ఇథనాల్‌పై రైతు విజయం..అనుమతులపై సర్కారు పునరాలోచన..?

తమ గ్రామాలకు యమపాశంగా మారుతున్నదన్న కారణంతో ఇథనాల్

Update: 2024-11-28 02:23 GMT

దిశ ప్రతినిధి, నిర్మల్ : తమ గ్రామాలకు యమపాశంగా మారుతున్నదన్న కారణంతో ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మాణాన్ని నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ దిలావర్ పూర్ మండలంలోని గుండంపల్లి, దిలావర్ పూర్ గ్రామాల ప్రజలు ఎట్టకేలకు బుధవారం నిరాహార దీక్షలను విరమించారు. తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఫ్యాక్టరీ నిర్మాణ పనులను నిలిపివేస్తున్నట్లు కలెక్టర్ అభిలాష అభినవ్ ప్రకటించారు. ఫ్యాక్టరీ నిర్మాణం పై పునరాలోచన చేస్తామని ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు రైతులు తమ ఆందోళనను విరమించారు.

రెండు రోజుల మెరుపు ఆందోళనతో..

సుమారు 130 రోజులుగా ఇతనాల్ ఫ్యాక్టరీ నిర్మాణాన్ని రద్దు చేయాలన్న డిమాండ్ తో ఆయా గ్రామాల్లో రైతులతో పాటు ప్రజలు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇంతకాలం సంయమనంతో నిరాహార దీక్షలు చేసిన ఆయా గ్రామాల ప్రజలు తమ ఆందోళన కొత్త పుంతలు తొక్కించారు. మంగళ, బుధవారాల్లో రైతులు, మహిళలతో కలిసి నాలుగు గ్రామాల ప్రజలు చేసిన తీవ్రస్థాయి మెరుపు ఆందోళన ప్రభుత్వాన్ని దిగివచ్చేలా చేసింది. మంగళవారం ఉదయం 9 గంటల నుంచి ఆ రోజు అర్ధరాత్రి దాకా రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేసిన మహిళలు రైతులు సమస్యపై చర్చించేందుకు వచ్చిన నిర్మల్ రెవెన్యూ డివిజనల్ అధికారి రత్న కళ్యాణిని నిర్బంధించారు. సుమారు 6 గంటలకు పైగా ఆమె వాహనాన్ని చుట్టుముట్టి తీవ్ర ఆందోళన చేశారు. ఒక దశలో ఆమె వాహనాన్ని కొందరు ధ్వంసం చేసే ప్రయత్నం చేశారు.

ఈ పరిణామం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఎస్పీ డాక్టర్ జానకి షర్మిల స్వయంగా కలగజేసుకొని ఈ పరిణామం నుంచి ఆర్డీవోను సురక్షితంగా అక్కడి నుంచి నిర్మల్ కు తరలించారు. మరుసటి రోజు బుధవారం కూడా తమ ఆందోళనను కొనసాగించారు. ఫ్యాక్టరీ వైపు రైతులు మహిళలు యువత దూసుకు వచ్చే ప్రయత్నం చేస్తారన్న అనుమానంతో రోడ్డుపై అటువైపు ఎవరిని వెళ్లనివ్వకుండా బారికేడ్లను ఏర్పాటు చేశారు. భారీగా మోహరించిన పోలీసులు రైతులు చేస్తున్న ఆందోళనకు దూరంగా ఉండి పరిస్థితిని సమీక్షించారు. వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతున్న పరిస్థితిని అధికారులు గమనించి సమస్యను ఉన్నతాధికారులకు చేరవేశారు.

చొరవ చూపిన కలెక్టర్, ఎస్పీ

ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ రైతులు చేస్తున్న ఆందోళన తీవ్రతరం అవుతున్న నేపథ్యంలో సమస్య మరింత జటిలం కాకుండా జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్, ఎస్పీ డాక్టర్ జానకి షర్మిల లు చొరవ తీసుకున్నారు. రైతు ప్రతినిధులతో పలు దఫాలుగా చర్చించే ప్రయత్నం చేసి విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు. రైతులు మహిళల ఆగ్రహం తీవ్ర స్థాయికి వెళుతున్న అంశాన్ని అంచనా వేసి ఒకవైపు భద్రత వ్యవహారాలను అమలు చేస్తూనే తాజా విషయాలను ప్రభుత్వానికి నివేదించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఫ్యాక్టరీ నిర్మాణం అలాగే కొనసాగిస్తే పరిస్థితి అదుపు తప్పే సమస్య తలెత్తే అవకాశం ఉండడంతో ఫ్యాక్టరీ నిర్మాణాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ప్రకటించారు. నిర్మల్ జిల్లాలో తాజాగా నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఫ్యాక్టరీ నిర్మాణం అనుమతులపై ప్రభుత్వం పునరాలోచన చేస్తుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు

రైతుల సంబరాలు...

ఫ్యాక్టరీ నిర్మాణ పనులు నిలిపివేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ప్రకటించడం, ప్రభుత్వం కూడా నిర్మాణ పనులపై పునరాలోచన చేస్తున్నట్లు మీడియాలో ప్రచారం జరగడంతో రైతులు సంబరాలు చేసుకున్నారు. ఒక దశలో దిలావర్పూర్ గ్రామస్తులు తమకు ఎంతగానో సహకరించారంటూ జిల్లా ఎస్పీ డాక్టర్ జానకి షర్మిల ను తమ గ్రామానికి ఆహ్వానించారు. ఎట్టకేలకు ప్రభుత్వ ప్రకటనలతో రైతులు ఆందోళన విరమించడంతో ప్రశాంత వాతావరణం నెలకొంది.


Similar News