ఈనెల 27న తెలంగాణకు అమిత్‌షా.. సూర్యాపేటలో బీజేపీ భారీ బహిరంగ సభ
తెలంగాణ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. దసరా పండుగ ముగియడంతో పార్టీలు ప్రచార పర్వాన్ని పరుగులు పెట్టించబోతున్నాయి. అభ్యర్థుల మొదటి జాబితా విడుదల చేసిన బీజేపీ అగ్రనేతలు రాష్ట్రంపై ఫోకస్ పెట్టారు.
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. దసరా పండుగ ముగియడంతో పార్టీలు ప్రచార పర్వాన్ని పరుగులు పెట్టించబోతున్నాయి. అభ్యర్థుల మొదటి జాబితా విడుదల చేసిన బీజేపీ అగ్రనేతలు రాష్ట్రంపై ఫోకస్ పెట్టారు. రాష్ట్రవ్యాప్తంగా పలు సభలకు ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలో అక్టోబర్ 27న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలంగాణలో పర్యటించబోతున్నారు. సూర్యాపేటలో నిర్వహించే ఎన్నికల బహిరంగ సభలో ఆయన పాల్గొననున్నారు. మరో వైపు ఈనెల 31న యూపీ సీఎం యోగి, 28, 29 తేదీల్లో అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ కూడా రాష్ట్రంలో పర్యటించి ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నట్లు సమాచారం.
అసంతృప్త నేతలతో విడిగా భేటీ!
సూర్యాపేట మీటింగ్ కోసం రాష్ట్రానికి వస్తున్న అమిత్ షా తెలంగాణ బీజేపీ నేతలతో భేటీ కాబోతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా అసంతృప్త నేతలతో ఆయన వేర్వేరుగా సమావేశమై ఎన్నికల్లో పార్టీ వ్యూహం వారికి వివరించబోతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల పార్టీ ప్రకటించిన తొలి జాబితాలో కొంత మంది సీనియర్లకు స్థానం దక్కలేదు. దీంతో వారంతా తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. మొదటి నుంచి పార్టీలో ఉన్న తమను కాదని పారాచూట్ నేతలకు టికెట్లు ఇవ్వడం ఏంటని బహిరంగంగానే కామెంట్స్ చేస్తున్నారు. టికెట్ ఆశించి భంగపడిన వారిలో పలువురు పక్క చూపులు చూస్తున్నారనే ప్రచారం జరుగోతంది. మరో వైపు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వంటి ముఖ్య నేతలు పార్టీని వీడుతారనే కమలం పార్టీ శిబిరంలో అయోమయానికి కారణం అవుతుంది. ఈ నేపథ్యంలో అమిత్ షా టూర్ టీ బీజేపీలోని గందరగోళానికి ఫుల్ స్టాప్ పెడుతుందా లేదా అనేది ఉత్కంఠగా మారింది.