ఇంటి కబ్జా వేదనతో యువకుడు ఆత్మహత్యాయత్నం..
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో సింగరేణి క్వార్టర్లకు అక్రమదారుల నుంచి ముప్పు పొంచి ఉంది.
దిశ, బెల్లంపల్లి : మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో సింగరేణి క్వార్టర్లకు అక్రమదారుల నుంచి ముప్పు పొంచి ఉంది. తన ఇంటిని ఓ కబ్జాకోరు ఆక్రమించున్న వైనం ఓ యువకుడి ఆత్మహత్యాయత్నానికి దారి తీసిన సంఘటన బెల్లంపల్లిలో కలకలం రేపింది. సంఘటన వివరాలు బాధితుల కథనం ప్రకారం ఇలా ఉన్నాయి. హనుమాన్ బస్తికి చెందిన సంగరాజేంద్రప్రసాద్ కు చెందిన సింగరేణిక్వార్టర్ బెల్లంపల్లి బస్తిలో ఉంది. తన తండ్రి సంగ ఓదెలు సింగరేణి కంపెనీలో ఉద్యోగం చేశాడు. ఆయనకు మంజూరైన సింగరేణి క్వార్టర్ ను బెల్లంపల్లి బస్తీకి చెందిన బడికిల శ్రీనివాసు కబ్జా చేశారు. సంఘ రాజేంద్రప్రసాద్ తన భార్య స్పందనలు తమ ఇంటిని అప్పగించాలని గత ఆరు సంవత్సరాలుగా వేడుకుంటున్నారు.
ఇదే సందర్భంలో పలుమార్లు పెద్దమనుషుల సమక్షంలో పంచాయతీ కూడా జరిగింది. పంచాయతీలో పెద్దమనుషులు బడికల శ్రీనివాసును క్వార్టర్ ను వదిలిపెట్టాలని చెప్పినప్పటికీ వినిపించుకోలేదు. తనకు క్వార్టర్ దక్కేటట్టు లేదని మనస్థాపానికి గురైన రాజేంద్రప్రసాద్ పోచమ్మ చెరువు కట్ట వద్దకువెళ్లి మంగళవారం పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. ఇదే సమయంలో స్నేహితులు రాజేంద్రప్రసాద్ కు ఫోన్ చేశారు. తాను మందు తాగినట్టు చెప్పడంతో వెంటనే పోచమ్మ చెరువు వద్దకు వచ్చి ఆయనను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి ఆటోలో తీసుకువెళ్లారు.
ప్రాథమిక వైద్యం చేసిన వైద్యులు మెరుగైన వైద్యం కోసం మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి రిఫర్ చేశారు. తన భర్త రాజేంద్రప్రసాద్ ఆత్మహత్యయత్నానికి బడికల శ్రీనివాస్ కారణమని బెల్లంపల్లి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో రానా ప్రసాద్ భార్య స్పందన ఫిర్యాదు చేశారు. తమ క్వార్టర్ ను కబ్జా చేయడంతో రాజేంద్రప్రసాద్ మనస్థాపానికి గురై ఆత్మహత్యయత్నానికి పాల్పడినట్లు ఫిర్యాదులో స్పందన పేర్కొన్నారు. ఈ మేరకు బెల్లంపల్లి వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.