ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అధికార పార్టీకి తొలి షాక్..
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అధికార భారత రాష్ట్ర సమితి నేత ఉమ్మడి జిల్లా పార్టీ మాజీ అధ్యక్షుడు కే శ్రీహరి రావు అధికార పార్టీ పై ధిక్కారస్వరం ప్రకటించారు.
దిశ ప్రతినిధి, నిర్మల్ : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అధికార భారత రాష్ట్ర సమితి నేత ఉమ్మడి జిల్లా పార్టీ మాజీ అధ్యక్షుడు కే శ్రీహరి రావు అధికార పార్టీ పై ధిక్కారస్వరం ప్రకటించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోకుండా పార్టీ జెండాలు మోసిన వారిని ఉద్యమకారులను పక్కనపెట్టి నిర్మల్ నియోజకవర్గంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ శ్రీహరి రావు ధ్వజమెత్తారు. ఈ మేరకు ఆదివారం ఆయన ప్రెస్ నోట్ విడుదల చేసిన అనంతరం విలేకరులతో మాట్లాడారు.
పార్టీ అధికారంలోకి వచ్చిన రెండు పర్యాయాలు కేసిఆర్ ఆశీస్సులతో కేబినెట్లో మంత్రిగా కొనసాగుతున్న ఇంద్రకరణ్ రెడ్డి ఉద్యమ కాలంలో అక్రమంగా పెట్టిన కేసులతో ఆర్థిక పరిస్థితి చిన్నభిన్నమై అష్టకష్టాలు పడుతున్న నాయకులు, కార్యకర్తలను ఉద్యమకారులను నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు. దశాబ్ద కాలంగా కష్టసుఖాలు చెప్పుకోవడానికి అవకాశం ఇవ్వకుండా ఎన్నికలు దగ్గర పడగానే ఆత్మీయ సమ్మేళనాలు అంటూ పిలవడం పై ఆయన నిరసన వ్యక్తం చేశారు. కార్యకర్తలు ఏ పార్టీకైనా మూల స్తంభాల వంటి వారని, ఎన్నికలప్పుడే కార్యకర్తలను వాడుకొని ఆ తర్వాత అవసరం తీరిపోయినట్లుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. 2018 ఎన్నికల్లో తమ పార్టీ అధికారంలోకి వచ్చిన ఆరు నెలలలోపే జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో నిర్మల్ నియోజకవర్గంలో అధికార పార్టీ మూడవ స్థానానికి పడిపోవడానికి కారణం ఎవరని ప్రశ్నించారు.
జెండా మోసిన వారిని పక్కన పెట్టారు...
కేసీఆర్ నేతృత్వంలో సాగిన తెలంగాణ ఉద్యమంలో క్షేత్రస్థాయిలో కొట్లాడిన అసలైన నాయకులు కార్యకర్తలు, ఉద్యమకారులను ప్రభుత్వ నామినేటెడ్ పదవుల్లో క్షేత్రస్థాయిలో ఇచ్చే పార్టీ పదవుల్లో అవకాశం ఇవ్వకుండా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తన వర్గీయులకు మాత్రమే ఇచ్చారని, ఇది కేసీఆర్ ఆదేశాలకు విరుద్ధంగా సాగిందని చెప్పారు. నాయకులు కార్యకర్తలను పట్టించుకోకపోతే మంత్రి పదవిలో ఉండి ఏం లాభం అని ప్రశ్నించారు. ఎన్నికలు దగ్గరికి రాగానే కార్యకర్తల మీద ప్రేమానురాగాలను ఉలకబోస్తూ గత వలస పాలకులతీరును మరిపిస్తున్నారని దుయ్యబట్టారు. కేసీఆర్ సందేశంతో గడపగడపకు వెళ్లి పనిచేసిన కార్యకర్తల వల్లనే గెలిచామన్న సంగతిని మరిచిపోవద్దని హితవు పలికారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి చేపడుతున్న ఆత్మీయ సభల్లో అసలు ఆత్మీయత లేదని... నియోజకవర్గంలో చేపడుతున్న ఆత్మీయ సమ్మేళనాలకు అసలు అర్థమే లేదని పేర్కొన్నారు. నిర్మల్ నియోజకవర్గ ప్రజలు చైతన్యవంతులని ఇక్కడ చరిత్ర ఎందరినో చూసిందని జాతకాలను తిరగరాసిందని భవిష్యత్తులోనూ అది జరిగి తీరుతుందని వ్యాఖ్యానించారు.
అధికార పార్టీలో శ్రీహరి కలకలం...
నిర్మల్ నియోజకవర్గం నుంచి రెండు పర్యాయాలు టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన కే శ్రీహరి రావు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పార్టీ అధ్యక్షునిగా పని చేశారు. పార్టీ బలోపేతం కోసం తీవ్రంగా శ్రమించి కేసీఆర్ దృష్టిలో పడ్డారు ముఖ్యంగా కేటీఆర్ కు అత్యంత సన్నిహితుడిగా ముద్రపడ్డ నేతగా కేసీఆర్ కుటుంబంతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నారన్న నేతగా పేరుపొందారు. అలాంటి నేత తాజాగా తీసుకున్న నిర్ణయం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. త్వరలోనే తన భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని శ్రీహరి రావు వెల్లడించారు.