పోటీ పరీక్షలు రాసే అభ్యర్థులకు టి-సాట్ గుడ్ న్యూస్
తెలంగాణ నిరుద్యోగ యువతకు టి-సాట్(తెలంగాణ స్కిల్ అకడమిక్ ట్రైనింగ్) నెట్వర్క్ అనునిత్యం అండగా ఉంటుందని సీఈవో బోదనపల్లి వేణుగోపాల్ రెడ్డి అన్నారు.
దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ నిరుద్యోగ యువతకు టి-సాట్(తెలంగాణ స్కిల్ అకడమిక్ ట్రైనింగ్) నెట్వర్క్ అనునిత్యం అండగా ఉంటుందని సీఈవో బోదనపల్లి వేణుగోపాల్ రెడ్డి అన్నారు. పోటీ పరీక్షల కోసం జనరల్ స్టడీస్ ఫర్ ఆల్ పేరుతో అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడే కంటెంట్ ను ఈ నెల 25 నుంచి ప్రసారం చేయాలని నిర్ణయించినట్టు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. టీజీపీఎస్సీ ఆధ్వర్యంలో నిర్వహించే అన్ని పరీక్షలకూ కంటెంట్ అందిస్తున్న టి-సాట్ నెట్వర్క్ కేంద్ర ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థలు నిర్వహించే ఇతర పోటీ పరీక్షల కంటెంట్ ను అందించిన ఏకైక సంస్థగా పేరు తెచ్చుకుందని వేణుగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. పోటీ పరీక్షల అవగాహన, పాఠ్యాంశాల ప్రసారాల్లో భాగంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన సుమారు 600 ఎపిసోడ్స్ 10 సబ్జెక్టులకు సంబంధించి 500 రోజులు కంటెంట్ ప్రసారం చేస్తున్నామని సీఈవో ప్రకటించారు.
టి-సాట్ నిపుణ ఛానల్ లో మధ్యాహ్నం 12 నుంచి ఒంటి గంట, మూడు నుండి నాలుగు గంటల వరకు, విద్య ఛానల్ లో అదే రోజు రాత్రి ఎనిమిది నుంచి 10 గంటల వరకు పున:ప్రసారమౌతాయన్నారు. పోటీ పరీక్షల్లో ప్రధాన సబ్జెక్టులైన తెలంగాణ ఉద్యమం, ఇండియన్ హిస్టరీ, మ్యాథ్స్, జాగ్రఫీ, పాలిటీ వంటి సబ్జెక్టులతో పాటు సోషల్ ఎక్స్ క్లూజన్, జనరల్ ఇంగ్లీష్ వంటి ప్రత్యేక సబ్జెక్టులకు సంబంధించిన కంటెంట్ ప్రసారం చేస్తున్నామని సీఈవో వివరించారు. పోటీ పరీక్షలకు హాజరయ్యే యువత తాము ప్రసారం చేసే పాఠ్యాంశాలను సరైన విధంగా ఉపయోగించుకోవాలని సూచించారు. టి-సాట్ ప్రసారాలు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడంలో ఎంతగానో తోడ్పాటును అందించాయని ఉద్యోగాలు పొందిన అభ్యర్థులు తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తుంటే తమ ప్రయత్నాలకు సత్ఫలితాలు వస్తున్నాయన్న ఆనందం కలుగుతుందని సీఈవో పేర్కొన్నారు.