రజకులు అస్పృశ్యులే... ఎస్సీ హోదాకు అర్హులే..!
తెలంగాణ రాష్ట్ర మొక్కటే కాదు, ఎస్సీ రిజర్వేషన్ లేని అన్ని రాష్ట్రాల్లోనూ, కేంద్రపాలిత ప్రాంతాల్లోనూ తమని షెడ్యూల్డ్ కులాల జాబితాలో
తెలంగాణ రాష్ట్ర మొక్కటే కాదు, ఎస్సీ రిజర్వేషన్ లేని అన్ని రాష్ట్రాల్లోనూ, కేంద్రపాలిత ప్రాంతాల్లోనూ తమని షెడ్యూల్డ్ కులాల జాబితాలో చేర్చాలని వాషర్ మెన్ కమ్యూనిటీ 74 ఏళ్లుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తూనే ఉంది. రజకులు అస్పృశ్యులు.. రజకుల అస్పృశ్యతను గుర్తించకుండా, రజకుల్ని 'దళితులలో కలపమనడం న్యాయ బద్ధమేనా' అని ప్రశ్నించిన రచయితకు విస్తృత సామాజిక పరిశీలన ఉన్నట్టు లేదు. షెడ్యూల్డ్ కులాల జాబితాలో తమ కులాన్ని చేర్చాలని రజకులు కోరటం న్యాయబద్ధమైన డిమాండ్ కాదని, సమాజంలో రజకుల పట్ల వివక్ష లేదని చెప్తూ, రజకులు బీసీల మురికి బట్టలే ఉతికారు తప్ప, మాల మాదిగల బట్టలు ఉతికారా? అని ప్రశ్నించిన రచయిత ఆలోచనలే అన్యాయంగా ఉన్నాయి.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, గుజరాత్, పంజాబ్, మహారాష్ట్ర, కర్ణా టక తదితర రాష్ట్రాల్లో రజకుల్ని షెడ్యూల్డ్ కులాల జాబితాలో చేర్చాల్సి ఉంది. అర్హత లేక కాదు, ఐక్యత లేకనే. తెలుగు రాష్ట్రాల తో పాటు ఎస్సీ హోదా లేని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో రజకుల్ని షెడ్యూల్డ్ కులాల జాబితాలో చేర్చటం లేదు.
రజకులు ‘చండాలుర’న్నది మనుస్మృతే!
బ్రిటిష్ ఇండియా ప్రభుత్వంలో బ్రిటిష్ అధికారులు పరిశోధించి రాసిన పుస్తకాల్లో కూడా రజకులు అంటరానివారనే ఉంది. రజకులు అంటరాని వారు కాబట్టే దేశంలోని 16 రాష్ట్రాల్లో రజకుల్ని షెడ్యూల్డ్ కులాల జాబితాలో చేర్చారు. దేశవ్యాప్తంగా ఉన్న ప్రాచీన కులాల్లో రజక కులం కూడా ఒకటి. అంబేద్కర్ రాజ్యాంగం, బ్రిటిష్ రాజ్యాంగం రాకముందు, ప్రజల్ని పాలించేందుకు పాలకులు వేల సంవత్సరాల నాటి ప్రాచీన ధర్మ శాస్త్రాలు, స్మృతులను ప్రామాణికంగా తీసుకున్నారు. వీటిలో ఆనాటి సామాజిక కట్టుబాట్లు - వెసులుబాట్లు, నేరాలు - శిక్షలు గురించి రాశారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ తగలబెట్టిన మనుస్మృతిలో రజకులు అంటరాని వారు అని రాసి ఉంది. గాడిదల్ని, కుక్కల్ని సాకే రజకుడు ‘చండాలుడ’ని పేర్కొన్నారు. మనుస్మృతి లోనే కాదు, పరాశర స్మృతిలో, వేద వ్యాస స్మృతిలో రజకులు అంత్యజులు (అంటరాని వారు) అని పేర్కొన్నారు. బ్రిటిష్ ఇండియా ప్రభుత్వంలో బ్రిటిష్ అధికారులు పరిశోధించి రాసిన పుస్తకాల్లో కూడా రజకులు అంటరానివారనే ఉంది. J H Hutton రాసిన Caste in India Its Nature, Function and Origins, Edgar Thurston రాసిన Castes and Tribes of Southern India, E.A.H. Blunt రాసిన The Caste System Of Northern India, నిజాం ప్రభుత్వ ఉన్నతాధికారి Syed Siraj ul Hassan రాసిన The Castes and Tribes of H.E.H. the Nizam's Dominions తో పాటు ఇంకా అనేక పుస్తకాల్లో రజకుల అంటరానితనం గురించి ప్రస్తావించారు.
అంటరానితనం ఒక్కటే ప్రామాణికమా?
