Assembly: సభ్యులకు ముగిసిన అవగాహన సదస్సు.. స్పీకర్ గడ్డం ప్రసాద్ కీలక వ్యాఖ్యలు
శాసనమండలి సభ్యులు 17 మంది, శాసనసభ సభ్యులు 61 మంది ఈ అవగాహన సదస్సులో పాల్గొన్నారు.
దిశ, తెలంగాణ బ్యూరో: శాసనమండలి సభ్యులు 17 మంది, శాసనసభ సభ్యులు 61 మంది ఈ అవగాహన సదస్సులో పాల్గొన్నారు. శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్త సంప్రదాయనికి నాంది పలికిందన్నారు. గతంలో ఎప్పుడు నిర్వహించని విధంగా ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు లేజిస్లేచర్ విధి విధానాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించుకోవడం మంచి పరిణామమన్నారు. ఇలాంటి మంచి కార్యక్రమాలను భవిష్యత్ లో కూడా నిర్వహించుకోవడం జరుగుతోందని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి వెల్లడించారు. శాసనసభ కార్య విధానం , కార్యక్రమ నిర్వాహణ నియమావళిపై గురువారం సాయంత్రం తెలంగాణ రాష్ట్ర శాసనపరిషత్తు , శాసనసభ సభ్యులకు జూబ్లీహిల్స్ లోని ఎంసిఆర్ హెచ్ఆర్డీలో ఏర్పాటు చేసిన రెండు రోజుల అవగాహన సదస్సు ముగిసింది. ఈ ముగింపు కార్యక్రమంలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి , తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్, డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్ ముదిరాజ్ , రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి , పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు , రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ , ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్ రెడ్డి , శాసనమండలి చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి , లేజిస్లేచర్ సెక్రటరీ డా. వి నరసింహాచార్యులు , ఫైనాన్స్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, ఎంసిఆర్ హెచ్ఆర్డి స్పెషల్ చీఫ్ సెక్రటరీ శశాంక్ గోయల్ , లేజిస్లేచర్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముగింపు కార్యక్రమాన్ని పురస్కరించుకుని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం సహకారం అందిస్తే త్వరలోనే అసెంబ్లీ, శాసన మండలి అన్ని కమిటీలను పూర్తి చేస్తామన్నారు. త్వరలోనే స్టడీ టూర్ లను కూడా ఏర్పాటు చేయబోతున్నామని గుత్తా సుఖేందర్ రెడ్డి వెల్లడించారు.
ఈసందర్భంగా అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత మొదటి సారి అధికారికంగా శాసన పరిషత్తు, శాసనసభ సభ్యులకు ఇలాంటి అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు. దీంతో శాసన వ్యవహారాలు తెలుసుకోవాలనే ఆసక్తితో సభ్యులు హాజరయ్యారని , ఇది తనకు చాలా సంతోషం కలిగిస్తోందన్నారు. ఈ రెండు రోజుల ఓరియెంటేషన్ ప్రోగ్రాం ద్వారా శాసన పరిషత్తు, శాసనసభలలో సభ్యులు తమ హక్కులు, బాధ్యతలు తెలుసుకున్నారన్నారు. మనం ఎంత థియరీ నేర్చుకున్నా దానిని ప్రాక్టికల్ గా అమలు చేస్తేనే దానికి విలువ, నిజమైన గుర్తింపు ఉంటుందన్నారు. వారు తెలుసుకున్న విషయాలను వచ్చే సమావేశాలలో అమలు చేయడం ద్వారా వారికే మంచి పేరు వస్తుందనీ, వారి గౌరవం పెరుగుతుందని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తెలిపారు. ఎంసిఆర్హచ్ఆర్డి కి దేశ వ్యాప్తంగా మంచి పేరు ఉన్నదని ఈ సదస్సు నిర్వాహనకు సహకరించిన హెచ్ఆర్డీ అధికారులు, సిబ్బందికి ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. ఎంసిఆర్హెచ్ఆర్డీ , లేజిస్లేచర్ ల మద్య కో ఆర్డినేషన్ చేసి ఈ సదస్సును విజయవంతం చేసిన మా లేజిస్లేచర్ సెక్రటరీ డా. వి నరసింహా చార్యులుకు అభినందిస్తున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి అవగాహన సదస్సులు తరచుగా నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. శాసనసభ్యులకు క్రీడలు నిర్వహించడం, స్టడీ టూర్ లకు పంపండం వంటి కార్యక్రమాలు నిరంతం జరుపుతామని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ వెల్లడించారు.