తెలంగాణపై కన్నేసిన 'ఆప్'.. సీఎం కేసీఆర్‌ను ఢీకొట్టేలా వ్యూహం

దిశ, తెలంగాణ బ్యూరో: పంజాబ్‌లో గెలుపుతో ఉత్సాహంగా ఉన్న

Update: 2022-03-19 05:35 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: పంజాబ్‌లో గెలుపుతో ఉత్సాహంగా ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణపై ఫోకస్ పెట్టింది. రాష్ట్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ ప్రజల్లోకి వెళ్లాలనుకుంటున్నది. అధికార పార్టీని ఢీకొట్టాలనే ఆలోచనతో ఉన్నది. టీఆర్ఎస్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, ఇస్తున్న సబ్సిడీలన్నీ 'ఆప్' నుంచి కాపీ కొట్టినవే అనే అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలనుకుంటున్నది. ఈ నెల చివరి వారంలో ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి సోమ్‌నాథ్ భారతి హైదరాబాద్ రానున్నారు. ఆ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఏప్రిల్ 14న హైదరాబాద్‌ విజిట్ కోసం ఏర్పాట్లపైనా, పార్టీ తలపెట్టిన పాదయాత్రపైనా చర్చించనున్నారు. రాష్ట్రంలో పార్టీ నిర్మాణంపైనా, రానున్న ఎన్నికలకు ఇప్పటి నుంచే సన్నద్ధం కావడంపై ఢిల్లీలో ఇప్పటికే సుదీర్ఘంగా చర్చించారు. టీఆర్ఎస్‌ను ఢీకొట్టడానికి 'ఆప్' సమగ్రమైన స్కెచ్ వేసింది. కేజ్రీవాల్ హైదరాబాద్ పర్యటన సందర్భంగా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కమిటీల ఏర్పాటు, కార్యాచరణ ప్లాన్, ఎజెండా ఖరారు, ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అంశాలు తదితరాలన్నింటిపై రాష్ట్ర నాయకలకు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేయనున్నారు. టీఆర్ఎస్అధినేత కేసీఆర్ అవినీతిలో మునిగిపోయారంటూ ఇటీవల విమర్శలు చేసిన సోమ్‌నాథ్​ భారతి.. ఇదే అంశాన్ని ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు. అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏకకాలంలో పార్టీ కార్యకర్తలు తలపెట్టే పాదయాత్ర సందర్భంగా ఈ అంశాలనూ వివరించే వ్యూహం ఖరారైంది. పలువురు మేధావులతోనూ కేజ్రీవాల్ భేటీ కానున్నారు.

'ఆప్'కు భయపడుతున్న టీఆర్ఎస్

అవినీతి మచ్చలేని 'ఆప్'ను చూస్తే సీఎం కేసీఆర్‌కు భయమని రాష్ట్ర సెర్చ్ కమిటీ ఛైర్‌పర్సన్ ఇందిరాశోభన్ వ్యాఖ్యానించారు. ప్రజల్లో తీవ్రమైన అసంతృప్తి, వ్యతిరేకత ఉన్నదని, దీని నుంచి బయట పడేందుకు నజరానాలు, తాయిలాలు, వరాలు ఇవ్వడానికి సిద్ధపడుతున్నారని ఆరోపించారు. సీఎం కేసీఆర్ ప్రభుత్వం ఫీల్డ్ అసిస్టెంట్లను రెండేళ్ళ క్రితం తొలగించిందని, కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖ కార్యదర్శికి ఈ విషయాన్ని వివరించి తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరిన రోజుల వ్యవధిలోనే కేసీఆర్ తన నిర్ణయాన్ని మార్చుకున్నారని, మళ్లీ విధుల్లోకి తీసుకుంటున్నట్లు ప్రకటన చేయక తప్పలేదని ఆమె గుర్తుచేశారు. దేశంలోని అన్ని పార్టీలకూ అవినీతి మరకలు అంటుకున్నాయని, 'ఆప్' మాత్రమే దానికి మినహాయింపు అని ఆ పార్టీ నేతలు బలంగా అభిప్రాయపడుతున్నారు. ప్రజలకు చేరువ కావడానికి'ఆప్'కే ఎక్కువ అవకాశాలు, నైతికత ఉన్నదని బలంగా నొక్కిచెప్తున్నారు.

'ఆప్' బాటలో టీఆర్ఎస్

ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్న 'బస్తీ దవాఖాన'లు ఢిల్లీలో అప్పటికే ప్రారంభించిన 'మొహల్లా క్లినిక్'లకు కాపీ అని ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి సోమ్‌నాధ్ భారతితో పాటు సెర్చ్ కమిటీ చైర్‌పర్సన్ ఇందిరాశోభన్ వ్యాఖ్యానించారు. సీఎం కేసీఆర్ సహా రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఢిల్లీలోని మొహల్లా క్లినిక్‌లను పరిశీలించారని, ఆ తర్వాత హైదరాబాద్ నగరంలో ఇది అమల్లోకి వచ్చిందని గుర్తుచేశారు. ఢిల్లీ ప్రభుత్వం 2019లోనే ప్రవేశపెట్టి అమలుచేస్తున్న 200 యూనిట్ల వరకు గృహ వినియోగదారులకు ఉచిత విద్యుత్ పథకాన్ని హెయిర్ కటింగ్ సెలూన్, లాండ్రీలకు టీఆర్ఎస్ సర్కారు అమలుచేస్తున్నదని ఇందిరా శోభన్ గుర్తుచేశారు. ఢిల్లీ ప్రభుత్వం కరోనా సంక్షోభానికి ముందు నుంచే ప్రభుత్వ స్కూళ్ళను డెవలప్‌ చేయడంపై ఫోకస్ పెట్టిందని, దాన్ని పరిగణనలోకి తీసుకుని ఇప్పుడు 'మన ఊరు – మన బడి' స్కీమ్‌ను తీసుకొచ్చిందని పేర్కొన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా 20 వేల లీటర్ల తాగునీరు ఉచితం అని రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సబ్సిడీ స్కీమ్ సైతం 'ఆప్' ప్రభుత్వం ఢిల్లీలో అమలుచేస్తున్న పథకం నుంచి ప్రేరణగా తీసుకున్నదేనని గుర్తుచేశారు. ప్రజల కనీస అవసరాలను, మౌలిక సదుపాయాలను కల్పించడంలో టీఆర్ఎస్ సర్కారుకు 'ఆప్' ఆదర్శంగా ఉన్నదని గుర్తుచేశారు.

Tags:    

Similar News