అప్రయత్న పదోన్నతి పథకంపై సందేహాలు.. సమాధానాలు

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగుల ప్రయోజనార్థమై పలు ఉత్తర్వులు వెలువరించింది. అందులో భాగంగానే అప్రయత్న పదోన్నతి పథకం

Update: 2024-11-22 00:45 GMT

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగుల ప్రయోజనార్థమై పలు ఉత్తర్వులు వెలువరించింది. అందులో భాగంగానే అప్రయత్న పదోన్నతి పథకం ఏర్పరిచింది. ఈ ఉత్తర్వులనే తెలంగాణ రాష్ట్రంలో అమలుపరచడం జరుగుతున్నది. ఉద్యోగుల్లో ప్రమోషన్‌కు అర్హత కలిగి ఉండి, వేకెన్సీలు లేకపోవడం, తక్కువ వేకెన్సీలు ఉండటం వల్ల పదోన్నతి పొందలేని వారి కోసం అప్రయత్న పదోన్నతి పథకం ఏర్పాటు చేశారు. ఈ పథకం 1982 నుండి అమల్లోకి వచ్చి పలు మార్పులు చెంది ప్రస్తుతం Special Grade 6 years, Special Promotion Post (IA)12 years, SPP I(B)18 Years, SPP II 24 Years స్కేళ్లుగా మార్పు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉత్తర్వుల సంఖ్య 96 ఆర్థిక శాఖ తేదీ 20. 25. 2011 ద్వారా జారీ చేసింది. ఈ స్కేళ్లు 2010 ఫిబ్రవరి 1 నుండి అమల్లోకి వచ్చాయి. అప్రయత్న పదోన్నతి పథకంను అనుసరించి ఒకే క్యాటగిరిలో ఆరేళ్ల ఇంక్రిమెంట్ సర్వీస్ పూర్తి చేసిన వారికి స్పెషల్ గ్రేడ్ పోస్టు స్కేలు, 12 సంవత్సరాల ఇంక్రిమెంట్ సర్వీస్ పూర్తి చేసిన వారికి SPP I(A) లేదా SAPP I(A) స్కేల్, 18 సంవత్సరముల ఇంక్రిమెంట్ సర్వీసు పూర్తి చేసిన వారికి SPP I(B) లేదా SAPP I(B) స్కేలు, 24 సంవత్సరాల ఇంక్రిమెంట్ సర్వీసు పూర్తి చేసిన వారికి SPP II లేదా SAPP II స్కేల్ మంజూరు చేస్తారు.

వారికి వర్తించే పే స్కేల్ వివరాలు..

ఒకే పోస్టులో ఎలాంటి పదోన్నతి లేకుండా ఒక ఉద్యోగి ఆరు సంవత్సరములుగా పని చేస్తున్నట్లయితే ఆ ఉద్యోగికి, ప్రస్తుతం తాను పొందుతున్న పోస్ట్ స్కేలు తదుపరి స్కేలును స్పెషల్ గ్రేడ్ పోస్ట్ స్కేల్‌గా మంజూరు చేస్తారు. దీనికి ఎలాంటి పరీక్షలు ఉత్తీర్ణత కావలసిన అవసరం లేదు. ఒకే పోస్టులో 12 సంవత్సరములు సర్వీస్ పూర్తి చేసిన ఉద్యోగికి తాను పొందబోయే తదుపరి ప్రమోషన్ పోస్టు స్కేలును స్పెషల్ ప్రమోషన్ పోస్టు స్కేల్ SPP I(A) స్కేలుగా మంజూరు చేస్తారు. అయితే ప్రమోషన్ పోస్టులు కావలసిన అన్ని అర్హతలను ఉద్యోగి కలిగి ఉండాలి. అనగా ఆ పోస్టుకి సంబంధించిన డిపార్ట్మెంటల్ టెస్ట్‌లు, విద్యార్హతలు కలిగి ఉండాలి. 12 సంవత్సరముల సర్వీసు కలిగి ప్రమోషన్ చానల్ లేని పోస్టులో పనిచేస్తున్న వారికి స్పెషల్ గ్రేడ్ స్కేలు తదుపరి స్కేలును SAPP I(A)స్కేలుగా మంజూరు చేస్తారు. అట్లే ఒకే పోస్ట్‌లో 18 సంవత్సరముల సర్వీస్ పూర్తి చేసిన ఉద్యోగికి తాను పొందుతున్న SPP I(A) లేదా SAPP I(A) స్కేలు‌లోనే ఒక ఇంక్రిమెంట్‌ను అదనంగా మంజూరు చేస్తారు. దీనిని SPP I(B) లేదా SAPP I(B) స్కేలుగా వ్యవహరిస్తారు. స్పెషల్ ప్రమోషన్ పోస్ట్ స్కేల్(SPP II) ఒకే పోస్టులో 24 సంవత్సరములు సర్వీస్ పూర్తి చేసిన ఉద్యోగికి వారి సర్వీసు రూల్‌ని అనుసరించి తాను పొందబోవు రెండవ ప్రమోషన్ పోస్ట్ స్కేల్‌ను SPP II స్కేలుగా మంజూరు చేస్తారు. దీనికై సదరు ఉద్యోగి తాను ఆ ప్రమోషన్ పోస్టుకు కావలసిన పూర్తి అర్హతలను కలిగి ఉండాలి. ఒకవేళ సదరు ఉద్యోగికి ప్రమోషన్ చానల్ లేని సందర్భంలో తాను SPP I/ SAPP I పొందుతున్న స్కేల్‌కు తదుపరి స్కేల్‌ను SAPP II స్కేలుగా మంజూరు చేస్తారు.

