నాలుగేళ్ల నుండి తప్పని ఎదురు చూపులు..

స్వచ్ఛభారత్ కార్యక్రమంలో భాగంగా మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టి నాలుగేళ్లు గడిచినా డబ్బులు రాకపోవడంతో లబ్ధిదారులు ఆందోళనకు గురవుతున్నారని ఈ విషయాన్ని ఎన్నిసార్లు అధికారుల దృష్టికి తీసుకురావాలని సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు.

Update: 2023-03-29 10:21 GMT

దిశ, లోకేశ్వరం : స్వచ్ఛభారత్ కార్యక్రమంలో భాగంగా మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టి నాలుగేళ్లు గడిచినా డబ్బులు రాకపోవడంతో లబ్ధిదారులు ఆందోళనకు గురవుతున్నారని ఈ విషయాన్ని ఎన్నిసార్లు అధికారుల దృష్టికి తీసుకురావాలని సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. పలువురు అధికారుల గైర్హాజరుతో కొద్దిసేపు నిలిచిపోయిన మండల సమావేశం ఆ అధికారులకు నోటీసులు జారీ చేయడంతో సభ్యులు శాంతించి సమావేశాన్ని కొనసాగింపజేశారు. బుధవారం మండల పరిషత్ అధ్యక్షురాలు లలిత భోజన్న అధ్యక్షతన జరిగిన మండల సర్వసభ్య సమావేశంలో పలువురు సర్పంచులు ఆవేదన వ్యక్తం చేశారు. ఓడీఎఫ్ గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు సర్పంచులు ప్రణాళికాబద్ధంగా పూర్తిచేయాలని గతంలో అధికారుల ఒత్తిడి మేరకు గ్రామాల్లో మరుగుదొడ్ల నిర్మాణం 100% పూర్తి చేయాలని లక్ష్యంతో ముందుకు వచ్చి మరుగుదొడ్ల నిర్మాణం పూర్తిచేసుకున్న లబ్ధిదారులకు నాలుగేళ్లయిన డబ్బులు అందడం లేదని గడ్చాందా సర్పంచ్ వెంకట్రావు ఉపాధి హామీ ఎపీఓ దృష్టికి తీసుకెళ్లారు.

మరుగుదొడ్లు నిర్మించుకోని వారి పేరిట జీపీ ఖాతాలలో డబ్బులు జమ ఉన్నాయని, నిర్మించుకున్న వారి డబ్బులు జమకాలేదని, లబ్ధిదారులు నిత్యం సర్పంచుల చుట్టూ తిరుగుతున్నారని వాపోయారు. ఈ విషయాన్ని గత నాలుగు సంవత్సరాల నుండి అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నా ఎలాంటి ప్రయోజనం లేదని వాపోయారు. 2019 నవంబర్ తర్వాత మరుగుదొడ్ల నిర్మాణం కోసం దరఖాస్తు చేసుకున్న వారికి మంజూరు కాలేదని, ఈ విషయాన్ని పై అధికారుల దృష్టికి తీసుకెళ్తానని ఏపీవో జగన్ హామీ ఇచ్చారు. అలాగే నాయి బ్రాహ్మణులు దోబీలకు ప్రభుత్వం ఉచిత కరెంటు ఇస్తున్నట్లు పేర్కొంటున్న బిల్లులు వస్తున్నాయని ఆ బిల్లులు ఎలా చెల్లించాలని సభ్యులు విద్యుత్ శాఖ ఏఈ దృష్టికి తీసుకెళ్లగా, వారు బిల్లులు చెల్లించాల్సిన అవసరం లేదని ప్రభుత్వం నుండి నిధులు విడుదల కాగానే బిల్లులు క్లియర్ అవుతాయని పేర్కొన్నారు.

కొత్తరేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకొని ఏళ్ళు గడుస్తున్నా మంజూరు కావడం లేదని హావర్గా సర్పంచ్ భుజంగరావు సభదృష్టికి తీసుకెళ్లగా గత ఆరు సంవత్సరాల నుండి రేషన్ కార్డులకు సంబంధించిన సైట్ ఓపెన్ కాకపోవడంతో కొత్తవి మంజూరు కావడం లేదని, ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారం అయ్యేలా చూస్తామని తహసిల్దార్ సరిత హామీ ఇచ్చారు. అలాగే ఇటీవల కురిసిన అకాల వర్షాల వల్ల దెబ్బతిన్న పంటల వివరాలను ప్రభుత్వానికి పంపడం జరిగిందని, నష్టపరిహారాన్ని నేరుగా రైతుల ఖాతాల్లో జమచేస్తామని ఇటీవల ముఖ్యమంత్రి ప్రకటించారని వ్యవసాయ శాఖఅధికారి గణేష్ తెలిపారు. అలాగే ఈ సమావేశంలో వివిధ శాఖల అధికారులు వారి నివేదికలను చదివి వినిపించారు. ఈ సమావేశంలో ఇంచార్జి ఎంపీడీవో సాల్మన్ రాజ్, పీఎసీఎస్ చైర్మన్ రత్నాకర్ రావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Tags:    

Similar News