తిలా పాపం తలా పిడికెడు..
కేంద్ర ప్రభుత్వం, ప్రతి రాష్ట్ర ప్రభుత్వం కొలువుదీరిన కొత్త లోనే అవినీతిరహిత పరిపాలన, నల్లధనం నిర్మూలనే తమ ధ్యేయంగా ప్రకటిస్తాయి.
కేంద్ర ప్రభుత్వం, ప్రతి రాష్ట్ర ప్రభుత్వం కొలువుదీరిన కొత్త లోనే అవినీతిరహిత పరిపాలన, నల్లధనం నిర్మూలనే తమ ధ్యేయంగా ప్రకటిస్తాయి. ఆ దిశగా తమ పాలన సాగుతుందని హామీ ఇస్తాయి. అయితే ఇవన్నీ న్యాయస్థానాలలో దేవుని ఎదుట అంతా నిజమే చెప్తామని చేసే ప్రమాణాల్లాంటివే.
అందరూ విధేయులైన పౌరులే..
ప్రభుత్వ ఉద్యోగాలలో చేరే ముందు అన్ని స్థాయిల ఉద్యోగులు చేసే ప్రమాణాలు, పాలకులు చేసే పదవీ స్వీకార ప్రమాణాలూ ఇదే బాపతు. వీటికి తోడు, ప్రతి సంవత్సరం అవినీతి వ్యతిరేక వారోత్సవాల్లో భాగంగా అందరూ పౌరుల సమగ్రతా ప్రతిజ్ఞ తీసుకుంటారు. కానీ ఈ మంత్రాలకు చింతకాయలు రాలవనడానికి ఏడాది ఏడాదికీ పెరుగుతున్న అవినీతే నిదర్శనం. అరకొర చర్యల వల్ల కూడా నల్లధనాన్ని నియంత్రణ చేయడం జరిగే పని కాదన్నది కూడా చరిత్ర పాఠం. ఆదాయపన్ను లెక్కలలో చూపించని ఆదాయాన్ని ఐచ్ఛికంగా ప్రకటించి, కొంత అపరాధ రుసుముతో పన్నులు చెల్లించే పథకాలు (వాలంటరీ డిస్క్లోజర్ స్కీమ్స్), పెద్ద నోట్ల అకస్మిక రద్దు నల్లధనాన్ని అరికట్టలేకపోయాయి కదా. అందుకే రోగం సరిగా నిర్ధారించి చికిత్స చేయాలని వేరే చెప్పనక్కర్లేదు. అలాంటి చర్యలలో ప్రధానమైనది భూముల నమోదు కార్యాలయాల్లో (రిజిస్ట్రార్ ఆఫీస్) ప్రభుత్వం నిర్ణయించిన స్థిరాస్తుల ధర (guideline rate). ఏ రాష్ట్ర ప్రభుత్వం అతి స్వల్పంగానైనా ఈ ధరలు పెంచాలని ప్రయత్నించినా, గగ్గోలు మొదలవుతుంది. ఎందుకంటే స్థిరాస్తి వ్యవహారాలలో అమ్మే వారు, కొనేవారు కూడా వాస్తవ ధరను పత్రాలకెక్కించరు. మనందరి లాగే వారూ విధేయులైన పౌరులు కదా. ప్రభుత్వ ధరలనే శిరసావహిస్తారు.
సాధారణంగా చేసింది అసాధారణమైంది..!