ఆర్టికల్ 17 ద్వారా 1955లో అంటరానితనాన్ని కేంద్ర ప్రభుత్వం నిషేధించిన తర్వాత దేశంలోని ఆయా రాష్ట్రాల షెడ్యూల్డ్ కులాల జాబితాలో ఏదేనీ ఒక కులాన్ని చేర్చడమనేది, ఆ కులం సామాజిక, ఆర్థిక, వెనుకబాటు ప్రాతిపదికనే జరుగుతోంది. ఈ దేశానికి స్వతంత్రం వచ్చాక, షెడ్యూల్డ్ కులాలకు 1950లో రిజర్వేషన్లు కల్పించారు. అంటరానితనాన్ని నిషేధించక ముందు కూడా షెడ్యూల్డ్ కులాలను గుర్తించేందుకు అంటరానితనం ఒక్కటే ప్రామాణికంగా తీసుకోలేదు. 1950 నాటి మొదటి జాబితాతో పాటు, నేటి వరకూ జరిగిన సవరణల ద్వారా షెడ్యూల్డ్ కులాల జాబితాలో చేర్చబడిన కొన్ని కులాలకు అస్పృశ్యత లేదు. 1948 నుండి 1956 వరకూ హైదరాబాదు రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల జాబితాలో 32 కులాలు ఉన్నాయి. ఆంధ్ర, హైదరాబాద్ రాష్ట్రాలు 1956లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఏర్పడ్డాక, ఆంధ్రాలోని 32 కులాలు, హైదరాబాదులోని 32 కులాలు, వెరసి 64 కులాలుకు గాను, 1) చలవాది, 2) చమర్, మోచి, ముచి 3) మాదిగ 4) మాల కులాలు రెండు రాష్ట్రాల్లోనూ ఉండడంతో, ఉమ్మడి రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల జాబితాలో కులాల సంఖ్య 60 (రాష్ట్రవ్యాప్తంగా 4 కులాలు, తెలంగాణలో 28 కులాలు, ఆంధ్రలో 28 కులాలు) అయ్యింది. ఈ జాబితాలో ఒక కులాన్ని తొలగించారు.
లేని కులాల్ని చేర్చి..
ఆంధ్రప్రదేశ్ నుండి విడిపోయి, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డాక తెలంగాణ రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల జాబితాలోని కులాల సంఖ్య 32గా ఉండాలి, అయితే ఈ సంఖ్య మునుపటిలాగా 59 గానే ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బీసీ కులాల జాబితాలోని 139 కులాల్లో 26 ఆంధ్ర ప్రాంతపు కులాలను బీసీ జాబితా నుండి తొలగించిన తెలంగాణ ప్రభుత్వం, షెడ్యూల్డ్ కులాల సంఖ్యను మాత్రం తగ్గించలేదు. ఆనాడే తెలంగాణ ప్రభుత్వాన్ని దీనిపై ప్రశ్నించి ఉంటే, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను ప్రశ్నించాలని చెప్పే నైతికత రజకులకు ఉండేది. అటు తెలంగాణ, ఇటు ఆంధ్ర రాష్ట్రాలలో ఉనికి లేని 28 షెడ్యూల్డ్ కులాలను తొలగిస్తే చాకలి వంటి నిజమైన అస్పృశ్య కులాన్ని షెడ్యూల్డ్ కులాల జాబితాలో చేర్చడం కష్టం కాదు. చాకలి కులం షెడ్యూల్ కులాల జాబితాకు భారం కాదు.
‘అంటరాని’తనం అంటే ఏమిటి?
ఒక వ్యక్తి లేదా ఒక కులం చేసే పనిలో మైల ఉంటే, ఆ పని అంటరాని పని అని స్మృతులు, శాస్త్రాలు చెప్పాయి. మైల పని చేసే వ్యక్తిని అంటరాని వ్యక్తిగా, మైలపని చేసే కులాన్ని అంటరాని కులంగా గుర్తించారు. ఆంధ్రప్రదేశ్‌లో ఈరోజుకి కూడా మైల పని చేస్తున్న కులాల్లో రజక కులం కూడా ఒకటి. పుట్టుక, చావు, రుతుక్రమం మైల పనులని మనువు చెప్పాడు. రజక మహిళ మంత్రసానిగా పురుడు పోసింది, వెనుకబడిన ప్రాంతాల్లో ఇంకా పోస్తూనే ఉంది. చావుకు సంబంధించి పాడె కట్టడం దగ్గర్నుంచి శవం మొలతాడు తొలగించడంతో పాటు, ఆ శవాన్ని కాల్చే పనిని కూడా ఈ రోజుకీ రజకులు చేస్తున్నారు. చాలామందికి రజకులు శవాలను కాలుస్తారనే విషయం తెలియదు. బ్రాహ్మణులు, వైశ్యుల శవాలను దహనం చేసేది, విశ్వబ్రాహ్మణుల శవాలను ఖననం చేసేది రజకులే. దాయాదులు, దగ్గరి బంధువులు కూడా దింపుడు కళ్లం వరకు వచ్చి ఆగిపోయినా, అంత్యక్రియల రోజు, చిన్న కర్మ రోజు రజకుడు స్మశానానికి వెళ్లి తన విధులు నిర్వర్తిస్తాడు. పెద్దకర్మ ముగిసే వరకూ అంటు ఉండే మృతుడి కుటుంబ సభ్యుల బట్టలన్నీ ఉతికిస్తాడు ఇవన్నీ అంటు పనులే కదా. ఒక వ్యక్తి విడిచిన బట్ట కేవలం మాసిన బట్ట మాత్రమే కాదు, ఆ వ్యక్తి యూరిన్, మోషన్, చెమట, కన్నీరు, కంటి పుసి, చెవి గుబిలి, ముక్కు పొక్కులు, చీమిడి, నోటి జల్లు, పుండ్ల చీము, నెత్తురు, డెడ్ స్పెరం, ఇంకా అనేక జబ్బుల తాలూకా బ్యాక్టీరియాతో మలినమైన బట్టను రజకుడు నెత్తిన పెట్టుకొని మోస్తాడని, చేతులతో శుభ్రం చేస్తాడని జ్ఞాపకం చేసుకోండి.
