అనర్హులకు అందుతోన్న ‘ఆసరా’.. ‘సెర్ప్’ తనిఖీల్లో బట్టబయలైన 5,650 మంది బాగోతం..!
పేదలకు అందాల్సిన ఆసరా పింఛన్లు ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాలకూ వెళ్తున్నట్లు ఇటీవల ‘సెర్ప్’ తనిఖీల్లో బట్టబయలైంది.
దిశ, తెలంగాణ బ్యూరో: పేదలకు అందాల్సిన ఆసరా పింఛన్లు ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాలకూ వెళ్తున్నట్లు ఇటీవల ‘సెర్ప్’ తనిఖీల్లో బట్టబయలైంది. ఉద్యోగ విరమణ తర్వాత అందుకుంటున్న రిటైర్‌మెంట్ పెన్షన్‌తో పాటు కొందరు ‘ఆసరా’ పింఛన్‌ను కూడా తీసుకుంటున్నట్లు తేలింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 5,650 మంది రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులు ‘ఆసరా’ పింఛన్ అందుకుంటున్నారని, ఇందులో 3,824 మంది చనిపోయారని, ఇప్పటికీ 1,826 మంది అందుకుంటూనే ఉన్నట్లు ఆ తనిఖీల్లో వెల్లడైంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే 427 మంది అక్రమంగా డబుల్ పెన్షన్లు అందుకుంటున్నట్లు గుర్తించారు. ఈ కారణంగానే జూన్ నెల నుంచి వీరికి ఆసరా పింఛన్లను ప్రభుత్వం నిలిపివేసింది.
నిబంధనలకు విరుద్ధంగా..
రెండు పింఛన్లు అందుకోవడం నిబంధనలకు విరుద్ధమని, ‘సెర్ప్’ అధికారులు చెబుతున్నారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ప్రజాధనం దుర్వినియోగమైందని, రిటైర్డ్ ఉద్యోగులు, వారి కుటుంబీకులు డబుల్ ఫించన్లు అందుకుంటుండడంతో అర్హులైన పేదలకు అన్యాయం జరుగుతున్నదని పేర్కొంటున్నారు. అక్రమ ఆసరా పింఛన్ల జాబితాతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో దాదాపు రెండున్నర కోట్ల రూపాయల మేర దుర్వినియోగమైనట్లు అక్కడి జిల్లా అధికారుల అంచనా. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన సర్వేలో ఏ మేరకు పక్కదారి పట్టిందనే లెక్కలపై అధికారులు ఆరా తీస్తున్నారు.
‘చేయూత’ కసరత్తులో భాగంగా..
ప్రభుత్వ నిబంధనల ప్రకారం వితంతువులు, ఒంటరి మహిశలు, వృద్ధులు, బీడీ కార్మికులు, స్టోన్ కట్టర్లు, చేనేత కార్మికులు, వికలాంగులు, డయాలసిస్, ఫైలేరియా, ఎయిడ్స్ రోగులకు ప్రభుత్వం ఆసరా పథకం రూపంలో ఆర్థిక సాయం అందిస్తున్నది. బీపీఎల్ కుటుంబాల్లో తెల్లరేషన్ కార్డు ఉన్నవారు ఈ పింఛన్ పొందేందుకు అర్హులైనా గత ప్రభుత్వం ఉదాసీన వైఖరితో ‘ఆసరా’ పింఛన్ల జాబితాలో కొందరిని చేర్చింది. అసెంబ్లీ ఎన్నికలకు ముందే ‘చేయూత’ పేరుతో ఆసరా పింఛన్ల సాయాన్ని రెట్టింపు చేస్తామంటూ కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ఇప్పుడు దాన్ని అమలు చేయడానికి కసరత్తు మొదలు పెట్టి లబ్ధిదారుల జాబితాను పరిశీలించే క్రమంలో కొన్ని అనుమానాస్పద కుటుంబాల వివరాలు బయటపడ్డాయి. సెర్ప్ సిబ్బంది క్షేత్రస్థాయి తనిఖీలు చేపట్టడంతో ఈ అనుమానాలు నిజమేనని నిర్ధారణైంది.
ఆసరా పింఛన్ కింద ఇచ్చిన డబ్బులను తిరిగి చెల్లించాలంటూ ఇటీవల అధికారులు కొత్తగూడెం జిల్లాలో దాసరి మల్లమ్మ అనే 80 ఏళ్ల వృద్ధురాలికి నోటీసు జారీ చేశారు. ఇది సోషల్ మీడియా వేదికగా బయటకు రావడంతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అమానవీయమైన చర్య అంటూ ట్వీట్ చేయగా, అది అధికారుల దృష్టికి వెళ్లింది. దాసరి మల్లమ్మ వ్యవహారం కూడా డబుల్ పెన్షన్ల జాబితాలోనే ఉందని అధికారులు చెబుతున్నారు. దాసరి మల్లమ్మ కూతురు దాసరి రాజేశ్వరి దంతుకూరులో గతంలో ఏఎన్ఎంగా పని చేశారని, 2010లో ఆమె అవివాహితగానే మరణించడంతో డిపెండెంట్‌గా తల్లి (దాసరి మల్లమ్మ) పేరుమీద ప్రతి నెలా రూ. 24,073 చొప్పున ప్రభుత్వం నుంచి ఫ్యామిలీ పెన్షన్ అందుకుంటున్నట్లు తేలింది. ఈ కారణంగానే జూన్ నెల నుంచి ఆమెకు ఇచ్చే ఆసరా పింఛన్‌ను జిల్లా అధికారులు నిలిపివేశారు.
దుర్వినియోగాన్ని అరికట్టేలా..
రైతుబంధు పేరుతో ఇస్తున్న ఇన్‌పుట్ సబ్సిడీ అనర్హులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, జాతీయ రహదారులు, రోడ్లకు చెల్లించడంతో దాదాపు రూ. 25,672 కోట్ల మేర దుర్వినియోగమైనట్లు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. అదే తరహాలో ఇప్పుడు ఆసరా పింఛన్ల పేరిట కూడా నిధులు పక్కదారి పట్టినట్లు సెర్ప్ తనిఖీల్లో బయటపడింది. ప్రజాధనం దుర్వినియోగాన్ని, దుబారాను అరికట్టి అర్హులైనవారికే అందించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం తనిఖీలకు శ్రీకారం చుట్టింది. అర్హత లేకుండానే అందుకుంటున్నవారు, రిటైర్డ్ ఉద్యోగులు, ఫ్యామిలీ పెన్షన్ అందుకుంటున్నవారికి సైతం ఆసరా అందుతుండడాన్ని సీరియస్‌గా తీసుకున్నది. నిబంధనలను పటిష్టంగా అమలు చేయడంపై అధికారులు దృష్టి సారించారు.