Bhoodan Land Scam: భూదాన్ కుంభకోణం.. ఈడీ విచారణకు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే
తెలంగాణలో భూదాన్ భూముల కుంభకోణంపై ఈడీ అధికారుల విచారణ కొనసాగుతోంది.
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో భూదాన్ భూముల (Bhoodan Land Scam) కుంభకోణంపై ఈడీ (ED) అధికారుల విచారణ కొనసాగుతోంది. ఈ కేసులో భాగంగా తాజాగా కీలక పరిణామం చోటు చేసుకుంది. నాగర్ కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి (Former BRS MLA) ని ఈడీ అధికారులు నేడు విచారణ చేయనున్నారు. మాజీ ఎమ్మెల్యేతో పాటు మరో ముగ్గరిని కూడా ఈడీ అధికారులు విచారించనున్నారు. వంశీ రామ్ బిల్డర్స్ సుబ్బారెడ్డి, మరో ఇద్దరికి హాజరు కావాలని ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు.
అదేవిధంగా ఈ కేసులో ఐఏఎస్ అధికారి అమోయ్ కుమార్, ఆర్డీవో, ఎమ్మార్వోను అధికారులు సుదీర్ఘంగా విచారించి కీలక వివరాలను సేకరించిన విషయం తెలిసిందే. మేడ్చల్ జిల్లాలో అమోయ్ కుమార్ కలెక్టర్‌గా పనిచేసిన సమయంలో భూ కుంభకోణం జరిగిందని బాధితులు ఈడీ అధికారులకు ఫిర్యాదు చేసిన సంగతి విదితమే. రూ.కోట్ల విలువైన భూమిని మార్కెట్ ధర కంటే తక్కువ ధరకు ఇతరులకు ఎలా కేటాయించారని అమోయ్ కుమార్‌ను ఈడీ అధికారులు గతంలో ప్రశ్నించారు.