మరోసారి కేసీఆర్ ఫాంహౌజ్ ప్రస్తావన తెచ్చిన బండి సంజయ్

ముఖ్యమంత్రి కేసీఆర్‌ను మంత్రి కేటీఆర్ మానవత్వానికి నిదర్శనమని చెబుతున్నాడని, కానీ నిజానికి కేసీఆర్ ఒక మానవ మృగమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శలు చేశారు.

Update: 2023-02-10 14:17 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: ముఖ్యమంత్రి కేసీఆర్‌ను మంత్రి కేటీఆర్ మానవత్వానికి నిదర్శనమని చెబుతున్నాడని, కానీ నిజానికి కేసీఆర్ ఒక మానవ మృగమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శలు చేశారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సిరిసిల్ల జిల్లాకు చెందిన సెస్ మాజీ వైస్ చైర్మన్ లగిశెట్టి శ్రీనివాస్ శుక్రవారం కాషాయతీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు బండి సంజయ్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం బండి సంజయ్ మాట్లాడుతూ.. సిరిసిల్ల జిల్లాలో జరిగేది మాములు యుద్ధం కాదన్నారు. అక్కడ బీజేపీ ఏ కార్యక్రమం చేపట్టినా నాయకులు, కార్యకర్తలను అరెస్ట్ చేస్తున్నారని, ఇది పరిపాటిగా మారిందన్నారు. భవిష్యత్‌లో కేసీఆర్ సర్కార్ విధానాలు ఇలాగే కొనసాగితే ప్రజలకు చెప్పులు చేతులో పట్టుకోవడమే మిగులుతుందని, అందుకే ప్రజలు ఆలోచించాలని కోరారు. అసెంబ్లీలో కేసీఆర్ ఏం మాట్లాడుతున్నారో ప్రజలంతా గమనిస్తున్నారని, గతంలో ఆయన ఇచ్చిన హామీలేంటి? అందులో ఎన్ని అమలు చేశారో ఆయనకు గుర్తుందా? అని బండి ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన బడ్జెట్‌పై ప్రజల్లో కనీసం చర్చ కూడా జరగడంలేదంటే పరిస్థితా ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు.

సీఎం కేసీఆర్ మాటలు ప్రజలు విశ్వసించే పరిస్థితి లేదని ఆయన పేర్కొన్నారు. చేనేత బంధు ఎంతమందికి ఇచ్చారో కేసీఆర్ సమాధానం చెప్పాలని బండి ప్రశ్నించారు. ఒక్క బతుకమ్మ చీర ఇచ్చి చేనేతల బతుకును బర్ బాద్ చేశాడని ధ్వజమెత్తారు. సీఎం కేసీఆర్.. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలెన్ని, అందులో నెరవేర్చినవి ఎన్ని అని బండి నిలదీశారు. కేసీఆర్‌కు వయసు మీద పడిందని, అందుకే ఏం మాట్లాడుతున్నాడో కూడా అర్థం కావడంలేదన్నారు. పోడు పట్టాలు ఇస్తానని ఎనిమిదిన్నరేండ్లుగా ఇవ్వలేదని, ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్నాయనే కారణంగా ఇస్తామని అంటున్నాడన్నారు. ఇచ్చే ఉద్దేశ్యమే ఉంటే ఇన్ని రోజులు ఫైల్ ఎందుకు ఆపారో సమాధానం చెప్పాలని సంజయ్ ప్రశ్నించారు. పోడు భూములకు ఎలాంటి లింకులు పెట్టకుండా పట్టా ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు. లేదంటే పేద ప్రజలు కేసీఆర్ ఫామ్ హౌజ్ దున్నడం ఖాయమని తెలిపారు. మంత్రి కేటీఆర్, గ్లోబరీనా సంస్థ సంయుక్తంగా చేసిన తప్పిదాలతో ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారని, ఇవి ప్రభుత్వానికి కనిపించడం లేదా అని మండిపడ్డారు. జర్నలిస్టుల సంక్షేమంలో తెలంగాణ టాప్ అని చెబుతున్న కేసీఆర్.. గతంలో పాతాళంలోకి తొక్కుతా అన్నది మరిచిపోయారా అని సంజయ్ మండిపడ్డారు.

