BJP charge sheet: 6 అబద్దాలు.. 66 మోసాలు..కాంగ్రెస్ ఏడాదిపాలనపై బీజేపీ చార్జిషీట్
ఎన్నికల్లో అనేక హామీలు ఇచ్చిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ప్రజలకు వెన్నుపోటు పొడిచిందని కిషన్ రెడ్డి విమర్శించారు.
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో కాంగ్రెస్ ఏడాది పాలనపై తెలంగాణ బీజేపీ (Telangana BJP) చార్జిషీట్ దాఖలు చేసింది. ' కాంగ్రెస్ గ్యారంటీల గారడీ 6 అబద్ధాలు.. 66 మోసాలు' పేరుతో ఆదివారం హైదరాబాద్ లోని సోమాజిగూడాలో బీజేపీ నేతలతో కలిసి కేంద్ర మంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఈ చార్జిషీట్ (Charge Sheet) ను విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన కిషన్ రెడ్డి (Kishan Reddy) ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని ఈ ఏడాది కాలంలో ప్రభుత్వం నెరవేర్చలేదని కాంగ్రెస్ ను గెలిపించిన ప్రజలు అప్పుడే ఆలోచన పడ్డారన్నారు. కాంగ్రెస్ పాలనపై ఏ ఒక్క వర్గం సంతోషంగా లేరని విమర్శించారు.ఉద్యమకారుల ఆకాంక్షలు నెరవేర్చడంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. పదేళ్ల పాటు నియంతృత్వపాలన కుటుంబపాలన అవినీతి పాలన సాగిస్తే అలవికాని హామీలు ఇచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని విమర్శించారు.
బాధ్యతలేకుండా మాట్లాడలే:
6 గ్యారెంటీలు వంద రోజుల్లో అమలు చేస్తామని స్వయంగా సోనియా గాంధీ కరపత్రాల రూపంలో ఇంటింటికి చేర్చారు. కానీ ఈ ఏడాది కాలంలో మీరిచ్చిన హామీలు ఏవీ కూడా అమలు కాలేదు. డిసెంబర్ 7న అధికారంలోకి వస్తాను, డిసెంబర్ 9వ తేదీన రైతుల రుణమాఫీ చేస్తామని రేవంత్ రెడ్డి గతేడాది ఎన్నికలకు ముందు ఊరూరా ప్రజలను నమ్మించారు. కానీ ఈ ఏడాది కాలంలో హామీలు అమలు చేయకుండా ప్రభుత్వం విజయోత్సవాలు చేసుకోవడం ఏంటని ప్రశ్నించారు. కాంగ్రెస్ విజయోత్సవాలు చూసి ప్రజలు ఆశ్చర్యపోతున్నారని, విజయోత్సవాల కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారని విమర్శించారు. మిగతా పార్టీల మాదిరిగా మేం భాధ్యతారాహిత్యంగా విమర్శలు చేయడం లేదని ప్రభుత్వానికి ఏడాది కాలం పాటు గడువు ఇచ్చామని వంద రోజుల్లో అమలు చేస్తామని చెప్పిన పనులతో పాటు ఏడాదిలోపు మొదలు పెడతామన్న పనుల విషయంలో ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రశ్నిస్తున్నామన్నారు. కాంగ్రెస్ (Congress) ప్రభుత్వం ప్రజలకు వెన్నుపోటు పొడిచిందని వాటిని ప్రజల ముందు పెడుతున్నామన్నారు. గ్యారెంటీలు, డిక్లరేషన్ పేరుతో ఆయావర్గాలను నమ్మించిందో ఆ ఆంశాలపై తెలంగాణ ప్రజల పక్షాన చార్జిషీట్ రూపంలో విడుదల చేస్తున్నామన్నారు. ప్రజావ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తే అక్రమ కేసలు, అరెస్టులు, లాఠీచార్జీలు చేస్తున్నారని మండిపడ్డారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలన, ఏడాది కాంగ్రెస్ పాలనకు ఏమాత్రం తేడాలేదన్నారు. లోక్ సభ ఎన్నికల్లో తమకు కాంగ్రెస్ తో సమానంగా సీట్ల వచ్చాయని అందువల్ల ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని ప్రశ్నించే బాధ్యత మాపై ఉందన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలపై విమర్శలు చేయాలంటే రెండు రోజులు పడుతుంది. రుణమాఫీ అసంపూర్ణంగా అమలైందన్నారు. రైతుభోరో పేరుతో తెలంగాణ రేతులకు వెన్నుపోటు పొడిచింది. పండించిన పంటలకు రూ.500 బోనస్ ఇస్తామని చెప్పి ఇప్పుడు కేవలం వరికి మాత్రమే ఇవ్వడం ఏంటని నిలదీశారు.
మారింది పాలకులే పాలన కాదు:
దోపిడీలో బీఆర్ఎస్(BRS), కాంగ్రెస్ దొందు దొందేనని బీజేపీ విమర్శించింది. మారింది పాలకులే కానీ పాలన, ప్రజల బతుకులు మారలేదని చార్జిషీట్ లో దుయ్యబట్టింది. అప్పుడు కాళేశ్వరంతో లక్ష కోట్ల దోపిడీ, ఇప్పుడు మూసీతో లక్షన్నర కోట్లకు ఎసరు పెట్టారని ఆరోపించింది. గత పదేళ్లలో కే-ట్యాక్స్ ఉంటే ఇప్పుడు ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారని విమర్శించింది. ప్రజాస్వామాన్యానికి పాతరేస్తూ బీఆర్ఎస్ 12 మంది ఎమ్మెల్యేలను గతంలో గుంజుకుంటే ఇప్పుడు 10 మంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్ కొనుగోలు చేసిందని విమర్శించింది. ధరణితో 10 లక్షల రైతుల భూములను బీఆర్ఎస్ మాయం చేస్తే, ఇప్పుడు హైడ్రా, ఫోర్త్ సిటీతో కాంగ్రెస్ లక్షల ఇళ్ల కూల్చివేతలకు సిద్ధమైందని ఆరోపించింది. ఇక ధనిక రాష్ట్రాన్ని కేసీఆర్ ప్రభుత్వం అప్పుల్లో ముంచితే ఇప్పుడు ఏడాదిలోనే రూ. 80 వేల కోట్ల అప్పులను కాంగ్రెస్ చేసిందన్నారు. ఆడబిల్లలకు జీరో వడ్డికే రుణాలు ఇస్తామని బీఆర్ఎస్ పార్టీ మోసం చేస్తే, స్కూటీ, తులం బంగారం ఇస్తామని కాంగ్రెస్ మోసం చేసిందని పేర్కొన్నారు. ఈ ఏడాది కాంగ్రెస్ పాలనలో మహాలక్ష్మి పేరుతో మోసం, చీకట్లు నింపిన గృహజ్యోతి, అందని చేయూత, రైతుకు రాని భరోసా, కలగానే సొంతిండ్లు, కానరాని యువ వికాసం నిలిచిపోయిందని విమర్శించింది.