Huge scam: తెలంగాణలో సంచలనం.. వెయ్యి కోట్ల కుంభకోణంలో సోమేశ్ కుమార్!
రాష్ట్ర వాణిజ్యపన్నుల శాఖలో సుమారు రూ.1000 కోట్ల కుంభకోణం జరిగినట్టు ఫోరెన్సిక్ ఆడిట్‌లో వెల్లడైంది.
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర వాణిజ్యపన్నుల శాఖలో సుమారు రూ.1000 కోట్ల కుంభకోణం జరిగినట్టు ఫోరెన్సిక్ ఆడిట్‌లో వెల్లడైంది. ఈ మేరకు ఈ నెల 26న ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు మాజీ చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్‌ను ఏ-5గా చేర్చారు. వాణిజ్య పన్నుల శాఖకు అప్పట్లో కమిషనర్‌గా వ్యవహరించిన సోమేశ్ కనుసన్నల్లోనే హైదరాబాద్ ఐఐటీ రూపొందించిన సాఫ్ట్‌వేర్ ఆధారంగా ప్రభుత్వానికి రావాల్సిన నిధులు పక్కదారి పట్టి ఖజానాకు నష్టం జరిగినట్టు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. కమర్షియల్ ట్యాక్స్ జాయింట్ కమిషనర్ రవి కానూరి ఫిర్యాదు మేరకు ఆ శాఖలో పనిచేస్తున్న అదనపు కమిషనర్ (సేల్స్ టాక్స్) ఎస్సీ కాశీ విశ్వేశ్వరరావు (ఏ-1), డిప్యూటీ కమిషనర్ శివరామ్ ప్రసాద్ (ఏ-2), ప్రొఫెసర్ శోభన్‌బాబు (అసిస్టెంట్ ప్రొఫెసర్, ఐఐటీ హైదరాబాద్), ప్లియాంటో టెక్నాలజీస్ (ఏ-4)ను నిందితులుగా పేర్కొన్నారు. వీరిపై ఐపీసీలోని 406, 409, 120-బీ, ఐటీ యాక్టులోని సెక్షన్ 65 కింద ఎఫ్ఐఆర్ నమోదైంది.
వాణిజ్య పన్నుల శాఖలో గతేడాది డిసెంబరులో బిగ్ లీప్ టెక్నాలజీస్ అనే సంస్థ ఇన్‌పుట్ టాక్స్ పేరుతో రూ.25 కోట్లు మోసం చేసిందనే వ్యవహారంతో దర్యాప్తు మొదలుపెట్టగా శాఖలోని అధికారులే అందుకు సహకరించినట్టు తేలింది. దీంతో లోతుగా దర్యాప్తు చేసి అనుమానిత అధికారులకు నోటీసులు జారీచేయడం, వారి నుంచి వివరణలు రావడం, ఆ తర్వాత క్రాస్ ఎగ్జామినేషన్ జరగడం, తర్వాత హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం... ఈ తతంతమంతా జరిగిన తర్వాత హైదరాబాద్ ఐఐటీ రూపొందించిన సాఫ్ట్‌వేర్‌లోని డేటా మొత్తం థర్డ్ పార్టీకి వెళ్లినట్టు తేలింది. అసిస్టెంట్ ప్రొఫెసర్ శోభన్‌బాబుకు సైతం ఇందులో సంబంధం ఉన్నట్టు పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. దర్యాప్తులో భాగంగా రూ.450 కోట్ల విలువైన కుంభకోణం జరిగినట్టు స్పష్టమైంది. ఇందులో రాష్ట్ర బేవరెజెస్ కార్పొరేషన్ సైతం లబ్ధిదారుగా ఉన్నట్టు పోలీసులు ఆ ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్నారు.
మాజీ సీఎస్ సోమేశ్ కుమార్ సూచనల మేరకే శోభన్‌బాబు ఆ సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేసినట్టు పోలీసులకు అర్థమైంది. ఈ విషయం గురించి నగర పోలీసు కమిషనర్ కొత్తకోట శ్రీనివాసరెడ్డి మీడియాకు వివరిస్తూ, కమర్షియల్ ట్యాక్స్ జాయింట్ కమిషనర్ నుంచి ఫిర్యాదు వచ్చిందని, మాజీ చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్ సహా మొత్తం ఐదుగురిపై పలు సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టు తెలిపారు. దర్యాప్తు అనంతరం వివరాలు తెలుస్తాయన్నారు.