Bhatti On Kcr: కేసీఆర్.. ఏ మొఖం పెట్టుకుని వస్తావ్? భట్టి విక్రమార్క ఫైర్
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు.
దిశ, డైనమిక్ బ్యూరో: ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించేందుకు త్వరలో కేసీఆర్ ప్రజల్లోకి రాబోతున్నారనే టాక్‌పై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఘాటుగా స్పందించారు. నాడు రూ.లక్ష రుణమాఫీ చేస్తామని చెప్పి మోసం చేసిన కేసీఆర్ ఇవాళ ఏ మొహం పెట్టుకుని రేవంత్‌రెడ్డిని ప్రశ్నిస్తారని నిలదీశారు. గురువారం పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో కాంగ్రెస్ నిర్వహించిన బహిరంగ సభలో భట్టి మాట్లాడారు. ‘డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇస్తామని చెప్పి ఇవ్వలేక పోయిన మీరు.. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి నియోజకవర్గంలో 3,500 ఇళ్లు ఇవ్వాలని బడ్జెట్ కేటాయిస్తే మీకు మాదిరిగా వాటిని ఎగ్గొట్టాలని చెప్పడానికి వస్తారా? జాబ్ క్యాలెండర్ ప్రకటించి ఉద్యోగాలు ఇస్తుంటే అవి తప్పు అని చెప్పడానికి వస్తారా? నిరుద్యోగుల కోసం స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తే ఇది తప్పు అని చెప్పడానికి వస్తారా?’ అని ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో తెలంగాణ సంపద దోపిడీకి గురైందని ఆరోపించారు. సింగరేణి ప్రాంతంలోని ప్రజల ఆస్తులు, శక్తిని, శ్రమను కేసీఆర్ దోచుకున్నారని మండిపడ్డారు. అందుకే కేసీఆర్‌ను దించి ఈ ప్రాంత ప్రజలు కాంగ్రెస్‌ను గెలిపించారని చెప్పారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని విధంగా కేసీఆర్ కుదేలు చేసి వెళ్తే తాము పరిస్థితిని చక్కదిద్ది ఒకటో తేదీనే జీతాలు ఇస్తున్నామని తెలిపారు. చెప్పినట్లుగానే రూ.2లక్షల రుణమాఫీ చేశామని చెప్పారు. ప్రభుత్వాన్ని బద్నాం చేయాలని చూస్తే బీఆర్ఎస్‌ను ప్రజలు క్షమించరని హెచ్చరించారు.
800 మెగావాట్ల పవర్ ప్లాంట్ ఏర్పాటు
రామగుండంలో 800 మెగావాట్ల పవర్ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తామని భట్టి ప్రకటించారు. రామగుండం ధర్మల్ బీ పవర్ ప్లాంట్‌ను మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్‌తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా జెన్కో ఆఫీసర్లతో మంత్రులు సమీక్ష నిర్వహించారు. అనంతరం భట్టి మాట్లాడుతూ.. తాను పాదయాత్ర చేసినప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పవర్ ప్లాంట్‌ని పునఃప్రారంభం చేస్తామని హామీ ఇచ్చామని గుర్తుచేశారు. ఆ హామీ మేరకు పవర్ ప్లాంట్ స్థలంలో కొత్త ప్లాంట్ ఏర్పాటు చేస్తామన్నారు. పత్తిపాక రిజర్వాయర్ కోసం బడ్జెట్ కేటాయించామన్నారు. ఎల్లంపల్లి భూనిర్వాసితుల పెండింగ్ సమస్యలు పరిష్కరిస్తామన్నారు.
పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో దగా : శ్రీధర్ బాబు
పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో సింగరేణి కార్మికులకు, రైతులకు దగా జరిగిందని మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. అర్హులైన రైతులకు తప్పకుండా రుణమాఫీ జరుగుతుందన్నారు. ఓ పక్క రుణమాఫీ జరుగుతుంటే మరో పక్క రుణమాఫీ కాలేదని బీఆర్ఎస్ గోబెల్స్ ప్రచారం చేస్తున్నదని మండిపడ్డారు. అధికారం పోయిందనే బాధతో ప్రభుత్వంపై బీఆర్ఎస్ బురదజల్లే ప్రయత్నం చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత పదేళ్లలో ఉద్యోగాలు కల్పించలేదు, సింగరేణి గురించి ఆలోచన చేయలేదు, అభివృద్ధి గురించి పట్టించుకోలేదని దుయ్యబట్టారు.