ఆ సీటుపై కన్నేసిన హైదరాబాద్ కలెక్టర్.. టీఆర్‌ఎస్ నుంచి పోటీ?
దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: పరిపాలన నుంచి ప్రజాసేవకు సిద్దమవుతున్నారు కొందరు ఐఏఎస్‌లు, ఇతర అధికారులు. కొందరు న
దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: పరిపాలన నుంచి ప్రజాసేవకు సిద్దమవుతున్నారు కొందరు ఐఏఎస్‌లు, ఇతర అధికారులు. కొందరు కలెక్టర్లు రాజకీయాల వైపు మొగ్గు చూపుతున్నారు. ఇప్పటికే కలెక్టర్ పదవికి రాజీనామా చేసిన సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామిరెడ్డి.. రాజకీయాల్లోకి వచ్చి గులాబీ పార్టీలో చేరి ఎమ్మెల్సీ అయ్యారు. తాజాగా ఆయన బాటలోనే మరో కలెక్టర్, కొందరు అధికారులు నడిచేందుకు సిద్ధమవుతున్నారు.. పరిపాలనలో మంచిపేరు తెచ్చుకున్న వారు ఇక ప్రజా సేవయే లక్ష్యమంటున్నారు. ఎన్నికల కురుక్షేత్రంలో దిగడానికి సై అంటున్నారు. ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లాలోని ఎస్టీ రిజర్వు స్థానాల్లో పోటీకి సిద్ధమవుతున్నరు..!
ఎమ్మెల్సీ వెంకట్రాంరెడ్డి బాటలో మరో కలెక్టర్ పయనమవుతున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ కలెక్టర్ గా పని చేస్తున్న శర్మన్ఈ ఏడాది జూన్ నెలలో పదవీ విరమణ చేయనున్నారు. పదవి విరమణ తర్వాత ఆయన టీఆర్ఎస్ పార్టీలో చేరుతారనే ప్రచారం సాగుతోంది. శర్మన్ నిర్మల్ జిల్లా ఖానాపూర్ నియోజకవర్గంలోని జన్నారం మండలానికి చెందినవారు. ఈ నియోజకవర్గం ఎస్టీ రిజర్వుడు నియోజక వర్గం. ఇక్కడి నుండి టీఆర్ఎస్ ఎమ్మెల్యే రేఖానాయక్ రెండుసార్లు విజయం సాధించారు. మళ్లీ మూడోసారి పోటీ చేయాలని భావిస్తున్నారు. రేఖా నాయక్ మీద ప్రజల్లో వ్యతిరేకత ఉందని, సొంత పార్టీ నాయకులే ఆమె అవినీతిపై పార్టీ పెద్దలకు ఫిర్యాదు చేయటం, పార్టీ నిర్వహించిన సర్వేలో ఆమె వెనకబడ్డారట. ఇలాంటి పరిస్థితిలో టికెట్ ఇస్తే ప్రతికూల ఫలితం తప్పదని భావిస్తున్నారట.
ఖానాపూర్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీ ప్రత్యామ్నాయ అభ్యర్థి కోసం అన్వేషిస్తున్నారట. శర్మన్ ఇదే నియోజక వర్గానికి చెందిన వారు కావడం, లంబాడా సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో శర్మన్ వైపు టీఆర్ఎస్ అధినాయకత్వం మొగ్గు చూపుతున్నట్లు చర్చ సాగుతోంది. ఆయన మంత్రి కేటీఆర్ కు అత్యంత సన్నిహితులు. శర్మన్ పార్టీ అభ్యర్థిగా దింపితే.. కొత్త అభ్యర్థి, ఓ ఐఏఎస్ గా మంచిపేరు ఉండటంతో గెలిచేందుకు అవకాశాలున్నాయని పార్టీ పెద్దలు భావిస్తున్నారట. జూన్ లో పదవి విరమణ కాగానే.. శర్మన్ టీఆర్ఎస్ పార్టీలో చేరుతారనే ప్రచారం ఉంది. ఖానాపూర్ నియోజకవర్గం నుండి పార్టీ కార్యకలాపాలు నిర్వహిస్తారని నియోజకవర్గంలో జోరుగా ప్రచారం సాగుతోంది. ఎట్టి పరిస్థితుల్లో టికెట్ తనకే దక్కుతుందని రేఖానాయక్ భావిస్తున్నారు. రాబోయే ఎన్నికలలో ఖానాపూర్ టీఆర్ఎస్ టికెట్ ఎవరికి దక్కతుందో చూడాలి.
ఇదే నియోజకవర్గంపై దృష్టి పెట్టిన మరికొందరు కూడా ప్రభుత్వ ఉద్యోగాలు వదిలి రాజకీయాల్లోకి వచ్చారు. ఆదిలాబాద్ జడ్పీ ఛైర్ పర్సన్ రాథోడ్ జనార్థన్ కూడా ల్యాండ్ సర్వే విభాగంలో పని చేశారు. తాజాగా ఖానాపూర్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ నుంచి టికెట్ ఆశిస్తున్నారు. స్వతంత్ర జడ్పీటీసీ సభ్యురాలిగా పెంబి నుంచి గెలిచిన బుక్యా జానూబాయి ఉద్యోగం వదిలి రాజకీయాల్లోకి వచ్చారు. ప్రస్తుతం బీజేపీలో ఉండగా.. ఖానాపూర్ టికెట్ ఆశిస్తున్నారు. మరోవైపు బోథ్ కూడా ఎస్టీ రిజర్వు నియోజకవర్గమే. ఇక్కడ కూడా ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులు ఎక్కువగా రాజకీయాల్లోకి వచ్చారు. ఇక్కడ ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలుగా గెలిచిన వారిలో కొందరు ఉపాధ్యాయులు ఉన్నారు. మాజీమంత్రులు గోడం రామారావు, గోడం నగేశ్ ఉపాధ్యాయులే. మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత ఎంపీ సోయం బాపురావు కూడా గతంలో ఉపాధ్యాయుడే. ప్రస్తుత ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు కూడా ఉపాధ్యాయుడిగా పని చేసి.. రాజకీయాల్లోకి వచ్చారు. తాజాగా సాకె దశరథ్ ల్యాండ్ సర్వే విభాగం ఏడీగా పని చేసి.. ఈ నియోజకవర్గంలో రాజకీయాల్లోకి వచ్చారు. గత కొన్ని రోజులుగా స్వచ్ఛంద సేవ చేయగా.. ఇటీవల బీజేపీలో చేరారు