కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై అసహనం.. అసెంబ్లీ ఎదుట బీజేపీ ఎమ్మెల్యేల నిరసన
తెలంగాణలో శాసనసభ సమావేశాలు కొనసాగుతున్న సమయంలో అసెంబ్లీ ఎదుట బీజేపీ ఎమ్మెల్యేలు నిరసనకు దిగారు.

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణలో శాసనసభ సమావేశాలు (Telangana Aseembly Sessions) కొనసాగుతున్న సమయంలో అసెంబ్లీ ఎదుట బీజేపీ ఎమ్మెల్యేలు (BJP MLAs) నిరసనకు (Protest) దిగారు. బీజేఎల్పీ నేత ఏలేటీ మహేశ్వర్ రెడ్డి (BJLP Leader Eleti Maheshwar Reddy)ని అసెంబ్లీకి రానివ్వకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపిస్తూ.. అసెంబ్లీ ఎదుట బైఠాయించి ఆందోళన నిర్వహించారు. ఈ నిరసన కార్యక్రమంలో మహేశ్వర్ రెడ్డితో పాటు బీజేపీ ఎమ్మెల్యేలు పాయల్ శంకర్ (Payal Shankar), పాల్వాయి హరీష్ బాబు (Palwai Hareesh babu), ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్తా (Dhanpal Suryanarayana Guptha), పవార్ రామారావు పటేల్ (Pawar Ramarao patel) పాల్గొన్నారు.
ఈ సందర్భంగా.. ఆరు గ్యారెంటీల పేరు చెప్పి గద్దెనెక్కి, ఇచ్చిన హామీలను అమలు చేయకుండా విస్మరిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం పాలనా వైఫల్యాన్ని అసెంబ్లీ సాక్షిగా బీజేపీ ఎమ్మెల్యేలు నిలదీశారని తెలిపారు. అలాగే ప్రజల పక్షాన నిలిచి పోరాడుతున్న బీజేపీ ఎమ్మెల్యేల ధాటిని తట్టుకోలేక నిర్మల్ ఎమ్మెల్యే, బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డిని అసెంబ్లీకి రానివ్వకుండా అడ్డుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని అన్నారు. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వ చర్యల పట్ల నిరసన వ్యక్తం చేస్తూ.. అసెంబ్లీ ఆవరణలో బైఠాయించామని బీజేపీ ఎమ్మెల్యేలు చెప్పుకొచ్చారు. కాగా శాసన సభ సమావేశాలకు వస్తున్న బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డిని మార్గమధ్యంలో పోలీసులు అరెస్ట్ చేసి తరలించారు.
దీనిపై ఆయన మాట్లాడుతూ.. ప్రజల పక్షాన పోరాడుతూ, వారికిచ్చిన హామీలను నెరవేర్చాలంటూ రేవంత్ రెడ్డి చేతగాని తనాన్ని బట్టబయలు చేస్తూ, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఊపిరాడనివ్వకుండా చేస్తున్న బిజెపి ఎమ్మెల్యేలను అసెంబ్లీకి రానివ్వడం లేదని అన్నారు. అలాగే బీజేపీ ఎమ్మెల్యేలకు మాట్లాడే సమయం ఇవ్వకుంటే తమ ప్రభుత్వంపై వచ్చిన వ్యతిరేకత పోతుందని ఇలా చేస్తున్నారని తెలిపారు. ఇక ఇలాంటి పిట్ట బెదిరింపులకు బీజేపీ నాయకులు భయపడతారని అనుకోవడం కాంగ్రెస్ వెర్రితనమని, ఏది ఏమైనా, ప్రజలకు కాంగ్రెస్ పార్టీ చేసిన మోసాన్ని బీజేపీ నాయకులు ఎండగడతూనే ఉంటారని స్పష్టం చేశారు. ఇచ్చిన హామీలను నెరవేర్చేదాకా కాంగ్రెస్ పై బీజేపీ పోరాటం చేస్తూనే ఉంటుందని ఏలేటి అన్నారు.