Collector : సమగ్ర కుటుంబ సర్వేను పకడ్బందీగా నిర్వహించాలి
నవంబర్ 6 నుంచి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే అధికారులను ఆదేశించారు
దిశ, ఆసిఫాబాద్ : నవంబర్ 6 నుంచి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్ లో సర్వే సూపర్ వైజర్లకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమానికి జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారీ, ఆర్డీవో లోకేశ్వర్ రావు ముఖ్య ప్రణాళిక అధికారి కోటయ్య నాయక్ లతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… జిల్లాలో 335 గ్రామపంచాయతీలు, 2 మున్సిపాలిటీలలో సర్వే ప్రక్రియ కోసం 15 శాతం అదనంగా 1400 మంది ఎన్యుమరేటర్లు అవసరమని, సమర్ధులైన సిబ్బందిని గుర్తించి నియమించి వారికి శిక్షణ ఇవ్వాలని సూచించారు. నోడల్ అధికారుల నియామకంలో డాటా, కమ్యూనిటీ నిర్వహణ, జనగణనలో గత అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. రాష్ట్ర అధికారులు, క్షేత్రస్థాయి బృందాలు సమన్వయంతో పని చేసి ఎన్యుమరేషన్‌లో తలెత్తే సమస్యలను పరిష్కరించి, సందేహాలను నివృత్తి చేయాలని తెలిపారు. వివరాల సేకరణలో గోప్యత, నైతిక ప్రమాణాలు పాటించాలని అధికారులను ఆదేశించారు. అంతకుముందు బదిలీ పై వెళ్తున్న జిల్లా అదనపు కలెక్టర్ దాసరి వేణుకి శాలువా వేసి సన్మానించారు. జిల్లాకు ఆయన చేసిన సేవలను గుర్తు చేశారు.