దిలావర్పూర్ ప్రజల నిర్ణయమే నా నిర్ణయం.. ఎవరూ ఆందోళన చెందవద్దు: నిర్మల్ ఎమ్మెల్యే
తెలంగాణ రాష్ట్రంలోని నిర్మల్ జిల్లాలో దిలావర్పూర్ వద్ద ఏర్పాటు చేస్తున్న ఇథనాల్ ఫ్యాక్టరీ వ్యవహారం సంచలనంగా మారింది.
దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ రాష్ట్రంలోని నిర్మల్ జిల్లాలో దిలావర్పూర్ వద్ద ఏర్పాటు చేస్తున్న ఇథనాల్ ఫ్యాక్టరీ వ్యవహారం సంచలనంగా మారింది. తమ ప్రాంతంలో ఈ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయవద్దని గత 130 రోజులుగా స్థానిక ప్రజలు నిరసన కొనసాగించగా.. గుర్తింపు దక్కకపోవడంతో.. రెండు రోజుల క్రితం రహదారిని ముట్టడించి, స్థానిక ఆర్టీవోను దాదాపు 6 గంటల సేపు కారులోనే నిర్భందించారు. దీంతో ఒక్కసారిగా ఈ వ్యవహారం.. సంచలనంగా మారగా.. కలెక్టర్, ప్రభుత్వం ఈ ఘటనపై స్పందించి.. ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మాణ అనుమతులు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. కాగా గ్రామస్తుల నిరసనల వేల స్థానిక ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి స్పందించడం లేదని, ఆయన వెంటనే స్పందించాలని పలువురు డిమాండ్ చేశారు. దీంతో ఈ రోజు ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి గురువారం ఉదయం దిలావర్పూర్ ఇథనాల్ ఫ్యాక్టరీపై ప్రెస్ నోట్ విడుదల చేశారు.
అందులో.. తాను గతంలో సదరు పరిశ్రమను జనావాసాలకు దూరంగా తరలించానలి అధికారులతో మాట్లాడానని, ఈ సమస్యపై గుండంపల్లి రైతులందరితో చర్చించి, న్యాయపరంగా పోరాడుదామని తెలిపానని, దిలావర్పూర్ జేఏసీ నేతలతో రెండు సార్లు చర్చించినట్లు గుర్తు చేశారు. అలాగే ఈ సమస్య గురించి సీఎం దృష్టికి తీసుకెళ్లానని, రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమలపై కఠినంగా వ్యవహరిస్తుంది కావున ప్రజలు కాస్త సంయమనం పాటిస్తే శాంతియుతంగా పోరాడుదాం అని అన్నారు. అలాగే తాను దిలావర్పుర్ ప్రజల నిర్ణయానికి కట్టుబడి ఉన్నానని, ప్రజల నిర్ణయమే తన నిర్ణయమని.. వారి కోసమే నేను ఉన్నానని.. ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మాణం ఆగిపోయే వరకు చర్యలు తీసుకుంటానని తేల్చి చెప్పారు. అలాగే ఫ్యాక్టరీ నిర్మాణానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేసిన రైతులపై ఎటువంటి కేసులు పెట్టవద్దని పోలీసు అధికారులకు సూచించారు. పరిశ్రమ పనులు తక్షణమే నిలిపివేయాలని తాను డిమాండ్ చేస్తున్నట్లు బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి చెప్పుకొచ్చారు.