Balapur Ganesh : బాలాపూర్ గణేష్ లడ్డూ వేలం కొత్త రూల్స్! ప్రత్యేక ఆకర్షణగా గణపయ్య

హైదరాబాద్ నగరంలో వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా ఖైరతాబాద్ బడా గణేష్ తర్వాత అందరికీ గుర్తుకు వచ్చే పేరు బాలాపూర్ వినాయకుడు.

Update: 2024-09-07 10:21 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్ నగరంలో వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా ఖైరతాబాద్ బడా గణేష్ తర్వాత అందరికీ గుర్తుకు వచ్చే పేరు బాలాపూర్ వినాయకుడు. బాలాపూర్ గణేష్ విగ్రహం లడ్డూ వేలం పాటలో దేశవ్యాప్తంగా తనకంటూ ప్రత్యేక స్థానం ఉంది. ఈ లడ్డూ ప్రసాదం స్వీకరిస్తే ఎంతో పుణ్యం అని భక్తులు నమ్ముతారు. అయితే, ఎప్పటి లాగే ఈ సారి కూడా బాలాపూర్ గణేష్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ ఏడాది రామమందిర మండపం సెట్టింగ్‌లో బాలాపూర్‌ గణేష్ అందమైన రూపంలో కొలువుదీరాడు. గతేడాది బెజవాడ దుర్గమ్మ ఆలయ నమూనా ఏర్పాటు చేసిన బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి ఈ సారి అయోధ్య రామాలయ నమూనాను దించేసింది. దీంతో భక్తులను రామమందిర మండపం ఆకట్టుకుంటోంది. ఈ నేపథ్యంలోనే భక్తులు సెల్ఫీలు తీసుకుంటూ అయోధ్య ఆలయంలో ఉన్నట్లుగా మురిసిపోతున్నారు. ప్రముఖ డెకరేటర్ సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో అయోధ్య రామాలయ నమూనాను రూపొందించామని ఉత్సవ సమితి సభ్యులు చెబుతున్నారు.

కాగ, బాలాపూర్ గణేష్ ఎప్పటి లాగే ఈ సారి కూడా అందమైన రూపంలో వినూత్నంగా కొలువుదీరాడు. తల పైభాగంలో అమృతం కోసం సముద్రంలో మంధర పర్వతాన్ని దేవతలు, రాక్షసులు మదనం చేస్తున్నట్లుగా రూపొందించారు. కూర్చున్న ఆకృతిలో కనిపించే గణపయ్య ఒక చేతిలో త్రిశూలం, రెండో చేతిలో ఓంకారం, మూడో చేతిలో గొడ్డలి, నాలుగో చేతిలో లడ్డూ పెట్టే వీలుగా విగ్రహాన్ని తీర్చిదిద్దారు. కాగా, బాలాపూర్‌ లడ్డూకు కూడా ఎంతో ప్రాముఖ్యత ఉన్న విషయం తెలిసిందే. 1994లో రూ. 450కు ప్రారంభమైన లడ్డూ వేలం గత ఏడాది 2023 లో రూ. 27 లక్షల ధర పలికింది. వేలం ద్వారా వచ్చిన డబ్బుతో ఆలయాల అభివృద్ధి, బోరు, షెడ్ల నిర్మాణం, వరద బాధితులకు సహాయం వంటి కార్యక్రమాలు చేపడతారు. అయితే, ఈ ఏడాది లడ్డూ వేలం పాట రూ. 30 లక్షలు దాటొచ్చని అంచనా వేస్తున్నారు.

బాలాపూర్ గణేష్ లడ్డూ వేలం కొత్త రూల్స్..! 

అయితే ఈ ఏడాది లడ్డూ వేలం పాటకు కొత్త రూల్స్ పెట్టారు. గతంలో బయటి వ్యక్తులు మాత్రమే లడ్డూ వేలంలో పాల్గొనేందుకు డబ్బులు ముందుగా డిపాజిట్ చేసేవారు. ఈ సారి బాలాపూర్ గ్రామ ప్రజలతో పాటు లడ్డూ వేలంలో పాల్గొనే వారంతా ముందస్తు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. సూచించిన డబ్బులు డిపాజిట్ చేస్తేనే వేలం పాటలో పాల్గొనాలని నిర్వాహకులు చెబుతున్నారు.


Similar News