కొత్త క్రిమినల్ చట్టాలపై అవగాహాన ఉండాలి : కేంద్రమంత్రి నిత్యానందరాయ్

యువ ఐపీఎస్ లు కొత్త క్రిమినల్ చట్టాల పట్ల పూర్తి అవగాహన కలిగి ఉండాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ సూచించారు

Update: 2024-09-20 07:34 GMT

దిశ, వెబ్ డెస్క్ : యువ ఐపీఎస్ లు కొత్త క్రిమినల్ చట్టాల పట్ల పూర్తి అవగాహన కలిగి ఉండాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ సూచించారు. నేషనల్ పోలీస్ అకాడమీలో 76వ బ్యాచ్ ఐపీఎస్ పాసింగ్ ఔట్ పెరేడ్ కార్యక్రమానికి కేంద్రమంత్రి నిత్యానందరాయ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఐపీఎస్‌ల గౌరవందనాన్ని కేంద్రమంత్రి స్వీకరించారు. అనంతరం కేంద్రమంత్రి నిత్యానంద రాయ్ మాట్లాడుతూ.. శిక్షణ పూర్తి చేసుకున్న ట్రైనీ ఐపీఎస్ లకు అభినందనలు తెలియజేశారు. కఠిన శిక్షణ పూర్తి చేసుకుని... దేశ సేవ చేయడానికి వెళ్తున్న ఐపీఎస్‌లు అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. ‘‘భారతీయ పోలీసింగ్ భవిష్యత్ మీ పైన ఆధారపడి ఉందని, భారత పోలీస్ సేవలను అత్యున్నత స్థానంలో నిలబెడతారనే నమ్మకముందని చెప్పారు.

డిజిటల్ యుగంలో టెక్నాలజీతో అప్డేట్ అవుతూ నేర నియంత్రణ, పరిశోధన సామర్థ్యం పెంచుకోవాలన్నారు రోజురోజుకు పెరుగుతున్న సైబర్ క్రైమ్‌ను కట్టడి చేయడానికి కృషి చేయాలన్నారు. సైబర్ ఫోరెన్సిక్ ల్యాబ్స్ ద్వారా కేసులను తొందరగా పరిష్కరించాలని తెలిపారు. నేరస్తులను పట్టుకొని వారికి తొందరగా శిక్షలు పడేలా చూడాలన్నారు. ఉగ్రవాదులు, సంఘ విద్రోహ శక్తుల పట్ల కఠినంగా ఉండాలన్నారు. కోవిడ్ టైమ్ లో పోలీసుల సేవ గొప్పది అని కేంద్రమంత్రి నిత్యానంద రాయ్ కొనియాడారు. కాగా.. నేషనల్ పోలీస్ అకాడమీలో 76వ బ్యాచ్ ఐపీఎస్ పాసింగ్ ఔట్ పెరేడ్ ఘనంగా జరిగింది. పోలీస్ అకాడమీ నుంచి 188 మంది ట్రైనీ ఐపీఎస్ లు పాస్ అవుతున్నారు. వీరిలో 54 మంది మహిళా ఐపీఎస్‌లు ఉన్నారు. ఏపీకి నలుగురు ట్రైనీ ఐపీఎస్‌లు, తెలంగాణకు నలుగురు ట్రైనీ ఐపీఎస్‌లను కేంద్రం కేటాయించింది.

 


Similar News