ఏజెన్సీ ప్రాంతంలోని సమస్యలను పరిష్కరిస్తాం

ఏజెన్సీ ప్రాంతంలోని ఆదివాసీ గిరిజనులు ఎదుర్కొంటున్న దీర్ఘకాలిక సమస్యలను త్వరలో పరిష్కరిస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

Update: 2024-10-09 13:25 GMT

దిశ, ఉట్నూర్ : ఏజెన్సీ ప్రాంతంలోని ఆదివాసీ గిరిజనులు ఎదుర్కొంటున్న దీర్ఘకాలిక సమస్యలను త్వరలో పరిష్కరిస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. బుధవారం హైదరాబాద్​లోని సీఎం నివాసంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్​చార్జి మంత్రి సీతక్క, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ ఆధ్వర్యంలో ఆదివాసీ పెద్దలు, సంఘ నాయకులు సీఎం రేవంత్ రెడ్డిని కలిసి వినతి పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ దసరా అనంతరం హైదరాబాద్ లోని సెక్రటేరియట్​లో అన్ని శాఖల అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి తక్షణమే సమస్యలు పరిష్కారమయ్యేలా కృషి చేస్తామన్నారు.

    ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తుందని, గతంలో ఇంద్రవెల్లి మండలంలో సభను ఏర్పాటు చేశామన్నారు. ఐటీడీఏలను అభివృద్ధి పరిచి ఆదివాసీ గిరిజనుల సమస్యలు పరిష్కారమయ్యేలా ప్రత్యేక నిధులు కేటాయిస్తామన్నారు. స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని, ఐటీఐ కళాశాలలను అప్గ్రేట్ చేసి ఆదివాసీ యువతకు మెరుగైన విద్యను అందిస్తామన్నారు. జైనూర్ బాధితురాలికి ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని, బాధిత కుటుంబానికి అన్ని విధాలుగా అండగా నిలుస్తామని తెలిపారు.

    ఏజెన్సీ ప్రాంతంలో ప్రశాంతవంతమైన వాతావరణాన్ని నెలకొల్పడానికి ఆదివాసీ పెద్దలు కృషి చేయాలని, గొడవలకు దూరంగా ఉండాలని సూచించారు. అనంతరం సీఎం కి పులాజీ బాబా ధ్యాన చిత్ర పటాన్ని ఆదివాసీ పెద్దలు అందించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పార్టీ ఆదిలాబాద్ పార్లమెంట్ ఇన్ చార్జి ఆత్రం సుగుణ, కొమురం భీం మనుమడు సోనేరావ్, ఉమ్మడి అదిలాబాద్ జిల్లా సార్ మెడి మెస్రం దుర్గు, ఆదివాసీ పెద్దలు, అన్ని సంఘాల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.  

Tags:    

Similar News