ఆర్థిక నష్టంలో పెన్షనర్లు!

పింఛను పొందే సమయంలో సాధారణంగా ఉద్యోగులు తమ పింఛనులో 40% మొత్తాన్ని కమ్యూట్ చేస్తారు. దానికి బదులుగా ఒక ఏక మొత్తాన్ని

Update: 2024-09-19 01:00 GMT

పింఛను పొందే సమయంలో సాధారణంగా ఉద్యోగులు తమ పింఛనులో 40% మొత్తాన్ని కమ్యూట్ చేస్తారు. దానికి బదులుగా ఒక ఏక మొత్తాన్ని పొందుతారు. కమ్యూట్ చేయబడిన మొత్తం ప్రస్తుత నిబంధనల ప్రకారం ప్రతి నెలా ఉద్యోగి పెన్షన్ నుండి 15 సంవత్సరాల పాటు, అంటే 180 నెలల పాటు ప్రభుత్వం వెనక్కి రాబట్టుకుంటుంది. ఈ 15 సంవత్సరాల రికవరీ కొన్ని అంశాలైన ద్రవ్యోల్బణం, మోర్టాలిటీ రేటు, జీవన ప్రమాణం, కమ్యూటేషన్ కారకం ఆధారంగా ఉంటుంది. 2008లో భారత ప్రభుత్వం దీర్ఘకాలంగా ఉన్న కమ్యూటేషన్ పట్టికలను సవరించింది. ఈ పట్టికలను 2010లో తెలంగాణ (అప్పటి ఏపీ)లో అనుసరించింది. 2010 జనవరి వరకు కమ్యూటేషన్ కారకం 10.46 ఉండగా, 2010 ఫిబ్రవరి నుండి అది 8.371కి తగ్గింది. కమ్యూటేషన్ కారకం తగ్గినప్పటికీ, రికవరీ కాలం మాత్రం అలాగే ఉంది. 

2010 కు ముందు పదవీ విరమణ చేసిన వారు, 2010 తర్వాత పదవీ విరమణ చేసిన వారి కంటే ఎక్కువ కమ్యూటేషన్ కారణంగా ఎక్కువ మొత్తం పొందుతారు. కానీ వారి పింఛను నుండి వసూలు కాలం అలాగే ఉంది. ఇద్దరి రికవరీ కాలం మాత్రం 15 సంవత్సరాలే. నిజానికి పింఛను నుండి కమ్యూట్ చేయబడిన విలువ వడ్డీతో సహా 128 నెలలలోనే వసూలు చేయబడుతున్నా, ప్రభుత్వం 180 నెలల దాకా వసూలు చేస్తున్నారు. ఇది అన్యాయమైనది, అహేతుకమైనది. అనేక రాష్ట్రాల్లో ఈ రికవరీ 12 నుండి 13 సంవత్సరాల మధ్యలో ఉంటుంది. కేరళలో 12 సంవత్సరాలు, మధ్యప్రదేశ్, గుజరాత్‌లో 13 సంవత్సరాలు. ప్రత్యేకంగా కేరళలో 12 సంవత్సరాల రికవరీ కొన్ని దశాబ్దాల క్రితం నుండి ఉంది. 5వ కేంద్ర వేతన కమిషన్ దశాబ్దాల క్రితమే రికవరీ కాలం 12 సంవత్సరాలు మాత్రమే ఉండాలని సిఫార్సు చేసింది.

హైకోర్టు ఉత్తర్వులిచ్చినా...

దురదృష్టవశాత్తు ఇప్పటి వరకు భారత ప్రభుత్వం దీనిపై ఏ ఉత్తర్వులు వెలువరించలేదు. ఇటీవల సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఇతర సభ్యుల నేతృత్వంలోని రెండవ న్యాయ సంఘం కూడా రికవరీ కాలం 12 సంవత్సరాలు ఉండటం సమంజసమైనది, సహేతుకమైనది అని అభిప్రాయం వ్యక్తం చేసింది. ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా, కొంతమంది పదవీ విరమణ చేసిన ప్రభుత్వ ఉద్యోగులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ మధ్య కాలంలో చండీగఢ్ హైకోర్టు 10 సంవత్సరాలు రికవరీ పూర్తిఅయిన పెన్షనర్స్ విషయాల్లో తదుపరి రికవరీ చేయడాన్ని నిలిపివేసే తాత్కాలిక ఉత్తర్వులు జారీ చేసింది. దీనిని ఆధారం చేసుకొని హర్యానా, పంజాబ్ ప్రభుత్వాలు 10 సంవత్సరాలు రికవరీ పూర్తి అయిన వారి పెన్షన్ నుండి తదుపరి ఉత్తర్వులు యిచ్చువరకు రికవరీని నిలుపుదల చేస్తూ సంభందిత అధికారులకు సూచనలు జారీ చేసింది.

రికవరీ పీరియడ్ తగ్గించాల్సిందే!

మన రాష్ట్రంలో కూడా మన పెన్షన్ సంఘం జేఏసీతో పాటు చాలా ఉద్యోగ, ఉపాధ్యాయ, సంఘాలు కూడా ప్రస్తుత రెండవ తెలంగాణ పే రివిజన్ కమిషనర్ గారికి పై వాస్తవ విషయాలను నివేదించడం జరిగింది. అట్లే సంబంధిత అధికారులకు, పెన్షనర్, ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల గ్రూపులలో కమ్యూటేషన్ రిస్టోరేషన్ రికవరీ పీరియడ్ తగ్గింపు విషయమై ఆయా రాష్ట్రాల్లోని కోర్టు కేసులు, మధ్యంతర ఉత్తర్వులు, దానిపై ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలపై ఎప్పటికప్పుడు అవగాహన కల్పిం చడం జరుగుతున్నది. ఇది సహేతుకమైన డిమాండ్. అట్లే ప్రభుత్వంపై భారం పడనిది కూడా. కనుక అందరూ ఏకతాటిపై నిలబడి సానుకూలంగా సమస్యను పరిష్కరించుకోవలసి ఉంటుంది.

మనోహర్ రావు చిలప్పగారి

విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగి,

96406 75288

Tags:    

Similar News