తెలంగాణలోని ప్రతీ జర్నలిస్టుకు వారంలో డబుల్ బెడ్రూం ఇండ్లు ఇవ్వాలని, చేతకాదంటే.. తనకు చెబితే కేంద్రం నుంచి మాట్లాడి తానైనా ఇప్పిస్తానని బండి స్పష్టం చేశారు. పత్రికలను బ్లాక్ మెయిల్ చేసి వార్తలు రాయించుకుంటున్నాడని ధ్వజమెత్తారు. సెక్రటేరియట్‌లో పోచమ్మ తల్లి ఆలయాన్ని కూల్చారని, అక్కడ తిరిగి గుడి కట్టాలని సంజయ్ డిమాండ్ చేశారు. ప్రగతి భవన్ కూడా ఒక ఫామ్ హౌజ్‌లా మారిందని, అక్కడికి కూడా ఎవరికీ అనుమతి ఉండదని సంజయ్ చురకలంటించారు. ప్రతి సంవత్సరానికి పాత బస్తీలో రూ.1000 కోట్ల విద్యుత్ బకాయిలు ఉంటున్నాయని, ఇది తాము చెప్పడం లేదని, నివేదికలే చెబుతున్నాయన్నారు. విద్యుత్ చౌర్యం జరిగే ప్రాంతాల్లో తెలంగాణలోనే ఫస్ట్ ప్లేస్ పాత బస్తీ అని బండి వెల్లడించారు. కేసీఆర్ సర్కారు కొద్ది నెలల్లో ఇంటికి పరిమితం కావడం ఖాయమని ఆయన జోస్యం చెప్పారు.

అనంతరం పార్టీలోకి చేరిన లగిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ.. తాను గత ఆరేండ్లుగా బీఆర్ఎస్ లో ఉన్నట్లు తెలిపారు. తెలంగాణ అంటేనే ఆత్మగౌరవమని, కానీ నేడు అది ఆ పార్టీలో లేదన్నారు. అందుకే పార్టీ మారుతున్నట్లు స్పష్టంచేశారు. తన పనితనం చూసే కేటీఆర్ తనను బీఆర్ఎస్ లోకి ఆహ్వానించారని గుర్తుచేశారు. కానీ అక్కడ తనను తీవ్రంగా అవమానించారని, ఎన్నో అవమానాలు భరించినట్లు పేర్కొన్నారు. ప్రధాని మోడీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పనితీరు చూసి బీజేపీలో చేరుతున్నట్లు చెప్పారు. బతుకమ్మ చీరల పేరిట చేనేత కార్మికులకు కేసీఆర్ ఏదో మంచి చేశానని అనుకుంటున్నాడని, వాస్తవానికి తమ మార్కెట్, వ్యాపారాన్ని దెబ్బతీసి కేవలం బతుకమ్మ చీరలకు మాత్రమే తమను పరిమితం చేశాడని ధ్వజమెత్తారు. ఆ చీరల డబ్బులు కూడా సమయానికి ఇవ్వడం లేదని మండిపడ్డారు. ఏ ఆర్నెళ్లకో ఇచ్చినా అది వడ్డీలకే సరిపోతోందని విమర్శలు చేశారు. సిరిసిల్లలో నేటికీ ఎంతో మంది బీఆర్ఎస్ నేతలు అవమానాలు ఎదుర్కొంటున్నారని, వాటిని తట్టుకోలేక బయటకు వెళ్దామనుకున్నా ప్రభుత్వ పథకాలు కట్ చేస్తామని భయపెడుతున్నారన్నారు. అయినా తనవెంట 400 మంది కార్యకర్తలు వచ్చి బీజేపీలో చేరారని తెలిపారు.

Also Read..

రేవంత్, బండి సంజయ్‌ వ్యాఖ్యలపై అసెంబ్లీలో కేటీఆర్ ఫైర్

Tags:    

Similar News