బాసర ట్రిపుల్ ఐటీ వద్ద ఉద్రిక్తత
బాసర ట్రిపుల్ ఐటీలో వీసీని నియమించడంతో పాటు సమస్యలు పరిష్కరించాలని విద్యార్థులు గత మూడు రోజుల నుండి ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే.
దిశ, బాసర : బాసర ట్రిపుల్ ఐటీలో వీసీని నియమించడంతో పాటు సమస్యలు పరిష్కరించాలని విద్యార్థులు గత మూడు రోజుల నుండి ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. ఐతే శుక్రవారం ట్రిపుల్ ఐటీ ప్రధాన ద్వారం వద్దకు దాదాపు 2000 మంది విద్యార్థులు చేరుకొని నిరసన వ్యక్తం చేశారు. ట్రిపుల్ ఐటీ వీసీ రిజైన్ చేయాలని, విద్యార్థుల 17 డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని అన్నారు.
విద్యార్థుల ఆందోళనకు మద్దతుగా ఏబీవీపీ నాయకులు ప్రధాన ద్వారాన్ని ముట్టడించారు. ట్రిపుల్ ఐటీ సెక్యూరిటీ ఏబీవీపీ నాయకుల మధ్య తోపులాట జరగడంతో స్వల్ప ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సెక్యూరిటీ అధికారుల అత్యుత్సాహంతో ఏబీవీపీ నాయకులకు స్వల్ప గాయాలయ్యాయి . రెగ్యులర్ వీసీని నియమించి విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని నాయకులు డిమాండ్ చేశారు. ప్రధాన ద్వారం వద్ద ట్రిపుల్ ఐటీ సెక్యూరిటీ గార్డులతో బందోబస్తు నిర్వహిస్తున్నారు.