KCR: నాకు ఎవరిమీదా కోపం లేదు.. అసలు ఎందుకు ఉంటది?

తెలంగాణకు ప్రధాన శత్రువే కాంగ్రెస్ పార్టీ అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు.

Update: 2025-03-22 16:02 GMT
KCR: నాకు ఎవరిమీదా కోపం లేదు.. అసలు ఎందుకు ఉంటది?
  • whatsapp icon

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణకు ప్రధాన శత్రువే కాంగ్రెస్ పార్టీ అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. ఎండిన గోదావరి తల్లి కన్నీటి గోసను.. కాళేశ్వరం నీరందక పంటలు ఎండిన రైతన్నల గుండె కోతను.. సమాజానికి తెలిపేందుకు.. రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఆధ్వర్యంలో రామగుండం నుంచి ఎర్రవల్లి దాకా 200 మందితో కూడిన 180 కిలోమీటర్ల పాదయాత్ర వారం రోజుల పాటు సాగింది. ఈ పాదయాత్ర శనివారం ముగిసింది. ముగింపు సభ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన ఎర్రవల్లిలో జరిగింది. ఈ సందర్భంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణను ఆంధ్రలో కలపడం నుంచి, 1969లో వందలాది మంది బిడ్డలను పొట్టన పెట్టుకున్నారని అన్నారు. నీళ్లు, నిధులు, నియామకాల విషయంలో తెలంగాణకు దశాబ్దాల కాలంగా జరిగిన అన్యాయాలను వివరించారు. తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలను మొదటినుంచీ కనీస స్థాయిలో ప్రతిఘటించలేని నాటి నాయకత్వం ఎంతో నష్టం చేసిందని అన్నారు. వాళ్ల తెలివి తక్కువ తనం చూసి, ఉద్యమ కాలంలో తాను వాళ్లను దద్దమ్మలు, సన్నాసులు అని తెలంగాణ సమాజం తరపున అన్నాను తప్పితే.. తనకు వ్యక్తిగతంగా ఎవరి మీద కోపం ఎందుకు ఉంటుంది..? అని అన్నారు.

అడుగంటిన చెరువులు, కుంటలు

పోయిన ఏడాది ఇదే రోజు నిండు కుండల్లాంటి కాళేశ్వరం ప్రాజెక్టులు నేడు ఎందుకు ఎండిపోయాయి.. ఇందుకు కారణం ఎవరు..? అనే విషయాన్ని సభ్యసమాజానికి తెలియజేసేందుకు చందర్ అధ్వర్యంలో పాదయాత్ర చేయడం అభినందనీయమని కేసీఆర్ అన్నారు. తెలంగాణ సాయుధ పోరాట కాలం నుంచీ నేటి దాకా పలు సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీ చేసిన మోసాలను కేసీఆర్ సమావేశంలో వివరించారు. నెహ్రూ సహా ఇందిరాగాంధీ, సోనియాగాంధీ నుంచి నేటిదాకా కాంగ్రెస్ తెలంగాణకు జరిగిన ద్రోహాలను చెప్పారు. పదేండ్ల బీఆర్ఎస్ ప్రగతి పాలనలో జలాలతో అలుగెల్లిన గోదావరి కాళేశ్వరం ప్రాజెక్టులు, కాంగ్రెస్ పాలన తెచ్చిన కరువుతో చెరువులు కుంటలు అడుగంటి ఎడారిగా మారడంపై కేసీఆర్ ఆవేదన వ్యక్తంచేశారు. ‘తలాపున పారుతుంది గోదారి.. నీ చేను నీ చెలుక ఎడారి’.. అని నాటి ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ నీటి కష్టాలను వివరిస్తూ నాటి కవి సదాశివుడు రాసిన పాటను తిరిగి గుర్తుచేశారు. ‘తెలంగాణను కొట్లాడి సాధించుకున్నాం. ఎంతో జాగ్రత్తగా నిలబెట్టుకున్నం. ప్రజలు ఏమనుకున్నారో ఏందో కొత్త ప్రభుత్వాన్ని తెచ్చుకున్నరు. అదీ వాళ్లిష్టం. కానీ దాని ఫలితం లోకం చూస్తున్నది’ అని కేసీఆర్ అన్నారు. ‘ఇన్నాళ్ళు లేని నీటి గోస ఇప్పుడెందుకు వచ్చినట్టు..? తెలంగాణకు నీళ్లు ఇవ్వాలనే పాలనా ప్రాధాన్యతను రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం వల్లే తెలంగాణకు సాగు, తాగునీరు సమస్య వచ్చింది’ అని స్పష్టం చేశారు.

