మోడీ ఫొటోను డీపీగా పెట్టుకోండి.. కేంద్ర మంత్రి బండి సంజయ్ పిలుపు
హర్ ఘర్ తిరంగ కార్యక్రమంలో ఈనెల 15న ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరేసి దేశ భక్తిని చాటి చెప్పాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ బీజేపీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
దిశ, తెలంగాణ బ్యూరో: హర్ ఘర్ తిరంగ కార్యక్రమంలో ఈనెల 15న ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరేసి దేశ భక్తిని చాటి చెప్పాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ బీజేపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. అందులో భాగంగా శనివారం నుంచి పంద్రాగస్టు వరకు ప్రతి ఒక్కరూ ప్రధాని మోడీ, దేశభక్తుల ఫొటోలను వాట్సప్ డీపీలుగా పెట్టుకోవాలని సూచించారు. పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా ఢిల్లీలో ఉన్న బండి సంజయ్ శుక్రవారం కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని బీజేపీ శ్రేణులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోలింగ్ బూత్ కమిటీ మొదలు రాష్ట్రస్థాయి నాయకుడి వరకు పార్టీ జెండాలను పక్కనపెట్టి దేశభక్తిని ప్రజల్లో పెంపొందించడమే హర్ ఘర్ తిరంగా లక్ష్యమన్నారు. పోలింగ్ బూత్ అధ్యక్షులు తప్పనిసరిగా తమ పోలింగ్ బూత్ పరిధిలోని ప్రతి ఇంటికి వెళ్లి జాతీయ జెండా కొనేలా చేసి పంద్రాగస్టు రోజు ఆయా ఇండ్లపై ఎగరేసేలా అవగాహన కల్పించాలని సూచించారు.
అందులో భాగంగా ప్రతి బీజేపీ కార్యకర్త కనీసం 50 మందికి తగ్గకుండా ఫోన్లు చేయడంతోపాటు జాతీయ జెండా ఎగరేయాలని కోరుతూ వంద మందికి సందేశాలు పంపాలని పిలుపునిచ్చారు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో నెలకొల్పిన జాతీయ నేతల విగ్రహాలను శుద్ది చేయాలని సూచించారు. దేశభక్తిని పెంపొందించడమే లక్ష్యంగా కార్యక్రమాలు నిర్వహించాలని, అందులో భాగంగా ఈనెల 12న ఉదయం 10 గంటలకు కరీంనగర్ లో నిర్వహించే తిరంగ యాత్రలో తాను పాల్గొంటానని తెలిపారు. మరోవైపు పార్లమెంట్ ఎన్నికల ఫలితాల్లో 80 శాతానికి పైగా ఓట్లు పోలైన పోలింగ్ బూత్ ల ఎంపిక పూర్తయ్యిందని, పంద్రాగస్టు తరువాత ఆయా పోలింగ్ బూత్ కమిటీలను సన్మానించడంతోపాటు నగదు ప్రోత్సాహకాలు అందిస్తామని బండి సంజయ్ స్పష్టంచేశారు.
నేడు హైదరాబాద్ కు ‘బీఎస్‌కే’
పార్లమెంట్ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడిన నేపథ్యంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ శనివారం తెలంగాణకు రానున్నారు. శనివారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు పార్టీ రాష్ట్ర కార్యాలయానికి విచ్చేసి కార్యకర్తలు, నాయకులకు అందుబాటులో ఉంటారు. సాయంత్రం ఇతర కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆదివారం కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో పలు కార్యక్రమాలకు హాజరవడంతోపాటు వివిధ అభివృద్ధి పనులను ప్రారంభిస్తారు.