ఫామ్ ఆధారిత గిగ్ కార్మికులకు ప్రమాద బీమా ప్రయోజనాలను అక్కడి ప్రభుత్వం ప్రారంభించింది. జార్ఖండ్, రాజస్థాన్ ప్రభుత్వాలు గిగ్ వర్కర్ల సంక్షేమానికి, కనీస వేతనాల కోసం సంక్షేమ బోర్డులు ఏర్పాటు చేశాయి. తమిళనాడులోనూ వెల్ఫేర్ బోర్డ్ కోసం కసరత్తు జరుగుతున్నది.

విదేశాల్లో మెరుగైన పరిస్థితులు..

భారతదేశం కంటే విదేశాల్లో గిగ్ వర్కర్ల పరిస్థితులు చాలా మెరుగ్గా కనిపిస్తున్నాయి. టెక్నాలజీలో మార్పులు, స్మార్ట్‌ ఫోన్లతో ఈ గిగ్‌ వ్యాపారం కొత్త పుంతలు తొక్కడానికి తోడ్పడుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా 110 కోట్ల మంది గిగ్‌ ఉద్యోగులు ఉన్నట్లు అంచనా. 2024లో గిగ్ ఆర్థిక వ్యవస్థ లక్షన్నర కోట్లు కాగా, 2025 నాటికి ఇది 2.7 లక్షల కోట్ల డాలర్లకు చేరుకుంటుందని మాస్టర్ కార్డ్ అనే సంస్థ అంచనా వేసింది. అమెరికాలో రెగ్యులర్ ఉద్యోగుల కంటే గిగ్ వర్కర్లు 78 శాతం ఎక్కువ సంతోషంగా ఉన్నారని ‘ఆఫ్ వర్క్’ అనే సంస్థ తన నివేదికలో పేర్కొన్నది. ఇంకా చాలా అభివృద్ధి చెందిన దేశాల్లో ఇలాంటి పరిస్థితే ఉన్నది. ఉబర్‌ తదితర సంస్థలకు వేతనం మీద పనిచేసే కాంట్రాక్టు పనివారిని కూడా సాధారణ ఉద్యోగుల్లానే పరిగణించాలంటూ అమెరికాలోని క్యాలిఫోర్నియా రాష్ట్రం గతంలో ఓ బిల్లును ఆమోదించింది. ‘గిగ్‌ వర్కర్ల’కు కనీస హక్కులు కల్పించాలని ఐరోపా సమాఖ్య (ఈయూ) ఒక ఉత్తర్వు జారీ చేసింది.

ప్రజలకు కాస్త సౌకర్యవంతంగానే..

గిగ్ వర్కర్స్ ద్వారా ప్రజలకు అనేక రకాల సౌకర్యాలు అందుతున్నాయి. గమ్యస్థానాలకు వెళ్లడానికి నిలబడిన చోటే ఆటో, ట్యాక్సీ, బైక్స్ వచ్చేస్తున్నాయి. వివిధ సంస్థలు డెలీవరీ బాయ్స్ ద్వారా ఇంటి దగ్గరే వేడివేడి ఆహారాన్ని తెచ్చి ఇస్తున్నాయి. ప్రధాన నగరాల్లో అర్బన్‌ క్లాప్‌, జస్ట్‌ డయల్‌, సులేఖా వంటి సంస్థలను ఆన్‌లైన్‌లో సంప్రదించగానే ప్లంబర్లు, ఎలక్ర్టీషియన్లు, వడ్రంగులు ఇతర వృత్తి నిపుణులు సైతం ఇంటికి వచ్చి పని చేస్తున్నారు. అయితే భారతదేశంలో వ్యక్తిగత రవాణా, ఆహార సరఫరా వ్యాపారాల్లో గిగ్ వర్కర్లు ఎక్కువగా ఉన్నారు.


Similar News