ACB Raids:నోట్ల గుట్టలు.. కిలోల కొద్దీ బంగారం ఏసీబీ వలలో నిజామాబాద్ మున్సిపల్ ఆఫీసర్
ఏసీబీ వలలో మరో భారీ అవినీతి తిమింగలం చిక్కింది.
దిశ, డైనమిక్ బ్యూరో: ఏసీబీ వలలో మరో భారీ అవినీతి అనకొండ చిక్కింది. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సూపరింటెండెంట్ దాసరి నరేందర్ నివాసంలో భారీగా నగదు, బంగారం, ఆస్తిపత్రాలు బయటపడ్డాయి. ఇవాళ తెల్లవారుజామున నగరంలోని వినాయక నగర్‌లో గల అశోక టవర్‌లోని నరేందర్ ఇంటిపై ఏసీబీ నిర్వహించిన మెరుపు దాడిలో ఈ అక్రమాస్తుల బాగోతం బయటపడింది. ఇందుకు సంబంధించి కొన్ని వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇంట్లో నోట్ల కట్టలు గుట్ట మాదిరిగా ఉండటం చూసి అంతా షాక్ అవుతున్నారు. ఈ డబ్బును అధికారులు కౌంటింగ్ మిషన్ల సహాయంతో లెక్కిస్తున్నారు. అయితే ఇంత పెద్ద మొత్తంలో నగదు స్వాధీనం చేసుకోవడం జిల్లా ఏసీబీ చరిత్రలోనే రికార్డు అనే టాక్ వినిపిస్తున్నది.
రూ.6 కోట్ల ఆస్తులు..
ఏసీబీ సోదాల్లో నరేందర్ ఇంట్లో రూ.2.93 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తున్నది. అలాగే నరేందర్, అతని భార్య, అతని తల్లి బ్యాంకు ఖాతాలోనూ భారీగా నగదు ఉన్నట్లు గుర్తించారు. అలాగే 51 తులాల బంగారంతో పాటు రూ.1.98 కోట్ల విలువ చేసే స్థిరాస్తుల పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తున్నది. ఈ సోదాల్లో ఇప్పటి వరకు స్వాధీనం చేసుకున్న మొత్తం ఆస్తుల విలువ దాదాపు రూ.6.07 కోట్లు ఉంటుందని తెలుస్తున్నది. నరేందర్‌పై అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. త్వరలో కోర్టులో హాజరు పర్చనున్నారు. అదనపు ఆస్తులను వెలికితీసేందుకు మరిన్ని సోదాలు జరుగుతున్నట్లు సమాచారం. నరేందర్ అక్రమాస్తుల చిట్టాపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.