Gaddam Prasad: మీ మనసుకు కష్టంగా ఉంటే నా వ్యాఖ్యలు విత్ డ్రా చేసుకుంటున్నా: స్పీకర్
ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి విషయంలో తాను చేసిన వ్యాఖ్యలను విత్ డ్రా చేసుకుంటున్నట్లు స్పీకర్ ప్రకంటించారు.

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ అసెంబ్లీ తొమ్మిదోరోజు బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈరోజు శాసనసభలో వివిధ శాఖల పద్దులపై చర్చ కొనసాగుతున్నది. అయితే నిన్న సభలో తన వ్యాఖ్యల వల్ల ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి (Sunita Lakshmareddy) మనసు కష్టపడితే నా వ్యాఖ్యలను విత్ డ్రా చేసుకుంటానని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ (Speaker Gaddam Prasad) అన్నారు. ఇవాళ సభ ప్రారంభమైన తర్వాత ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి మాట్లాడారు. స్పీకర్ వ్యాఖ్యలు నాకు బాధకలిగించాయని ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఎక్కడా పరిధి దాటి మాట్లాడలేదని అయినా తన పట్ల స్పీకర్ అలా మాట్లాడటం చాలా బాధేసిందన్నారు. నా విషయంలో మీరు చేసిన వ్యాఖ్యలు మీకు మంచివే అనిపిస్తే రికార్డులో ఉంచండి లేదా వాటిని రికార్డుల నుంచి తొలగించాలని కోరారు. అనంతరం స్పందించిన స్పీకర్ .. సునీతా లక్ష్మారెడ్డి అంటే నాకు ఎనలేని గౌరవం ఉందని, నాకు 8 మంది సోదరీమణులు ఉన్నారు. మహిళలను నేను ఎక్కువగా గౌరవిస్తానన్నారు. ఈ చైర్ నుంచి నేను మిమ్మల్ని అన్నాననుకోవడం చాలా పొరపాటు. మీరు మాట్లాడుతున్న సమయంలో ఇరు వైపుల నుంచి వచ్చిన రన్నింగ్ కామెంటరీ కారణంగా ఆ వ్యాఖ్యలు చేశారు తప్ప అవి మిమ్మల్ని ఉద్దేశించి కావన్నారు. ఒకవేళ నేను చేసిన వ్యాఖ్యలు మీ మనసును కష్టపెట్టి ఉంటే ఆ వ్యాఖ్యలను విత్ డ్రా చేసుకుంటున్నానని చెప్పారు.