fireworks prices : టపాసుల మోత.. భారీగా పెరిగిన బాణసంచా ధరలు..
జిల్లాలో దీపావళి పండుగ.. సామాన్యుడికి భారంగా మారింది. మార్కెట్‌లో టపాసుల ధరలు మోతెక్కుతుండడంతో జనం వణుకుతున్నారు.
జిల్లాలో దీపావళి పండుగ.. సామాన్యుడికి భారంగా మారింది. మార్కెట్‌లో టపాసుల ధరలు మోతెక్కుతుండడంతో జనం వణుకుతున్నారు. షాపుల అనుమతి, ఇతరత్రాకు సంబంధించి మామూళ్లు చెల్లించిన వ్యాపారులు ఆ భారమంతా వినియోగదారుల పై మోపుతున్నారు. భారీగా పెరిగిన టపాసుల ధరలతో ఈ ఏడాది సాధారణ, మధ్యతరగతి వారు టపాసుల కొనాలంటేనే జంకుతున్నారు. దీపావళి పండుగను ఈ సారి ఎంతో ఉత్సాహంగా టపాసులు కొందామని వచ్చిన వారికి ఆ ధరలు చూసి గుండె గుభేల్ మనిపిస్తుందని పలువురు వినియోగదారులు వాపోతున్నారు. గతేడాదితో పోలిస్తే టపాసుల ధరలు 40 శాతం పైనే పెరిగాయి. అగ్గిపెట్టెల నుంచి థౌజండ్ వాలా, టెన్ థౌజండ్ వాలా బాంబుల వరకు అన్నింటి ధరలు చుక్కలనంటుతున్నాయి.
దిశ, ఆసిఫాబాద్ : దీపావళి పండుగ పూట మార్కెట్లో టపాసుల ధరల మోత మోగుతోంది. దుకాణాల నిర్వాహకులు సిండికేట్ గా ఏర్పడి ఇష్టారాజ్యంగా టపాసుల ధరలు పెంచి విక్రయిస్తున్నారు. ధరలను నియంత్రించాల్సిన అధికారులు మామూళ్ల మత్తలో చూసీచూడనట్లు వ్యవహరిస్తుండటంతో సామాన్య జనాల పై భారం పడుతుంది. దీంతో సామాన్య ప్రజలు మార్కెట్లో టపాసుల కోనుగోలు చేసే పరిస్థితి లేకుండా ఉంది. జిల్లాలో ప్రతి ఏటా సుమారు రూ. 3 కోట్ల పై టపాసుల వ్యాపారం జరుగుతున్నట్లు సమాచారం.
కెమికల్స్ ధరలు తగ్గినా...
గత ఏడాది దీపావళి పేలుడు పదార్థాల పై 23 శాతం జీఎస్టీ ఉండగా ఈ ఏడాది 18 శాతానికి తగ్గింది. టపాసుల తయారీలో వాడే కెమికల్స్ ధరలు కూడా చాలా తగ్గినా.. మార్కెట్లో టపాసుల ధరలు మాత్రం వ్యాపారులు తగ్గించడం లేదు. భూచక్రం బాక్స్ తో పాటు చిచ్చుబుడ్లు రకాలను ఏరియాలను బట్టి రూ. 30 నుంచి రూ.200, రూ. 50 నుంచి రూ.300 వరకు ధరలు ఉన్నాయి. ఇక 1000 వాలా బాక్స్ రూ.300 కాగా, 5000 వాలా రూ. 1200 వరకు అమ్ముతున్నారు. సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడంతో వ్యాపారులు సిండికేట్ గా ఏర్పడి ప్రజల పై భారం మోపుతున్నారు.
మామూళ్ల ఇస్తే చాలు..
టపాసుల దుకాణాల నిర్వాహకులు మామూళ్ల ఇస్తే చాలు.. క్షేత్రస్థాయిలో ఎలాంటి తనిఖీలు చేయకుండానే అధికారులు దుకాణాల ఏర్పాటుకు అడ్డగోలుగా అనుమతులు ఇస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. దీంతో వ్యాపార నిర్వాహకులు ఈ నష్టాన్ని పూడ్చేందుకు టపాసుల ధరలు పెంచి విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. ఏదేమైనా అధికారులు స్పందించి టపాసుల దుకాణాలను తనిఖీ చేసి.. టపాసుల ధరలను నియంత్రించాలని ప్రజలు కోరుతున్నారు.