దేశంలో మతతత్వ రాజకీయాలకు చోటులేదు : అమీర్ అలీ ఖాన్
దేశంలో మతతత్వ రాజకీయాలకు చోటులేదని, దేశవ్యాప్తంగా కాంగ్రెస్
దిశ,ఆదిలాబాద్: దేశంలో మతతత్వ రాజకీయాలకు చోటులేదని, దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి విశేష స్పందన లభిస్తోందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ అమేర్ అలీ ఖాన్ అన్నారు. మతపరమైన విద్వేశాలకు వెళ్లకుండా అందరూ కలిసిమెలిసి ఉండాలని, మంచి ఆలోచన దృక్పథంతో ముందుకుసాగాలన్నారు. భవిష్యత్తు మొత్తం కాంగ్రెస్ పార్టీదే అధికారమని, యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాల కల్పన కోసం తనవంతు కృషి చేస్తానని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ సైతం అదే లక్ష్యంతో ఉందన్నారు. ఆదిలాబాద్ పర్యటనలో భాగంగా కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్‌చార్జి కంది శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయాన్ని ఆదివారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
హిందువులు, ముస్లిములు, సిక్కులు, బౌద్ధులు అన్న మతపరమైన విభేదాలకు వెళ్లకుండా పాలు, చక్కెరలా అందరూ ఐక్యతగా మెలగాలని ఆకాంక్షించారు. విభజించి పాలించు విధానాన్ని బీజేపీ అవలంభిస్తోందని వ్యాఖ్యనించారు. కాంగ్రెస్ పార్టీ అన్నివర్గాలను ఏకం చేసేలా ముందుకెళ్తోందన్నారు.అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్ అమలు చేస్తామని చెప్పి విస్మరించిందన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారంటీలను పకడ్బందీగా అమలు చేస్తోందన్నారు. ఉపాధి, ఉద్యోగ అవకాశాల ద్వారా అది సాధ్యం కావడానికి అవకాశం ఉంటుందన్నారు. నవ సమాజ నిర్మాణంలో అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.