కానీ అసలు విషయం అందరికీ తెలిసినదే. ఆస్తుల క్రయ విక్రయాలలో, రెండువైపులా నల్లధనానిదే (లెక్కలలో చూపని సంపాదన) ప్రధానపాత్ర. తలలు బద్దలు కొట్టుకున్నా, వాస్తవ ధర, స్థిరాస్తి పత్రాల నమోదుకు ప్రభుత్వాలు నిర్ణయించిన ధర ఒకటే కానంతవరకు నల్లధనం ప్రవహిస్తూనే ఉంటుంది. విచిత్రంగా అవినీతిని, నల్లధనాన్ని అరికట్టే చర్యల్లో భాగంగా భారత నేర పరిశోధనా సంస్థ (సీబీఐ) నిఘా విభాగం, (విజిలెన్స్ కమిషన్), జాతీయ దర్యాప్తు సంస్థ( ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్) వగైరాలు జరిపే దాడులలో పట్టుబడిన ఆస్తుల ప్రస్తుత వాస్తవ ధర ఎంత ఉండవచ్చునో కూడా ప్రకటిస్తారు. అలాగే ఎవరైనా దాతలు భూ విరాళం ఇస్తే, ప్రసార మాధ్యమాలు ఆ స్థలం/ భవనం వాస్తవ ధర కూడా తెలియపరుస్తాయి. కొన్నేళ్ల క్రితం మహా విశాఖపట్న నగరాభివృద్ధి సంస్థ ఒక స్థల వేలానికి రిజిస్ట్రార్ కార్యాలయ ధర కంటే అధికంగా వెలగట్టి (అయినా విపణి ధరకు తక్కువగానే )టెండర్లను ఆహ్వానిస్తే, పత్రికలన్నీ ప్రశంసించాయి. అంటే, సాధారణంగా చేయవలసింది అసాధారణమైందన్నమాట. కానీ, ఇవేవీ అధికారులకు పట్టవు. అందుకు వారి కారణం వారికుంది.
తోటి ప్రయాణికుడు చేసిన గీతాబోధ
ఒకసారి వేరే రాష్ట్రంలో బస్సు ప్రయాణం చేస్తున్నాను. తోటి ప్రయాణికుడితో మాటలు కలిసాయి. స్నాతకోత్తర పట్టభద్రుడు. (ఎం ఏ) ఆ రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయంలో హ్రస్వలిపి లేఖకుడు(స్టెనో) " చక్కగా ఏ కళాశాలలోనో ఉపన్యాసకుడుగా చేరకుండా, ఈ కర్మ ఏమిటండీ" అని ఆశ్చర్యపోయాను. చిరునవ్వే సమాధానం. బస్సు మధ్యలో ఆగినప్పుడు లో గొంతుతో " నా ఉద్యోగం రిజిస్ట్రార్ కార్యాలయంలోనండి" అన్నాడు అంతకంటే ఏమీ చెప్పనక్కర్లేదన్నట్టు. "మరి మీరు స్టెనో కదా. రిజిస్ట్రేషన్ వ్యవహారంతో మీకు సంబంధం ఉండదు కదా!" అంటూ మరోసారి ఆశ్చర్యపోయాను. "నిజమేనండి. కానీ చేసే పనితో సంబంధం లేకుండా కార్యాలయంలో పనిచేసేవారందరికీ, వారి, వారి విధులు ప్రాతిపదికగా సాయంకాలం పంపకాలు జరుగుతాయండి" అని గీతాబోధ చేసారు.
అందుకే ధరలు పెంచాలి..!
అందుకే రిజిస్ట్రార్స్ కార్యాలయాలలో స్థిరాస్తుల ధర వాస్తవానికి చేరుకుంటే తప్ప నల్లధనం, అవినీతుల నిర్మూలన ఎండమావియే. అందుకే అన్ని రాష్ట్ర ప్రభుత్వాల తక్షణ కర్తవ్యం రిజిస్ట్రార్ల కార్యాలయాలలో అడుగునవున్న స్థిరాస్తుల ధరలను పైకెత్తడం కావాలి. ప్రజల చేత ఎన్నుకోబడే ప్రభుత్వాలకు ఒక్కసారిగా స్థిరాస్థి ధరలను విపణి ధరలకు సరిపోయేలా పెంచడం కష్టమైతే, కొంత కాల పరిమితి నిర్ణయించుకుని, అంచెలంచెలుగా పెంచవచ్చు. అలా కాక ఇదే పరి స్థితి కొనసాగిస్తే తిలా పాపంలో తలా పిడికెడు పంచు కుంటూ ఉంటాం అందరం.ఇది కొనసాగాల్సిందేనా?
మల్లాప్రగడ రామారావు
99898 63398