వారి బట్టల్నీ రజకులు ఉతికారు..!
చివరగా ఒక మాట, అంటరానితనాన్ని నిషేధించక ముందు కూడా మాల, మాదిగల బట్టల్ని రజకులు ఉతికారు. ఇందుకు సంబంధించిన ఆధారాలు బ్రిటిష్ ప్రభుత్వంలో ప్రచురితమైన అనేక పుస్తకాల్లో నమోదు చేయబడి ఉన్నాయి. సొంతంగా నిర్ణయాలు తీసుకోవడానికి చాకలేమీ పట్వారి కాదు. గ్రామ సేవకుడు. ప్యూర్ వర్క్ చేసేది కూలీ అయితే, ఇంప్యూర్ వర్క్, అంటచబుల్ వర్క్ చేసేది చాకలి అని గుర్తుంచుకోవాలి. మాల, మాదిగలను ఊరవతల ఉంచినోడే, చాకళ్ళను కూడా ఊరి చివర ఉంచాడు. పల్లెటూళ్ళను గమనిస్తే, కులాల వారి నివాస గృహాలు కనిపిస్తాయి. బ్రాహ్మణుల గృహాలకు ఒక్కొక్క దూరంలో ఒక్కో కులం వారి నివాస గృహాలు ఉండటాన్ని మనం చూడొచ్చు. ఈ ఆధారాలను కూడా భారత ప్రభుత్వం నమోదు చేసింది. మాల, మాదిగ కులాల బట్టలు ఉతకటం రజకులను ఎస్సీ జాబితాలో చేర్చేందుకు ప్రధాన అర్హత అయితే కాదు. నిచ్చెన మెట్ల కుల వ్యవస్థలో ఏ రెండు కులాలు ఒకటి కాదు. ప్రతి రెండు కులాల మధ్య అస్పృశ్యత వివక్ష ఉన్నాయి. షెడ్యూల్డ్ కులాల జాబితాలో ఉన్న 59 కులాల మధ్య కూడా అస్పృశ్యత, వివక్ష ఉంది.
రజకులకూ ఇళ్లలోకి ప్రవేశం లేదు..
రజకులు తాము బట్టలు ఉతికే అందరి ఇళ్లల్లోకి వెళతారనే అభిప్రాయం నిజం కాదు. అది అపోహ మాత్రమే. నిజానికి బ్రాహ్మణులు, వైశ్యులు, క్షత్రియుల ఇళ్లలోకి రజకులకు ప్రవేశం లేదు. బ్రాహ్మణులు, వైశ్యులు, క్షత్రియులు విడిచిన బట్టల్ని రజకులు పెరటి గుమ్మం గుండా వెళ్లి తీసుకునేవారు. ఉతికిన తడి, పొడి బట్టల్ని ప్రధాన ద్వారం ముందుండే పంచలో ఉంచేవారు. పసుపు నీరు చల్లుకొని బ్రాహ్మణులు, వైశ్యులు, క్షత్రియులు ఆ బట్టల్ని తీసుకెళ్లేవారు.
మాపై ఈ మరక పోయేదెప్పుడు?
రజకుల జీవితంలో కష్టాలు, కన్నీళ్లు, అవమానాలు ఉన్నట్టే అస్పృశ్యత, వివక్ష వెన్నంటే ఉన్నాయి. రజకుడు ఉతికితే మొండి మరకలు కూడా పోయాయి గానీ, రజకుడికి అంటిన అస్పృశ్యతకు, రజకుడి పట్ల వివక్షకు కులం ఉన్నంతవరకూ అంతం లేదు. షెడ్యూల్డ్ కులాల జాబితాలో మమ్మల్ని చేర్చండి మహాప్రభో.. అని రజకులు అడుగుతుంది కేవలం మర్యాద కోసం, సామాజిక భద్రత కోసం. ప్రభుత్వాల ఏర్పాటుకు రజకుల మద్దతు అనివార్యమని పాలకులు గుర్తించిన రోజు తెలుగు రాష్ట్రాల్లో రజకులు ఎస్సీలు అయి తీరుతారు. ఈ పరిణామాన్ని ఎవరూ ఆపలేరు. ఐక్యతతో మాత్రమే ఈ మార్పు సాధ్యం.
పొటికలపూడి జయరాం,
ఏపీ రాష్ట్ర అధ్యక్షులు,
రజక రిజర్వేషన్ పోరాట సమితి,
94413 70816