ఆదిలాబాద్‌లో విస్తారంగా కురుస్తున్న భారీ వర్షాలు..అప్రమత్తంగా ఉండాలంటున్న అధికారులు

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఆదిలాబాద్

Update: 2024-09-01 12:43 GMT

దిశ, ఆదిలాబాద్ : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఆదిలాబాద్ జిల్లాలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో సాధారణం కంటే అత్యధిక వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలియజేశారు.గత రాత్రి 9 గంటల నుంచి జిల్లా వ్యాప్తంగా ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలతో తలమడుగు, తాంసి, జైనథ్, ఇంద్రవెల్లి, బోథ్, ఆదిలాబాద్ రూరల్ , ఉట్నూర్, నార్నూర్, గాదిగూడ వంటి మండలాలలో వాగులు వంకలు చెరువులలో భారీగా వరద నీరు చేరింది. ఈ క్రమంలో జిల్లాలోని వాగులు వంకలు పొంగిపొర్లడంతో ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడగా, రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అంతేకాకుండా చెరువులు, ప్రాజెక్టులు నిండుకుండలను తలపిస్తున్నాయి.రానున్న రెండు రోజుల్లోనూ భారీ నుంచి, అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్, ఉన్నతాధికారుల సూచనల మేరకు ఇరిగేషన్ అధికారులు తాంసి మండలంలోని మత్తడివాగు ప్రాజెక్టు మూడు గేట్లను, జైనథ్ మండలంలోని సాత్నాల ప్రాజెక్టు రెండు గేట్లను ఎత్తివేశారు.

ఇదే మండలంలోని ఆనంద్ పూర్ గ్రామ సమీపంలో గల మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న పెన్ గంగ దిగ్రాస్ గ్రామ బ్రిడ్జి పై నుంచి వరద నీరు ఉధృతంగా ప్రవహించడంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.ఇది ఇలా ఉంటే గడిచిన రెండు రోజుల్లో ఆదిలాబాద్ జిల్లాలో విస్తారంగా కురుస్తున్న వర్షాలతో 63.2 ఏం ఏం వర్షపాతం నమోదైందనీ వాతావరణ శాఖ అధికారులు తెలియజేశారు. శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు జిల్లాలో 803.6 ఎం ఎం శాతం వర్షం కురిసినట్లు వెల్లడించారు. ఇంకా రానున్న రెండు,మూడు రోజుల్లో కూడా ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా విస్తారంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉంటూనే లోతట్టు ప్రాంతాల ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికార యంత్రాంగం సూచించింది.ఇప్పటికే ప్రాజెక్టులు వాగులు, వంకలు, చెరువుల సమీపంలోని గ్రామాల ప్రజలను అప్రమత్తం చేసినట్లు వారు చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఏమైనా సంఘటనలు జరిగినట్లయితే స్థానికంగా ఉన్న పోలీస్ యంత్రాంగాన్ని, అధికారులను సంప్రదించాలని జిల్లా కలెక్టర్ తెలియజేశారు.


Similar News