పచ్చని పల్లెల్లో ‘బెల్ట్’ చిచ్చు.. వైన్ షాప్‌ నిర్వాహకుల నయా దందా

‘పచ్చని పల్లెలే.. ప్రగతికి పట్టుగొమ్మలు’ అనే నానుడి ఏళ్లుగా ప్రచారంలో ఉంది.

Update: 2024-10-24 03:00 GMT

దిశ, నెక్కొండ: ‘పచ్చని పల్లెలే.. ప్రగతికి పట్టుగొమ్మలు’ అనే నానుడి ఏళ్లుగా ప్రచారంలో ఉంది. కానీ, వరంగల్ జిల్లా నెక్కొండ మండలంలోని గ్రామాల్లో పచ్చని పల్లెల్లో బెల్ట్ చిచ్చు ఆందోళనకు గురి చేస్తోంది. ఎక్సైజ్ శాఖ ఆదేశాల ప్రకారం వైన్ షాపుల నిర్వాహకులు నిబంధనల ప్రకారం మద్యం విక్రయించాలి. అలాంటిది ప్రభుత్వ ఆదేశాలను బేఖాతారు చేస్తూ వైన్‌షాపు నిర్వాహకులు సరికొత్త బెల్ట్ దందాకు తెర లేపారు. ప్రభుత్వం సైతం పల్లెల్లో ఉన్న బెల్ట్ షాపులను నియంత్రించడానికి ఎక్సైజ్ శాఖ అధికారులకు మౌఖికంగా ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.

మండల కేంద్రంలో నాలుగు వైన్ షాపులు మద్యం విక్రయిస్తున్నాయి. ఆయా షాపుల నుంచి నిత్యం గ్రామాల్లోని బెల్ట్ షాపులకు యథేచ్ఛగా మద్యం సరఫరా అవుతోంది. మండల వ్యాప్తంగా సుమారు 300 వరకు బెల్ట్ షాపుల నిర్వాహణ కొనసాగుతోంది. ఒక్క మండల కేంద్రంలోనే 40కి పైగా బెల్ట్ షాపులు నడుస్తున్నాయంటే దందా ఏలా నడుస్తుందో ఊహించుకోవచ్చు. ఈ తతంగం అంతా బహిరంగంగానే నడుస్తున్నా సంబంధిత అధికారులు నిమ్మకునీరెత్తిన్నట్లుగా వ్యవహరించడం గమనార్హం.

రిటైల్ షాపుల పేరుతో హోల్‌సేల్ దందా..

మండల కేంద్రంలోని వైన్ షాపుల నిర్వాహకులు మందుబాబులకు నిబంధనల మేరకు మద్యం విక్రయాలు చేయాలి. ఎక్సైజ్ శాఖ చట్టం ప్రకారం వ్యక్తులకు బీర్లు, ఫుల్ బాటిళ్లు పరిమితికి లోబడి మాత్రమే విక్రయించాలి. ఇక్కడ మాత్రం అలాంటి సూచనలు మచ్చుకు కూడా కనిపించవు. ఆటోలు, బైక్‌లపై వచ్చే బెల్ట్ షాప్ నిర్వాహకులకు పదుల సంఖ్యలో బీర్లు, బ్రాందీ, విస్కీ బాటిళ్లను కాటన్లకు కాటన్లు సరఫరా చేయడం పరిపాటిగా మారింది. ఇంత జరుగుతున్నా.. ఎక్సైజ్ శాఖ అధికారులు చూసీచూడనట్లుగా మామూలుగానే వదిలేస్తుండడంతో పలు అనుమానులు వ్యక్తం అవుతున్నాయి.

సీక్రెట్‌గా సిండికేట్..

మండల కేంద్రంలోని వైన్ షాపుల రూటే సపరేటు అన్న చందంగా తయారైంది. పేరుకు మాత్రం రిటైల్‌గా ఎంఆర్పీకే మద్యం విక్రయాలు జరుగుతున్నట్లుగా కనిపిస్తుంది. కానీ, అసలు కథ ఇక్కడే మొదలవుతుంది. ఇటీవల మండల కేంద్రంలో ఉన్న మూడు వైన్ షాపుల నిర్వాహకులు సిండికేట్‌గా మారారు. మండలంలో ఉన్న గ్రామాలను షాపునకు ఏడు గ్రామాల చొప్పున లక్కీ డ్రా రూపంలో పంచుకోవడం మండల వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

ప్రైవేట్ వ్యక్తులను ఏర్పరుచుకుని గ్రామాల్లో ఉన్న బెల్ట్ షాపులపై ఆజమాయిషీ చెలాయించడం కొస మెరుపు. ఇంత తతంగం జరుగుతున్నా.. వైన్ షాపులపై, బెల్ట్ షాపులపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో సంబంధిత అధికారుల చిత్తశుద్ధిపై ఆరోపణలు వినిపిస్తున్నాయి. గుడుంబాపై ఉక్కుపాదం మోపుతున్న సంబంధిత అధికారులు బెల్ట్ షాపులపై వల్లమాలిన ప్రేమ చూపించండంతో ప్రజలు అంతా మామూలుగా జరిగే తతంగమేనని గుసగుసలాడుకుంటున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు బెల్ట్ తీస్తారో.. లేదో వేచి చూడాల్సిందే.

బెల్ట్ షాపులను నిరోధించాలి

బెల్ట్ షాపులను విచ్చలవిడిగా నడపడం వల్ల యువత చెడు మార్గంలో వెళ్తోంది. సామాన్య, మధ్య తరగతి ప్రజలపై ఆర్థికభారం పడుతోంది. మైనర్లకు సైతం మద్యం విక్రయించడం వల్ల మద్యం మత్తులో బంగారు భవిష్యత్తు నాశనం అవుతుంది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలి.

- మల్లయ్య, బీడీఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి


Similar News