యువత కేసీఆర్ ఉచ్చులో పడొద్దు : మాజీ మంత్రి రవీంద్రనాయక్

తెలంగాణ రాష్ట్ర సమితిని భారత రాష్ట్ర సమితిగా మార్చి తెలంగాణ పదాన్ని సైతం కనుమరుగు చేసిన కేసీఆర్ రాజకీయంగా చచ్చిన పాము అని, అయినా తోకాడిస్తున్నాడని మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత రవీంద్రనాయక్ విమర్శలు చేశారు.

Update: 2024-09-16 17:38 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ రాష్ట్ర సమితిని భారత రాష్ట్ర సమితిగా మార్చి తెలంగాణ పదాన్ని సైతం కనుమరుగు చేసిన కేసీఆర్ రాజకీయంగా చచ్చిన పాము అని, అయినా తోకాడిస్తున్నాడని మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత రవీంద్రనాయక్ విమర్శలు చేశారు. బీఆర్ఎస్ తెలంగాణాను ధ్వంసం చేసిందని, గత అసెంబ్లీ ఎన్నికల్లో చావు దెబ్బతిని పార్లమెంట్ ఎన్నికల్లో సైతం ప్రజలు గుండుసున్నా ఇచ్చినా కేసీఆర్ కు బుద్ధిరాలేదని సోమవారం ఒక ప్రకటనలో మండిపడ్డారు. కేసీఆర్ హయాంలో తెలంగాణకు జరిగిన విధ్వంసాన్ని.. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజాపాలన ద్వారా రాష్ట్రాన్ని గాడిలో పెడుతున్నారన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా ఒకేసారి రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేసి చరిత్ర సృష్టించారని పేర్కొన్నారు. దీన్ని భరించలేక కేసీఆర్, బీఆర్ఎస్ నాయకులు నీళ్లు లేని చెరువులో చేపల వలె గిలగిల కొట్టుకుంటున్నారని రవీంద్ర నాయక్ ఎద్దేవాచేశారు. కేసీఆర్ హయాంలో అక్రమార్జన, అడ్డగోలుగా లక్షలాది కోట్ల డబ్బు, వేలాది ఎకరాల భూములు కొల్లగొట్టారని ఆరోపణలు చేశారు. తెలంగాణ కోసం ప్రాణాలొడ్డిన అమరుల కుటుంబాలను కనీసం ఆదుకోలేదని విమర్శలు చేశారు. ఇప్పుడు తిరిగి సెంటిమెంట్ ను రగల్చాలని చూస్తున్నారని, కేసీఆర్ ఉచ్చులో యువత పడవద్దని విజ్ఞప్తిచేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కేసీఆర్ ఆటలు సాగవని హెచ్చరించారు. కేసీఆర్ అవినీతిని బట్టబయలు చేస్తే ఆ కేసుల నుంచి బయటపడే వరకు బీఆర్ఎస్.. వీఆర్ఎస్ తీసుకోవడం ఖాయమని రవీంద్ర నాయక్ చురకలంటించారు. ఖాళీ దిమాక్ సైతాన్ కా ఘర్ అన్నట్లుగా బీఆర్ఎస్ నేతలు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ ఇప్పుడు ఏమీ చేయలేడని, కానీ కోట్లాది లక్షల అవినీతి సొమ్ముతో ప్రజాపాలనకు అడ్డంకులు సృష్టించే ప్రయత్నం చేస్తారని, అందుకే ఆయనతో పాటు ఆయన అనుయూయుల అవినీతిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఆయనపై విమర్శలకే పరిమితమైందని, కానీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని రవీంద్ర నాయక్ ఫైరయ్యారు. 


Similar News