PAC చైర్మన్‌పై వివాదం! తెలంగాణ బీజేపీ ఘాటు విమర్శలు

రాజ్యాంగాన్ని ఖూనీ చేయడం కాంగ్రెస్‌కు పరిపాటే.. అని తెలంగాణ బీజేపీ తీవ్ర విమర్శలు చేసింది.

Update: 2024-09-13 08:38 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: రాజ్యాంగాన్ని ఖూనీ చేయడం కాంగ్రెస్‌కు పరిపాటే.. అని తెలంగాణ బీజేపీ తీవ్ర విమర్శలు చేసింది. ఫిరాయింపు ఎమ్మెల్యేకు పీఏసీ చైర్మన్ పదవా..? అంటూ శుక్రవారం ఎక్స్ వేదికగా తెలంగాణ బీజేపీ ఆసక్తికర పోస్ట్ చేసింది. ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేకు దక్కాల్సిన ప్రజా పద్దుల కమిటీ చైర్మన్‌ పదవిని.. అధికార పార్టీలో చేరిన ఎమ్మెల్యేకు కట్టబెట్టడం అసెంబ్లీ నియమావళికి, పార్లమెంటరీ స్ఫూర్తికి విరుద్ధమని తెలిపింది. రాజ్యాంగ స్ఫూర్తిని ఖూనీ చేస్తూ.. శాసనసభ సంప్రదాయాలను సైతం మంటగలుపుతున్న కాంగ్రెస్‌కు ప్రజలు బుద్ధిచెప్పక తప్పదని తెలిపింది.

కాగా, ఇటీవల పీఏసీ చైర్మన్‌గా శేరిలింగం పల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీకి ప్రకటించడంపై తీవ్ర చర్చ జరుగుతోంది. అయితే ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారని, పార్టీ మారిన వారికి పీఏసీ ఎలా ఇస్తారని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. అయితే, అరికెపూడి గాంధీ టెక్నికల్‌గా బీఆర్ఎస్ ఎమ్మెల్యేనని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు.

ఈ క్రమంలోనే తెలంగాణ బీజేపీ సీఎం రేవంత్‌పై ఘాటు విమర్శలతో మరో ట్వీట్ చేసింది. చెప్పిందొకటి.. చేసేదొకటి.. అధికారం కోసం ఎన్ని అబద్ధాలైన చెప్పడం ఒక కాంగ్రెస్‌కే చెల్లుతుందని విమర్శించింది. పార్టీ ఫిరాయింపులపై ఎన్నికల ప్రచారంలో నీతులు మాట్లాడి.. అధికారంలోకి వచ్చాక సిగ్గులేకుండా ఫిరాయింపు ఎమ్మెల్యేలకు పదవులు కట్టబెడుతూ రాజ్యాంగ విలువలను తుంగలో తొక్కుతున్న వైనం.. అంటూ పేర్కొంది. ఎమ్మెల్యేలు పార్టీ మారింతే వారి ఇండ్ల ముందు చావు డప్పు కొట్టాలని పీసీసీ చీఫ్‌గా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి మాటలు చెప్పారని గుర్తుచేసింది.


Similar News