చారిత్రక ఆనవాళ్లు దెబ్బతినకుండా ఆలయాల్లో అభివృద్ధి పనులు చేపట్టాలి : మంత్రి కొండా సురేఖ

రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాల్లో చేపట్టే అభివృద్ధి పనులు దేవాలయాల ప్రాశస్త్యం, క్షేత్ర విశిష్టతకు భంగం కలుగకుండా, చారిత్రక ఆనవాళ్ళు దెబ్బతినకుండా జాగ్రత్తగా చేపట్టాలని అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖామంత్రి కొండా సురేఖ అధికారులను ఆదేశించారు.

Update: 2024-09-18 17:34 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాల్లో చేపట్టే అభివృద్ధి పనులు దేవాలయాల ప్రాశస్త్యం, క్షేత్ర విశిష్టతకు భంగం కలుగకుండా, చారిత్రక ఆనవాళ్ళు దెబ్బతినకుండా జాగ్రత్తగా చేపట్టాలని అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖామంత్రి కొండా సురేఖ అధికారులను ఆదేశించారు. రాష్టంలోని ప్రముఖ దైవ క్షేత్రాలైన కీసరగుట్ట రామలింగేశ్వర స్వామి ప్రగతి, వైటీడీఏ ఆధ్వర్యంలో.. యాదాద్రి దేవాలయ పురోగతికి చేపడుతున్న కార్యక్రమాలు, భద్రాచలం సీతారామచంద్ర స్వామి ఆలయ అభివృద్ధికి సంబంధించిన మాస్టర్ ప్లాన్, పలు దేవాలయాల్లో సౌకర్యాల కల్పనపై సెక్రటేరియట్ లోని దేవాదాయ ధర్మదాయ మంత్రిత్వ శాఖ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్ లో దేవాదాయశాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. దేవాలయాల ప్రగతికి చేపట్టే పనులు అటవీ, దేవాదాయ, పర్యాటక, సాంస్కృతిక, ఆర్&బీ, పంచాయతీ రాజ్ తదితర శాఖల సమన్వయంతో ఎలాంటి ఆటంకాలు లేకుండా కొనసాగేలా చర్యలు చేపట్టాలని సూచించారు. మానిటరింగ్ కమిటీ నివేదిక సమర్పించిన తర్వాత యాదగిరిగుట్ట గర్భగుడి విమాన గోపురం స్వర్ణతాపడం, వేదపాఠశాల నిర్మాణ పనులను ప్రారంభించనున్నట్లు తెలిపారు. కంచి కామకోటి పీఠం ఆధ్వర్యంలో గోవింద హరిచైర్మన్ గా రాయగిరిలో 20 ఎకరాల్లో 43 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో వేదపాఠశాలను నిర్మించనున్నట్లు ప్రకటించారు. సిద్ధమైన అన్నదాన సత్రాన్ని త్వరలోనే ప్రారంభించనున్నట్లు వెల్లడించారు.

