జలవిహార్ ప్రాజెక్ట్‌కు గ్రహణం..
బాసర జ్ఞాన సరస్వతీ క్షేత్రాన్ని సందర్శించే యాత్రీకులను ఆకట్టుకునేందుకు శ్రీ రామ్ సాగర్ ప్రాజెక్టు నుంచి బాసర దాకా బోటు జల విహారం ప్రాజెక్టు ప్రతిపాదనలు కాగితాలకే పరిమితమయ్యాయి.
దిశ ప్రతినిధి, నిర్మల్: బాసర జ్ఞాన సరస్వతీ క్షేత్రాన్ని సందర్శించే యాత్రీకులను ఆకట్టుకునేందుకు శ్రీ రామ్ సాగర్ ప్రాజెక్టు నుంచి బాసర దాకా బోటు జల విహారం ప్రాజెక్టు ప్రతిపాదనలు కాగితాలకే పరిమితమయ్యాయి. కరోనా కల్లోలం తర్వాత రాష్ట్రంలోని వివిధ నదీతీర ప్రాంతాల్లో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు నౌకావిహారం ప్రాజెక్టును అమలు చేయాలని అప్పటి కేసీఆర్ ప్రభుత్వం ప్రతిపాదనలు తయారు చేసింది. ఇందులో భాగంగానే కొన్ని నది తీర ప్రాంతాల్లో బోటు ప్రయాణాన్ని ప్రారంభించిన ప్రభుత్వం బాసర జలవిహార్ ప్రాజెక్టును విస్మరించింది. బాసర సరస్వతీ దేవిని దర్శించేందుకు ప్రతిరోజు తెలంగాణ సహా పొరుగు రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. ముఖ్యంగా ప్రతి శుక్రవారం తో పాటు పండుగ పర్వదినాలలో అమ్మవారిని దర్శించేందుకోసం భక్తులు బారులు తీరుతారు. ఇక్కడ భక్తులకు వసతి సౌకర్యం ఉండడం తో ఒకరోజు గడిపి మరుసటి రోజు అమ్మవారి మొక్కులు తీర్చుకుంటారు. అమ్మవారి దర్శనం అనంతరం భక్తులు గోదావరిలో బోటు షికారు చేసే సౌకర్యం కల్పిస్తే ఇటు టూరిజం శాఖకు ఆదాయపరంగా, భక్తులకు ఆహ్లాదకరంగా ఉంటుందని భక్తులు అభిప్రాయపడుతున్నారు.
కాగితాల్లోనే ప్రతిపాదనలు
బాసర నుంచి ఎస్సారెస్పీ ప్రాజెక్టు వరకు బోట్లు నడపాలనే ప్రతిపాదన కాగితాలకే పరిమితమైంది. ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకం శంకుస్థాపనకు అప్పట్లో పోచంపాడు వచ్చిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ అంశాన్ని ప్రకటించారు. పథకం పూర్తయితే కాళేశ్వరం జలాలతో ఎస్సారెస్సీ నిండితే బాసర - ఎస్సారెస్పీ మధ్య పడవలో ప్రయాణించవచ్చనిఆయన అప్పట్లో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సాగునీటి, పర్యాటక శాఖ అధికారులు ఇక్కడ బోటు విహారంపై దృష్టి సారించారు. ఇందులో భాగంగానే 2019లో కసరత్తు ప్రారంభించి ట్రయల్ రన్ కూడా ప్రయోగాత్మకంగా చేపట్టారు. సర్వీసులు కూడా ప్రారంభిస్తామని పర్యాటక శాఖ పేర్కొంది. కానీ ఇప్పటి వరకు ఆ దిశగా దృష్టి సారించకపోవడం పట్ల యాత్రికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
భక్తులకు బోటు షికారు కలేనా..
బాసర సరస్వతి అమ్మవారిని దర్శించుకున్న అనంతరం మరింత ఆహ్లాదం, మధురానుభూతిని పొందేందుకు ఈ ప్రాజెక్టును చేపట్టాలని నిర్ణయించారు. ఈ ప్రాజెక్ట్ సాకారమైతే రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు ఎస్సారెస్పీ చేరుకుని అక్కడి నుంచి బాసరకు బాసర నుంచి తిరిగి శ్రీరాంసాగర్ కు పడవల ద్వారా ప్రయాణించే అవకాశం లభిస్తుంది. ఎస్సారెస్సీని అనుకుని ఉన్న నిజామాబాద్ జిల్లాలోని బస్వాపూర్, నాగాపూర్ గ్రామాల దగ్గర బోటింగ్ పాయింట్ లు ఏర్పాటు చేసి బాసర వరకు పడవలను నడపాలని గతంలో అధికారులు సూత్రప్రాయంగా నిర్ణయించారు. కానీ ఇప్పటివరకు ఈ ప్రాజెక్టు పనులు మొదలు కాలేదు.
అవకాశాలు అనేకం.. ఇసుక మేటల సమస్య..?
పర్యాటక శాఖ, దేవాదాయ శాఖలు సంయుక్తంగా ప్రాజెక్టుపై సీరియస్ కార్యాచరణ మొదలుపెట్టాలని సూచిస్తున్నారు. గోదావరి లో బోటు ప్రయాణాలను ఆరంభిస్తే ఎస్సారెస్పీ నుంచి బాసర, బాసర నుంచి ఎస్సారెస్పీ వరకు రెండున్నర గంటల వ్యవధిలో గమ్యం చేరుకోవచ్చంటున్నారు. సుమారు 60 కిలోమీటర్ల మేర ఈ ప్రయాణం సాగుతుందని మధ్యలో బ్రహ్మేశ్వరం ఆలయ సందర్శన, ఉమ్మెడ తదితర పర్యాటక ప్రాంతాల వద్ద బోట్లు నిలిపినా మూడు గంటల్లో బాసరకు చేరుకోవచ్చంటున్నారు. వేసవి మినహా మిగతా ఎనిమిది నెలల పాటు పడవలను నడిపే అవకాశం ఉంటుందంటున్నారు. అయితే బాసర గోదావరి వద్ద ఇసుక మేటలు ఎక్కువగా ఉన్నాయని ఇది బోటు ప్రయాణానికి సమస్యగా మారుతుందన్న అభిప్రాయాలు ఉన్నాయి. అయితే దీని తొలగింపు పెద్ద కష్టమేమీ కాదని కూడా అధికార వర్గాలు చెబుతున్నారు.
కొత్త సర్కారుపై ఆశలు..
ఇదిలా ఉండగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎస్ఆర్ఎస్పీ బాసర గోదావరి జలవిహారం ప్రాజెక్టు ప్రతిపాదనలను కాగితాలకే పరిమితం చేయడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. అయితే కొత్తగా అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టు ప్రతిపాదనలకు మోక్షం కల్పించాలని స్థానికులు కోరుతున్నారు. యాత్రికులకు ఆహ్లాదం కల్పించేందు కోసమే కాకుండా టూరిజం శాఖకు ఆర్థికంగా కూడా ప్రయోజనం చేకూరుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కోణంతోనైనా జలవిహారం ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేయాలని కోరుతున్నారు.