ఉమ్మడి రాష్ట్ర పాలకులు మొదటి నుంచీ నీటి సమస్యను ఆర్థిక సమస్యగా చూడడం ఒక అవలక్షణంగా మార్చుకున్నారని, గల్ఫ్ లాంటి ఎడారి దేశాల్లో నీళ్లుండవని, అక్కడి ప్రభుత్వాలు సముద్ర జలాలనుంచి ఉప్పును వేరుచేసి నీటిని శుద్ధి చేసి మంచినీరుగా వాడుకుంటారని అన్నారు. మద్రాస్‌లో కూడా నీటి కొరతను అధిగమించేందుకు అటువంటి కార్యాచరణను చేపట్టారని, భౌగోళిక వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ప్రజల శ్రేయస్సును పరిగణలోకి తీసుకొని ప్రభుత్వాలు పనిచేయవలసి ఉంటుందని చెప్పారు. అంతేతప్ప వాటిని ఖర్చుకు లింకు పెట్టి ఆలోచన చేయడం తప్పు అని అన్నారు. తెలంగాణకు సాగు, తాగునీరు అవసరమని, అందుకోసం రాష్ట్ర ప్రభుత్వాలు ఖర్చుకు వెనకాడకుండా ప్రజలకు తాగునీరు, వ్యవసాయానికి సాగు నీరు అందించాల్సిందే అని డిమాండ్ చేశారు.

వ్యవసాయ అభివృద్ధే బీఆర్ఎస్‌కు ప్రాధాన్యం

తెలంగాణ రాగానే నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవసాయ స్థిరీకరణ కోసం దృష్టి సారించి పటిష్టమైన కార్యాచరణను అమలు చేసిందని, రైతాంగ వ్యవసాయ అభివృద్ధి పాలనా ప్రాధాన్యతాంశంగా నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంచుకుందని కేసీఆర్ చెప్పారు. అందులో భాగంగా.. ప్రాజెక్టుల ద్వారా సాగునీరు అందివ్వడం.. వ్యవసాయానికి నాణ్యమైన విద్యుత్‌ను ఉచితంగా అందించడం.. పంట పెట్టుబడి సాయం చేయడం.. పండిన ధాన్యాన్ని గిట్టుబాటు ధరకు ప్రభుత్వమే కొనుగోలు చేయడం.. అనే అంశాలను ప్రాధాన్యతగా తీసుకొని ఎన్ని కష్టాలొచ్చినా నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిందని అన్నారు. అందుకే పదేళ్లపాటు రాష్ట్ర రైతాంగం ప్రజలు ఎటువంటి బాధలు లేకుండా జీవించారని, ఇప్పుడున్న ప్రభుత్వం వీటిని అందించడానికి ఖర్చు అవుతుందని వెనకాడుతున్నదని, ఇది సరికాదని సూచించారు. ఎప్పుడైనా ప్రభుత్వాలే రైతుల దగ్గర భూమి శిస్తులు వసూలు చేసిన సందర్భాలున్నాయి కానీ ఉల్టా ప్రభుత్వమే రైతుకు భరోసా కల్పించే విధంగా పంట పెట్టుబడి అందించిన పరిస్థితి ఈ దేశంలో ఉన్నదా..? అని నిలదీశారు. రైతు సంక్షేమం దిశగా కేవలం బీఆర్ఎస్ ప్రభుత్వం ఆలోచన ఫలితమే అని చెప్పారు. ఈ పరిస్థితులను తెలంగాణ సమాజం ఇప్పటికైనా అర్థం చేసుకోవాలన్నారు. ‘మనం ఇచ్చిన కరెంటు ఎటు పోయింది? మనం ఇచ్చిన మిషన్ భగీరథ తాగునీరు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? ఎండాకాలంలో కూడా మత్తడి దునికిన చెరువులు ఇప్పుడు ఎందుకు నీరు లేక ఎండిపోతున్నాయి..? ప్రజలు అర్థం చేసుకోవాలని కోరారు.