యాదాద్రి దేవస్థానానికి రాకపోకల నిమిత్తం ఎగ్జిట్ ఫ్లై ఓవర్ పైనే ఆధారపడిన భక్తులకు నెట్వర్క్ ఆర్చ్ బ్రిడ్జ్ (ఎంట్రీ ఫ్లై ఓవర్) గొప్ప ఉపశమనం లభించనుందని, మెకల్లై స్టీల్ తో నిర్మించనున్న 64 మీటర్ల ఈ ఫ్లై ఓవర్ ఇండియాలోనే రెండో అతి పొడవైన బ్రిడ్జ్ కావడం తెలంగాణకు ప్రత్యేకతను తెచ్చి పెడుతుందన్నారు. 3 నెలల్లో ఈ లింకింగ్ ఫ్లై ఓవర్ నిర్మాణ పనులు పూర్తి చేయాలని దిశానిర్దేశం చేశారు. కచ్చితమైన ప్రణాళికతో కీసరగుట్ట దేవాలయాన్ని అభివృద్ధి చేయాలని అధికారులను ఆదేశించారు. రామప్ప దేవాలయం స్ఫూర్తితో కీసరగుట్ట రామలింగేశ్వర స్వామి దేవస్థానం, నాట్యమండపం, పరిసరాలను తీర్చిదిద్దాలని సూచించారు. దేవాలయం చుట్టూ ఉన్న లక్ష్మీనరసింహా, ఆంజనేయ, నాగదేవతల ఆలయాలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా పనులు చేపట్టాలన్నారు. దేవాలయ ప్రాశస్త్యాన్ని వివరించే పుస్తకాల ముద్రణతో పాటు వెబ్సైట్ ను ఆధునీకరించాలని సూచించారు. కీసరలో శ్రీరాముడి విగ్రహాన్ని ప్రతిష్టించాలని సూచించారు. చేర్యాల నకాషీ చిత్రకళ, పోచంపల్లి చేనేత, పట్టు వస్త్రాల స్టాళ్లను ఏర్పాటు చేసే దిశగా కళాకారులను ప్రోత్సహించాలని సూచించారు. సవరణలతో కూడిన మాస్టర్ ప్లాన్ పై సమీక్ష అనంతరం సీఎంకు అందజేసి వెంటనే పనులను ప్రారంభించనున్నట్లు మంత్రి తెలిపారు. భద్రాచలం అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ రూపొందించాలన్నారు. దేవాలయ అభివృద్ధి పనులకు అవసరమైన భూ సేకరణ వివరాలను అధికారులు మంత్రికి వివరించారు. దేవాలయాన్ని ఆనుకుని ఉన్న రోడ్డు విస్తరణలో భాగంగా కుసుమ హరనాథ దేవాలయం దెబ్బతినే పరిస్థితులుండటంతో ప్రత్యామ్నాయ మార్గాలను సూచించారు. దీని చుట్టూ రిటైనింగ్ వాల్ నిర్మాణానికి ప్రభుత్వపరంగా అవసరమైన సహకారం అందించాలన్నారు. రాముడు దక్షిణ భారతదేశంలో తిరుగాడిన ప్రాంతాల వివరాలను వివరిస్తూ డిజిటల్ మ్యూజియం ఏర్పాటుకు అధికారులు ప్రతిపాదించగా మంత్రి ఆమోదం తెలిపారు. ట్రైబల్ మ్యూజియం ఏర్పాటు నిమిత్తం మంత్రి సీతక్కతో చర్చిస్తానన్నారు. అన్ని ప్రముఖ దేవాలయాల్లో ఆకర్షణీయమైన లైటింగ్, ఫౌంటెన్స్ ఏర్పాటు చేసేలా చర్యలు చేపట్టాలని సూచించారు.

మూడు సర్క్యూట్లలో భక్తులకు వీఐపీ దర్శన సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. వేములవాడ, కొండగట్టు, ధర్మపురి, కొమురవెల్లి ఒక సర్క్యూట్ గా, మన్యంకొండ, శ్రీరంగపూర్, జోగులాంబ దేవాలయం, అమ్మపల్లి దేవాలయం ఒక సర్కూట్ గా, డిచ్ పల్లి దేవాలయం, బాసర, కామారెడ్డిలో ప్రముఖ దేవాలయాలు ఒక సర్క్యూట్ గా భక్తులకు వీఐపీ దర్శన సౌకర్యాన్ని అందుబాటులోకి తెస్తున్నట్లు అధికారులు మంత్రికి వివరించారు. గైడ్, వీడియోగ్రాఫర్, ఫోటోగ్రాఫర్ లు వీఐపీ భక్తులకు సేవలందించనున్నట్లు కమిషనర్ హన్మంతరావు తెలిపారు. సమావేశంలో దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్, వైటీడీఏ వైస్ చైర్మన్ కిషన్ రావు, చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ వెంకన్న గౌడ్, డీఈఈ ఐశ్వర్య, వైటీడీఏ ఎస్టేట్ ఆఫీసర్ సంతోష్, కంచి కామకోటి వేదపాఠశాల చైర్మన్ గోవింద హరి, కన్జర్వేషన్ ఆర్కిటెక్ట్ సూర్య నారాయణ మూర్తి తదితరులు పాల్గొన్నారు. 


Similar News