నేటితో ముగియనున్న సింగరేణి ఎన్నికల ప్రచారం
సింగరేణిలో ఏడో విడత జరగనున్న గుర్తింపు సంఘ ఎన్నికల ప్రచారం నేటితో ముగియనుంది. ఈ నెల 27న సింగరేణి వ్యాప్తంగా ఎన్నికలు నిర్వహించనున్నారు.
దిశ, మంచిర్యాల: సింగరేణిలో ఏడో విడత జరగనున్న గుర్తింపు సంఘ ఎన్నికల ప్రచారం నేటితో ముగియనుంది. ఈ నెల 27న సింగరేణి వ్యాప్తంగా ఎన్నికలు నిర్వహించనున్నారు. సింగరేణిలో అన్ని పార్టీలు తమ సత్తా చాటేందుకు తీవ్రంగా శ్రమించాయి. అధికార పార్టీ కాంగ్రెస్ అనుబంధ అనుబంధ సంఘం ఐఎన్‌టీయూసీ తరఫున జనక్ ప్రసాద్, సీపీఐ పార్టీ అనుబంధ సంఘం ఏఐటీయూసీ తరఫున వాసిరెడ్డి సీతారామయ్య, బీఆర్ఎస్ అనుబంధ సంఘం టీబీజీకేఎస్ తరఫున ఆ యూనియన్ నేతలు ప్రచారంలో పాల్గొన్నారు. సింగరేణి గుర్తింపు ఎన్నికల్లో 13 యూనియన్లు పోటీ పడుతుండగా, ప్రధాన పోటీ మాత్రం ఈ మూడు యూనియన్ల మధ్యనే ఉండనుంది.
ప్రచారానికి చివరి రోజైన సోమవారం సింగరేణి బొగ్గు గనులపై కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రచారంలో పాల్గొన్నారు. తమ అనుబంధమైన సంఘమైన ఐఎన్‌టీయూసీ తరఫున ప్రచారంలో పాల్గొన్న వారు కార్మికులకు ఆరు హామీలపై అవగాహన కల్పించారు. మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్ రావు శ్రీరాంపూర్ ఏరియా ఆర్కే 7,7A గని, వర్క్ షాప్ లో ప్రచారం నిర్వహించి గడియారం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. మందమర్రిలో చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ ప్రచారం చేయగా, కాసిపేట 2 బొగ్గు గని వద్ద గేట్ మీటింగ్‌లో బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ పాల్గొన్నారు. ఇక శ్రీరాంపూర్ ఏరియాలోని SRP3 గని పై గేట్ మీటింగ్ లో పాల్గొన్నఏఐటీయూసీ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య పాల్గొన్నారు.