కాంగ్రెస్‌లో గ్రూపు విభేదాలు.. ఏలేటి యాత్ర ముగిసినట్టేనా..?
కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ నేత మల్లు భట్టి విక్రమార్క ఆదిలాబాద్ జిల్లాలో చేపట్టిన జోడో పాదయాత్రలో పార్టీ గ్రూప్ విభేదాలు మరోసారి బయటపడ్డాయి..
దిశ ప్రతినిధి, నిర్మల్: కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ నేత మల్లు భట్టి విక్రమార్క ఆదిలాబాద్ జిల్లాలో చేపట్టిన జోడో పాదయాత్రలో పార్టీ గ్రూప్ విభేదాలు మరోసారి బయటపడ్డాయి. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి యాత్ర తర్వాత ఆయనకు దీటుగా అధిష్టానంతో అనుమతి పొంది నిర్మల్ నుంచి హైదరాబాద్ దాకా పాదయాత్ర చేస్తున్నట్లు ప్రకటించిన మహేశ్వర్ రెడ్డి మధ్యంతరంగా తన యాత్రను నిలిపివేసినట్లు తెలుస్తోంది. ఆయన యాత్ర కేవలం నిర్మల్ నియోజకవర్గంలో మాత్రమే సాగింది. ముందుగా చెప్పిన షెడ్యూల్ ప్రకారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ముధోల్ నిర్మల్ ఖానాపూర్ బోత్ ఆదిలాబాద్ నియోజకవర్గాల్లో సాగుతుందని ప్రకటించారు. మరో పక్కన ఉత్తర తెలంగాణ జిల్లాల మీదుగా హైదరాబాద్ దాకా యాత్ర ఉంటుందని మరో షెడ్యూల్ వెలువడింది.
ఈ రెండింటిని పక్కనపెట్టి ముధోల్ నియోజకవర్గంలోని బైంసా పట్టణంలో ప్రారంభించిన మహేశ్వర్ రెడ్డి యాత్ర నిర్మల్ నియోజకవర్గంలో మామడ మండలంలో ముగిసింది. ఆ తర్వాత యాత్రను మళ్ళీ ప్రారంభిస్తామని ప్రకటించారు. తాజాగా, అందిన సమాచారం మేరకు ఆయన యాత్ర ఇక ఉండబోదని తెలుస్తోంది. ఆదిలాబాద్ జిల్లాలో ప్రారంభమైన భట్టి జోడో యాత్ర ను విజయవంతం చేస్తామని తాను చేపట్టిన యాత్రను కూడా అందులో విలీనం చేస్తానని మహేశ్వర్ రెడ్డి హైదరాబాద్ లో ప్రకటించారు. ఆ ప్రకటన మేరకు పార్టీలో మహేశ్వర్ రెడ్డి తన పలుకుబడిని చాటుకుంటూ భట్టి వర్గంగా ముద్ర వేసుకున్నారన్న ప్రచారం జరిగింది.
ఏలేటి యాత్ర ముగిసినట్టేనా..
ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల అమలు కమిటీ చైర్మన్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి చేపట్టిన జోడో యాత్ర ఇక ముగిసినట్టేనా అన్న చర్చ జరుగుతోంది. రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా యాత్ర మొదలుపెట్టి పార్టీలో కొత్త చర్చకు తెరలేపిన మహేశ్వర్ రెడ్డి ఆ తర్వాత తన నిర్ణయాన్ని మార్చుకున్నట్లు తెలుస్తోంది. భట్టి యాత్రకు సంఘీభావంగా తన యాత్రను ఆయనతో కలిసి చేయనున్నట్లు హైదరాబాదులో ప్రకటించారు. ఆ తర్వాత ఆయన తాజాగా, మొదలైన విక్రమార్క యాత్రతో కలిసి చేపట్టడం లేదు దీన్నిబట్టి ఆయన యాత్ర మళ్ళీ ప్రారంభిస్తారా లేదా ఇక ముగిసినట్టేనా అన్న అనుమానాలు పార్టీ వర్గాల్లో వ్యక్తం అవుతున్నాయి.
భట్టి యాత్రకు దూరం..
గురువారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని బజార్హత్నూర్ మండలం పిప్పిరి గ్రామంలో ప్రారంభమైన భట్టి విక్రమార్క యాత్రకు ఏలేటి మహేశ్వర్ రెడ్డి డుమ్మా కొట్టారు. ఆయన గైర్హాజరు సంబంధించి ఎలాంటి ప్రకటన చేయలేదు. కానీ ఏలేటి ఈ యాత్రకు దూరంగా ఉండటం వెనుక ప్రేమ్ సాగర్ రావుకు విక్రమార్క ప్రాధాన్యం ఇవ్వడమేనని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతున్నది తూర్పు జిల్లాకు చెందిన ప్రేమ్ సాగర్ రావు కు తాను ఆధిపత్యం చెలాయించే పశ్చిమ జిల్లా బాధ్యతలు అప్పగించడంపై మహేశ్వర్ రెడ్డి తీవ్రంగా మండిపడుతున్నట్లు తెలుస్తోంది. దీన్ని దృష్టిలో ఉంచుకునే ఆయన భట్టి యాత్రకు దూరంగా ఉన్నారని పార్టీ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. అయితే మహేశ్వర్ రెడ్డి ఎప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో అర్థం కాక పార్టీ నేతలు కార్యకర్తలు జుట్టు పీక్కుంటున్నారు.