BC movement : తెరపైకి మరో బీసీ ఉద్యమం..!

మరో బీసీ ఉద్యమం తెరకెక్కుతున్నది. రిజర్వేషన్లలో ఈడబ్ల్యూఎస్ ( ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ ) కారణంగా బీసీ వర్గాలు తీరని అన్యాయానికి గురవుతున్నాయి.

Update: 2024-10-30 03:30 GMT

దిశ ప్రతినిధి, నిర్మల్ : మరో బీసీ ఉద్యమం తెరకెక్కుతున్నది. రిజర్వేషన్లలో ఈడబ్ల్యూఎస్ ( ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ ) కారణంగా బీసీ వర్గాలు తీరని అన్యాయానికి గురవుతున్నాయి. దీన్ని రద్దు చేయాలన్న డిమాండ్ తో ఎస్సీ,ఎస్టీలను కలుపుకొని ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్లేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. అగ్రవర్ణాల్లో ఆర్థికంగా వెనుకబడిన వారికి 10 శాతం రిజర్వేషన్లు అమలు చేయడాన్ని వ్యతిరేకిస్తున్నారు. మరోవైపు రాష్ట్రంలో జీవో 29 కూడా తమకు గొడ్డలిపెట్టుగా ఉందని ఈ వర్గాలు భావిస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలకు శ్రీకారం చుడుతున్నారు. ఈ నెల 27న నిర్మల్, కామారెడ్డి, మెట్‌పల్లి కేంద్రాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ ఇంటలెక్చువల్ ఫోరం పేరుతో రౌండ్ టేబుల్ సమావేశాలు జరిగాయి. ముందుగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలు, డివిజన్ , తాలూకా కేంద్రాల్లో నవంబర్ నెలలోగా రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించేందుకు కార్యాచరణ చేస్తున్నామని ఫోరం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కన్వీనర్ దర్శనం దేవేందర్ వెల్లడించారు. ఆ తర్వాత ఎస్సీ, ఎస్టీ, బీసీలతో భారీ ఎత్తున నిరసన కార్యక్రమాన్ని చేపడతామని చెప్పారు.

మేమెంతో మాకంత నినాదంతో...

దేశ జనాభాలో 90% నికి పైగా ,అత్యధిక శాతం ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ జనాభాకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లను అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు సమంజసమేనా అనే అంశంతో బీసీ, ఎస్సీ ఎస్టీలను ఏకం చేస్తున్నారు. ఇప్పుడు అమలవుతున్న రిజర్వేషన్లలో తీవ్ర అన్యాయం జరుగుతుందని అభిప్రాయపడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం 2019లో తీసుకొచ్చిన ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల పై పలువురు మండిపడుతున్నారు. రాజ్యాంగ హక్కులను తుంగలో తొక్కి జనాభాలో కేవలం 7%కుడా లేని ఓసీలకు ఆర్థిక వెనుకబాటును సాకుగా చూపి, 10 శాతం రిజర్వేషన్లను అమలు చేయడం సమంజసం కాదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ రిజర్వేషన్ల వల్ల ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు, నిరుద్యోగులు ఎన్నో ఉద్యోగ, విద్యా అవకాశాలను కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు అమలు అయ్యే వరకు ఉద్యమించాలని, జనాభాలో ఎస్సీ, ఎస్టీ, బీసీల దామాషా ప్రకారం రిజర్వేషన్లు ఉండాలన్న డిమాండ్ ను తెరపైకి తెస్తున్నారు. జనరల్ కేటగిరిలో ఉన్న సీట్లలో గానీ, ఉద్యోగాల్లో గానీ 10% అమలు చేయకుండా.. మొత్తం సీట్లు, ఉద్యోగాల్లో 10 శాతం ఈడబ్ల్యూఎస్ కు కేటాయిస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీల కన్నా ఎక్కువగా అగ్రవర్ణాల్లో ఉండే ఈడబ్ల్యూఎస్ వారికే అవకాశాలు దక్కుతాయన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. త్వరలో ఎస్సీ ఎస్టీ, బీసీలకు జరుగుతున్న అన్యాయాలపై గ్రామ గ్రామాన చైతన్య కార్యక్రమాలను నిర్వహించి, ప్రజలను చైతన్యవంతం చేస్తామని వక్తలు అభిప్రాయపడ్డారు.

మండల్ ఉద్యమం తరహాలో...

బీసీల రిజర్వేషన్ల కోసం మండల్ కమిషన్ కు అనుకూలంగా దేశవ్యాప్తంగా సాగిన బీసీల ఉద్యమం తరహాలోనే ఇప్పుడు ఈ డబ్ల్యూఎస్ వ్యతిరేక ఉద్యమాన్ని క్షేత్రస్థాయిలో నడిపేందుకు కార్యాచరణ చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే బీసీ ఐక్య సంఘాల నేతలకు సమాచారం ఇవ్వడంతో పాటు వారందరితో త్వరలోనే సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కన్వీనర్ దర్శనం దేవేందర్ వెల్లడించారు.

Tags:    

Similar News