గూడెం లిఫ్ట్ ఫెయిల్యూర్ పాపం ఆ రెండు పార్టీలదే..

గూడెం లిఫ్ట్ ఇరిగేషన్ ఫెయిల్యూర్ పాపం కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలదేనని జిల్లా అధ్యక్షుడు వెరబెల్లి రఘునాథ్ రావు ఆరోపించారు.

Update: 2023-03-03 12:00 GMT

దిశ, లక్షెట్టిపేట : గూడెం లిఫ్ట్ ఇరిగేషన్ ఫెయిల్యూర్ పాపం కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలదేనని జిల్లా అధ్యక్షుడు వెరబెల్లి రఘునాథ్ రావు ఆరోపించారు. శుక్రవారం స్థానిక ఐబీ వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అప్పడు కాంగ్రెస్ నాయకులుగా ఉన్న ఎమ్మెల్యే దివాకర్ రావు, మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్ రావులు కమీషన్లకు కక్కుర్తి పడటంతోనే గూడెం లిఫ్ట్ కి నాసిరకం పైపులు వేశారన్నారు. లిఫ్ట్ నిర్మాణ టెండర్లలో ఎమ్మెస్ పైపులు వాడాలని ఉన్నా ఆ నాయకులు కమీషన్లకు ఆశపడటంతో కాంట్రాక్టు ఏజెన్సీ అయిన మెగా కంపెనీ జీఆర్ఈ పైపులు వేసిందని చెప్పారు. నాసీరకం పైపులు వేయడంతోనే లిఫ్ట్ పైప్ లైన్ తరచూ లీకేజీలకు గురవుతోందన్నారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా గూడెం లిఫ్ట్ ఇరిగేషన్ పథకాన్ని పట్టించుకోలేదన్నారు.

పైపులు మార్పిస్తామని అసెంబ్లీ సాక్షిగా చెప్పిన రాష్ట్ర మంత్రి హరీష్ రావు ఆ తర్వాత దాన్ని విస్మరించారన్నారు. లిఫ్ట్ పైప్ లైన్ మార్పిడి విషయంలో స్థానిక ఎమ్మెల్యే దివాకర్ రావు ప్రభుత్వం పై ఒత్తిడి పెంచక పోవడంతోనే ఇప్పుడు చివరి ఆయకట్టు పొలాలు ఎండిపోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండు పార్టీలు చేసిన పాపం వల్లనే లిఫ్ట్ కింద ఆయకట్టు రైతులు నష్టపోయారని మండిపడ్డారు. ఈ యాసంగిలో పంటలు నష్టపోయిన లిఫ్ట్ కింద కడెం ఆయకట్టు రైతులకు ఎకరానికి రూ. 25 వేల నష్టపరిహారం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో బీజేపీ నాయకులు తమ్మినీడి శ్రీనివాస్, హరి గోపాల్, హేమంత్, ప్రభాకర్, మధు, గంగన్న, శివశంకర్ పాల్గొన్నారు.

Tags:    

Similar News