సరిహద్దు గ్రామాల్లో భయంభయం
మండల పరిధిలోని మహారాష్ట్ర సరిహద్దు గ్రామాలైన దాబా, గోయగాం అటవీ ప్రాంతాల్లో గత నాలుగు రోజుల నుంచి పులి సంచరిస్తుంది.
దిశ, వాంకిడి : మండల పరిధిలోని మహారాష్ట్ర సరిహద్దు గ్రామాలైన దాబా, గోయగాం అటవీ ప్రాంతాల్లో గత నాలుగు రోజుల నుంచి పులి సంచరిస్తుంది. తాజాగా దాబా అటవీ ప్రాంతంలో ఆదివారం సాయంత్రం పశువుల మందపై పెద్దపులి దాడి చేసి ఐదు పశువులను గాయపరిచింది. గత ఏడాది కూడా నవంబర్ నెలలోనే చౌపన్ గూడ జీపీ ఖానాపూర్ గ్రామానికి చెందిన సీడాం భీము తన వ్యవసాయ పొలం పనులు చేస్తున్న క్రమంలో ఓ గిరిజన రైతుపై పులి దాడి చేసి హతమార్చింది. దీంతో పరిసర గ్రామాల రైతులు, కూలీలు వ్యవసాయ పనులకు వెళ్లేందుకు జంకుతున్నారు.
అయితే బుధవారం వేకువజామున మళ్లీ దాబా గ్రామ శివారులో పులి గాండ్రింపులు వినిపించినట్లు కొంతమంది గ్రామస్తులు తెలిపారు. ఈ విషయాన్ని స్థానిక అటవీ శాఖ అధికారులను అడుగగా అందులో నిజం లేదని కొట్టిపారేశారు. అలాంటి పుకార్లను నమ్మొద్దని, ప్రస్తుతం గోయగాం అటవీ ప్రాంతంలోనే పులి సంచారం ఉందని చెప్పారు. ఈ పరిసర ప్రాంతాల్లో ఎవరూ కూడా తిరగొద్దని హెచ్చరించారు. మరోవైపు ఎఫ్ఆర్వో గోవింద్ సింగ్ సర్ధార్ ఆధ్వర్యంలో అటవీశాఖ అధికారులు పులి అడుగు జాడలతో ఆది వెళ్తున్న ప్రాంతాన్ని ట్రాకింగ్ చేసే పనిలో పడ్డారు. అదే సమయంలో దాబాలో పశువుల మందపై దాడి చేసిన పులి, గోయగాం ప్రాంతంలో సంచరిస్తున్న పులి ఒకటేనా, వేరువేరా అనే కోణంలో పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.