స్వాతంత్ర పోరాటంలో బీజేపీ పాత్ర ఏంటి?

స్వాతంత్ర పోరాటంలో బీజేపీ పాత్ర ఏమిటని? ఎంపీ మల్లు రవి ప్రశ్నించారు.

Update: 2024-09-16 17:28 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: స్వాతంత్ర పోరాటంలో బీజేపీ పాత్ర ఏమిటని? ఎంపీ మల్లు రవి ప్రశ్నించారు. సోమవారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో రాజుల పాలన పోయి, ప్రజాపరిపాలన మొదలైందన్నారు. దేశంలోనూ మార్పు రావాలన్నారు. ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రజాపాలన ఉత్సవాలు జరుగుతున్నాయన్నారు. పార్టీలకు అతీతంగా ప్రభుత్వం ఆహ్వానాలు అందించిందన్నారు. కేంద్రంలోని బీజేపీ నాయకులకూ ఇన్విటేషన్లు ఇచ్చామన్నారు. కానీ వాళ్లే ప్రజాపాలనలో భాగస్వామ్యం అయ్యేందుకు ఆసక్తి చూపడం లేదని వెల్లడించారు. సెప్టెంబరు 17న ప్రభుత్వం పెద్ద ఎత్తున కార్యక్రమం చేపట్టనున్నదన్నారు. గడిచిన పదేళ్లుగా బీఆర్ఎస్ పవర్లో ఉండి సెప్టెంబరు 17ను గుర్తించలేదన్నారు.

ఎమ్మెల్యే మందుల శ్యాముల్ మాట్లాడుతూ.. సెప్టెంబర్ 17న తెలంగాణకు విముక్తి కలిగిన రోజు అని పేర్కొన్నారు. కాంగ్రెస్, కమ్యూనిస్టులు కలిసి తెలంగాణకు విముక్తి కల్పించారన్నారు. అప్పటి హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ చొరవతో జరిగిందన్నారు. సర్దార్ పటేల్‌తో బీజేపీకి ఏం సంబంధం? అంటూ ప్రశ్నించారు. కాంగ్రెస్ మనిషిని, బీజేపీ తమ వారసుడుగా చెప్పుకోవడం సిగ్గుచేటు అని వెల్లడించారు. సర్దార్ పటేల్ నిక్కార్సైన కాంగ్రెస్ బిడ్డ అని స్పష్టం చేశారు. బీజేపీ పాలనలో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు ఏమైన లబ్ధి కలిగిందా? అని మండిపడ్డారు. ఇక కౌశిక్ రెడ్డి అనే వ్యక్తి కాంగ్రెస్ పార్టీలో కోవర్టుగా పని చేసి, బీఆర్ఎస్‌కు వెళ్లాడన్నారు. కౌశిక్ లాంటి వ్యక్తిని వెనకేసుకొస్తే, హరీష్ రావు, కేటీఆర్‌ల పరువే పోతుందన్నారు. డైనమిక్ సీఎం రేవంత్ రెడ్డి గురించి మాట్లాడే అర్హత లేదన్నారు.


Similar News