హత్య కేసును ఛేదించిన పోలీసులు..

మందమర్రి మండలం గుడిపల్లి గ్రామ శివారులో జరిగిన సల్లూరి అంజలి అనే యువతి హత్య కేసును ఎట్టకేలకు పోలీసులు ఛేదించారు.

Update: 2023-03-21 16:38 GMT

దిశ, రామకృష్ణాపూర్ : మందమర్రి మండలం గుడిపల్లి గ్రామ శివారులో జరిగిన సల్లూరి అంజలి అనే యువతి హత్య కేసును ఎట్టకేలకు పోలీసులు ఛేదించారు. హత్యకు సంబంధించి పూర్తి వివరాలను రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ లో జరిగిన విలేకరుల సమావేశంలో సీఐ మహేందర్ రెడ్డి మంగళవారం వెల్లడించారు. పూర్తి వివరాల్లోకివెళితే మామిడిగట్టుకు చెందిన సల్లూరి అంజలి తమదూరపు బంధువులైన నెన్నెల మండలం మన్నెగూడకి చెందిన పెరుగు గున్నక్క అలియాస్ మహేశ్వరి తన చెల్లెలు పెరుగు పరమేశ్వరి, కామేర విగ్నేష్ లు మంచిర్యాల కాలేజీ రోడ్ విద్యానగర్ లో రెండు సంవత్సరాలుగా ఒకే ఇంట్లో అద్దెకు ఉండేవారని తెలిపారు.

మహేశ్వరి చిన్నతనం నుంచి జుట్టు కత్తిరించుకుని, ప్యాంట్ షర్ట్ ధరిస్తూ మహేష్ పేరు పెట్టుకుని అబ్బాయిలాగా నడుచుకునేదని, అంజలి, మహేశ్వరి ఒకే గదిలో ఉండటం, దగ్గరి బంధువులు కావడంతో ఇద్దరు స్నేహంగా ఉండే వారని తెలిపారు. మహేశ్వరి అంజలిని ప్రేమిస్తున్నానని పెళ్లి చేసుకుందాం అంటూ ఎప్పుడూ చెబుతూ ఉండేదని తెలిపారు. కొన్ని సార్లు ఈ విషయం పై ఈ ఇద్దరి మధ్య గొడవలు కూడా జరిగాయని తెలిపారు. అదే సమయంలో మహేశ్వరి (మహేశ్) స్నేహితుడు మంచిర్యాల పట్టణానికి చెందిన అజ్మీర శ్రీనివాస్ తమ రూమ్ కు రావడంతో అంజలికి శ్రీనివాస్ తో పరిచయం ఏర్పడింది.

రోజులు గడుస్తున్నా కొద్దీ అది కాస్తా ప్రేమగా మారిందని అన్నారు. అంజలి శ్రీనివాస్ ల మధ్య ప్రేమ, అంజలి మహేశ్వరికి దూరం పెరగడం, తరచూ గొడవలు జరిగేవని మహేశ్వరి అంజలితో చాలాసార్లు శ్రీనివాస్ తో ఉన్న చనువును తగ్గించుకోవాలని చెబుతూ ఉండేదని తెలిపారు. అంజలి తన మాట వినకపోవడంతో మహేశ్వరి పథకం ప్రకారం అంజలి ఊరు వైపునకు తీసుకెళ్లి తాము మాట్లాడుకుందామని నమ్మించిందని, ఈనెల 16వ తేదీ రాత్రి సుమారు పది గంటలకు ఆర్కే 5 మీదగా గుడిపల్లికి వెళ్లే మార్గం మధ్యలో అడవి ప్రాంతంలో మహేశ్వరి పథకం రచించినట్లుగానే మాట్లాడుకుంటూ రోడ్డు నుండి కొంత దూరం లోపటికి తీసుకెళ్లింది.

ఆ తరువాత అంజలిని కత్తితో పొడిచిచంపిందని. పోలీసుల దృష్టి మరల్చేందుకు మహేశ్వరి తనను తాను గాయపరచుకొని అంజలి తనపై హత్యాయత్నం చేసినట్లుగా చిత్రీకరించిందని విషయం పోలీసుల విచారణలో బయటపడినట్లు పోలీసులు తెలియజేశారు. హత్యకు ఉపయోగించిన కత్తిని పోలీసులు స్వాధీనపరచుకున్నమని నిందితురాలుని జైలుకు తరలించనున్నట్లు సీఐ మహేందర్ రెడ్డి తెలిపారు. సమావేశంలో పట్టణ ఎస్సై అశోక్, ఏఎస్సై రజిత తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News