బీఆర్ఎస్ పోరాట ఫలితమే పీవీకి భారత రత్న.. కేసీఆర్ కీలక వ్యాఖ్యలు
భారత మాజీ ప్రధాన మంత్రి, దివంగత నేత పీవీ నరసింహారావుకు కేంద్ర ప్రభుత్వం భారత రత్న ప్రకటించింది.
దిశ, వెబ్‌డెస్క్: భారత మాజీ ప్రధాన మంత్రి, దివంగత నేత పీవీ నరసింహారావుకు కేంద్ర ప్రభుత్వం భారత రత్న ప్రకటించింది. శుక్రవారం ఈ విషయాన్ని స్వయంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సోషల్ మీడియా(ఎక్స్) వేదికగా ప్రకటించారు. తాజాగా.. పీవీకి భారతరత్న ప్రకటించడపై బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. పీవీ నరసింహారావుకు భారత రత్న దక్కడం హర్షణీయం అని ఆనందం వ్యక్తం చేశారు. పీవీకి దక్కిన ఈ పురస్కారం తెలంగాణ ప్రజలకు దక్కిన గౌరవంగా అభిప్రాయపడ్డారు. బీఆర్ఎస్ డిమాండ్‌ను గౌరవించి పీవీ నరసింహారావుకు భారత రత్న ప్రకటించిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి కేసీఆర్ ధన్యవాదాలు చెప్పారు.
కాగా, దేశంలోనే అత్యున్నత పురస్కారమైన భారత రత్న అవార్డు తెలంగాణ ప్రాంతానికి చెందిన వ్యక్తికి కేంద్ర ప్రభుత్వం ప్రకటించడంపై అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతూ.. కేంద్రానికి, ప్రధాని మోడీకి కృతజ్ఞతలు చెబుతున్నారు. దేశ అభివృద్ధిలో PV నరసింహారావు కీలకమైన పాత్ర పోషించారని కొనియాడుతున్నారు. 1991లో దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు, ఆయన ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు. ఆర్థికరంగ నిపుణుడు డాక్టర్ మన్మోహన్ సింగ్‌ను ఆర్థిక మంత్రిగా నియమించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, కేంద్రమంత్రిగా, ఎంపీగా, అసెంబ్లీ సభ్యుడిగా ఎన్నో ఏళ్లు బాధ్యతలు నిర్వర్తించారని దేశానికి ఎనలేని సేవలు అందించారని ప్రధాని మోడీ సహా పలువురు కీర్తిస్తున్నారు.