సింగరేణి ఎన్నికల్లో ట్విస్టు.. ఏఐటీయూసీకి టీబీజీకేఎస్ నేతల మద్దతు
శత్రువుకు శత్రువు తమ మిత్రుడు అనే నానుడి సింగరేణి ఎన్నికల్లో అక్షరాల అమలు చేసి చూపిస్తున్నారు టీబీజీకేఎస్ నేతలు.
దిశ, ఆదిలాబాద్ బ్యూరో: శత్రువుకు శత్రువు తమ మిత్రుడు అనే నానుడి సింగరేణి ఎన్నికల్లో అక్షరాల అమలు చేసి చూపిస్తున్నారు టీబీజీకేఎస్ నేతలు. తాము గెలవకున్నా పర్వాలేదు.. తమ శత్రువు గెలవొద్దని మరో సంఘానికి మద్దతు చెబుతున్నారు. దీని ద్వారా తమ క్యాడర్‌ను నిలబెట్టుకోవడంతో పాటు, గెలిచిన సంఘం ద్వారా తమ పనులు చేయించుకోవచ్చనే వ్యూహంతో ముందుకు సాగుతున్నారు.
సింగరేణి ఎన్నికల్లో రోజుకో ట్విస్టు చోటు చేసుకుంటోంది. మరీ ముఖ్యంగా బీఆర్ఎస్ అనుబంధ సంఘమైన తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం తీసుకుంటున్న నిర్ణయాలతో ఏ రోజు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. కొద్ది రోజుల కిందట ఆ యూనియన్ సింగరేణి ఎన్నికల్లో పోటీ చేయవద్దని అధిష్టానం నిర్ణయం తీసుకుంది. దీంతో యూనియన్ అధ్యక్షుడు వెంకట్రావ్, ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ కెంగర్ల మల్లయ్య రాజీనామా చేశారు.
వారు తప్పుకోగానే తిరిగి సింగరేణి ఎన్నికల్లో పోటీ చేస్తామని కవిత ప్రకటన చేశారు. కానీ, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. పెద్ద ఎత్తున క్యాడర్ ఇతర సంఘాల్లో చేరడం, ఉన్న వాళ్లు ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం నేతలు ఈ ఎన్నికల్లో ప్రచారం కూడా సరిగ్గా చేయలేదంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు.
ఈ నేపథ్యంలో టీబీజీకేఎస్ నేతలు భారీ ప్లాన్ వేశారు. తాము గెలవకున్నా పర్వాలేదు కానీ తమ ప్రధాన శత్రువైన కాంగ్రెస్ అనుబంధ సంఘం ఐఎన్‌టీయూసీ గెలవద్దనే వ్యూహం రచించారు. అదే సమయంలో తమ యూనియన్‌లో ఉన్న క్యాడర్‌ను కాపాడుకునేందుకు సైతం వారు ఈ ప్రణాళిక రూపొందించారు. సింగరేణి ఎన్నికల్లో కార్మికులు సీపీఐ అనుబంధ సంఘమైన ఏఐటీయూసీకి మద్దతు చెప్పాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు టీబీజీకేఎస్ నేతలే బహిరంగంగా ప్రచారం సైతం చేస్తున్నారు. దీంతో ఎట్టి పరిస్థితుల్లో సింగరేణిలో కాంగ్రెస్ పాగా వేయవద్దనే వ్యూహం కనిపిస్తోంది. దీంతో రేపు జరగనున్న పోలింగ్ మరింత రసవత్తరంగా మారనుంది.