ఈ స్కేల్ పొందుతూ పదోన్నతి పొందితే..

అప్రయత్న పదోన్నతి పథకంలో స్కేల్ మంజూరు చేసినప్పుడు వేతన స్థిరీకరణ అనేది ఫండమెంటల్ రూల్ 22(a)(i) అనుసరించి ఒక ఇంక్రిమెంట్‌ను ఇవ్వడం జరుగుతుంది. ఉద్యోగి ఆరేళ్లు, 12 సంవత్సరాలు, 18 సంవత్సరాల స్కేలు పొందుతూ తదుపరి పదోన్నతి పొందినా, ప్రమోషన్ పోస్టులో ఫండమెంటల్ రూల్ 22(B) ప్రకారం వేతన స్థిరీకరణ చేస్తారు. కానీ 24 సంవత్సరాల స్కేలు పొందుతూ పదోన్నతి పొందినప్పుడు ఫండమెంటల్ రూల్ 22(a)(i) ప్రకారం వేతన స్థిరీకరణ చేస్తారు. అట్లే తదుపరి తాను పొందిన ప్రమోషన్ పోస్టులో 6, 12, 18, 24 స్కేల్స్ మాత్రం మంజూరు చేయరు. అంటే వారికి అప్రయత్న పదోన్నతి పథకం వర్తింప చేయరు. 2010 ఫిబ్రవరి 1 కంటే ముందే 12 సంవత్సరాలు, 18 సంవత్సరాల ఇంక్రిమెంటల్ సర్వీస్ పూర్తి చేసినా, ఈ స్కేళ్లను మాత్రమే మంజూరు చేస్తారు. అట్లే 1.2.2010 కంటే ముందు 16 సంవత్సరాల స్కేల్ తీసుకొని 1.2.2010 తర్వాత 18 సంవత్సరాల సర్వీస్ పూర్తి చేస్తే, అట్టివారికి SPP I(B)/SAPP I (B) స్కేలు వర్తిస్తాయి. 24 సంవత్సరాల స్కేలు తీసుకొని అనగా SPP II స్కేల్ తీసుకొని పదోన్నతి పొందిన వారికి అప్రయత్న పదోన్నతి పథకం యొక్క ప్రయోజనాలు వర్తించవు.

పదోన్నతిని తిరస్కరిస్తే..

సంచిత ప్రభావం లేకుండా ఇంక్రిమెంట్ల నిలుపుదలగా శిక్ష పడిన కాలాన్ని కూడా అప్రయత్న పదోన్నతి పథకానికి లెక్కిస్తారు. కానీ సంచిత ప్రభావమైన ఇంక్రిమెంట్ల నిలుపుదల కాలాన్ని మినహాయిస్తారు. అట్లే పదోన్నతిని తిరస్కరించిన వారికి రాబోయే కాలంలో లభించే అప్రయత్న పదోన్నతి పథకానికి చెందిన ఫలాలు వర్తించవు. విచారణను ఎదుర్కొంటున్న సందర్భాల్లో అప్రయత్న పదోన్నతి పథకాన్ని అమలుపరుచరు. ఇంక్రిమెంటల్ సర్వీస్‌ను మాత్రమే పరిగణిస్తారు. కానీ ఖచ్చితంగా ఇంక్రిమెంట్లు విడుదల అయి ఉండాలన్న నిబంధన ఏదీ లేదు. ఉపాధ్యాయులకు సంబంధించిన అప్రెంటిస్ పీరియడ్, 50 సంవత్సరాల మినహాయింపులకు సంబంధించిన వాటిపై ప్రత్యేకమైన ఉత్తర్వులు ఉన్నాయి. ఆఫీస్ సబార్డినేట్, రికార్డ్ అసిస్టెంట్ కాలానికి సంబంధించి కలిపి ఈ పథకానికి లెక్కిస్తారు. అట్లే జూనియర్ సహాయకులు, టైపిస్ట్ తదితర సమాన క్యాడర్లో పనిచేసిన కాలాన్ని కూడా అప్రయత్న పదోన్నతి పథకానికి కలిపి లెక్కిస్తారు. 

సి. మనోహర్ రావు,

రిటైర్డ్ ప్రభుత్వ అధికారి.

85198 62204

Tags:    

Similar News