కత్తి ఒకరికి ఇచ్చి యుద్ధం చేయమంటే ఎలా?

పల్లెల నుంచి హైదరాబాద్ వంటి పట్టణాలకు బతకడానికి వచ్చిన పేదలకు నాటి ప్రభుత్వం అండగా నిలిచిందని, కానీ ఇప్పుడున్న ప్రభుత్వం వాళ్ల ఇండ్లను కూల్చివేస్తున్నదని కేసీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. గోరటి వెంకన్న లాంటి కవులు రాసిన ‘గల్లీ చిన్నది.. గరీబోళ్ల కథ పెద్దది’ వంటి పాటల స్ఫూర్తితో, పేదలకు ఇండ్ల నిర్మాణం చేపట్టామని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ఇండ్లను హైడ్రా పేరుతో కూల్చేస్తుంటే.. కేసీఆర్ అన్నా ఎక్కడున్నావు రావే... రావే... అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కానీ నన్ను ఓడగొట్టి ఇంట్ల కూర్చోబెట్టిండ్రు కదా.. నేను ఎక్కడికి రావాలె? కత్తి ఒకనికి ఇచ్చి యుద్ధం ఒకరిని చేయమంటే ఎట్లా అయితది?’ అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ప్రభుత్వంలో పదేళ్లపాటు ప్రశాంతంగా బతికామని తెలంగాణ సమాజం భావిస్తున్నదని, ఇప్పుడు తిరిగి మళ్లీ పాదయాత్రలు, ధర్నాలు, కొట్లాటలు మొదలయ్యాయని చెప్పారు. ‘తెలంగాణకు ఎప్పుడు ఇగ ఇదే లొల్లా..? ప్రశాంతంగా బతుకొద్దా..? తెలంగాణ సమాజం ఇకనైనా తెలివిగా ఆలోచన చేయాలి’ అని సూచించారు. పాదయాత్రలు కాదు మనసుతో యాత్రలు చేయాలని, బుర్రతో ఆలోచనలు చేయాలని పిలుపునిచ్చారు. ప్రశాంతంగా ఉన్న తెలంగాణను పాడు చేసుకునే ఆలోచనలు కాకుండా మన భవిష్యత్తు తరాలను మరింతగా బాగు చేసుకునే దిశగా ఆలోచన చేయాలన్నారు.

తెలంగాణ సంపదపై గుంటనక్కల కన్ను

తెలంగాణ సంపద మీద గుంటనక్కలు మాదిరి కన్నేసి ఉన్నారని.. రాష్ట్రాన్ని ఆగం చేయడానికి కొందరు రెడీగా ఉంటారని కేసీఆర్ అన్నారు. వీరి పట్ల తెలంగాణ యువత అప్రమత్తంగా ఉండాలని, ఎప్పటికప్పుడు తెలంగాణను ఆగం చేసి కుట్రలను పసిగట్టి కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. ఒక పొరపాటు జరిగితే జీవితకాలం దుఃఖపడాల్సి వస్తదని, ఎనిమిది మంది బీజేపీ ఎంపీలను, ఎనిమిది మంది కాంగ్రెస్ ఎంపీలను గెలిపిస్తే ఏకానా కూడా పని కాలేదని పేర్కొన్నారు. బీఆర్ఎస్ ప్రతినిధులను పార్లమెంటుకు పంపిస్తే కొట్లాడి హక్కులు కాపాడుకుందుము కదా అని చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, వంటేరు ప్రతాపరెడ్డి, మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి, మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుతో సహా పాదయాత్రలో పాల్గొన్న బీఆర్ఎస్ నేతలతోపాటు వందలాది కార్యకర్తలు పాల్గొన్నారు.

Tags:    

Similar News