కేసీఆర్ కు కింది స్థాయి ఉద్యోగి సలహా!

తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల్లో రైతుబంధు ప్రధానమైంది.

Update: 2023-01-11 10:29 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల్లో రైతుబంధు ప్రధానమైంది. సీఎం ఈ స్కీమ్ ను ప్రతిష్టాత్మకంగా తీసుకుని అమలు చేస్తున్నారు. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నంత వరకు ఈ పథకాన్ని ఆపేది లేదని గతంలో ఎన్నో సందర్భాల్లో స్వయంగా కేసీఆరే స్పష్టం చేశారు. యాసంగికి సంబంధించిన పెట్టుబడి సాయం ఇటీవలే రైతుల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేసింది. అయితే ఈ స్కీమ్ విషయంలో ఓ చిరు ఉద్యోగి సీఎం కేసీఆర్ కు లేఖ రాయడం చర్చగా మారింది. రైతుబంధు విషయంలో ప్రభుత్వానికి ప్రతిష్ట ఎంతో అప్రతిష్ట కూడా అంతే ఉంది. పేరుకు రైతులకు పెట్టుబడి సాయం అని చెబుతునప్పటికీ ఈ పథకం వల్ల అసలైన రైతులకు న్యాయం జరగడం లేదని కేవలం పట్టాదారులకు, భూస్వాములకే పెద్ద ఎత్తున నగదు సాయం అందుతోందనే విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో నల్గొండ జిల్లా కట్టంగూర్ మండల కేంద్రంలో ఏఈఓగా పని చేస్తున్న కల్లెపల్లి పరశురాములు సీఎం కేసీఆర్ కు లేఖ రాయడం ఆసక్తిగా మారింది.

రైతుబంధు పథకానికి పరిమితులు విధించాలని కోరారు. 5 ఎకరాల వరకు భూమి కలిగిన వారికి మాత్రమే రైతుబంధు పథకాన్ని వర్తింప చేయాలని కోరారు. మిగిలిన నిధులతో పొలాలకు వెళ్లే కాలిబాటలను నిర్మించడానికి ఉపయోగించాలని సూచించారు. ఈ మేరకు మంగళవారం ఏఈఓ ప్రగతి భవన్ చిరునామాతో లేఖను పంపించారు. దీంతో కింది స్థాయి ఉద్యోగి చేసిన ప్రతిపాదనపై భిన్నరకాల అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. మరి చిరుఉద్యోగి చేసిన సూచనను సీఎం కేసీఆర్ పరిగణలోకి తీసుకుంటారా లేదా అనేది కాలమే సమాధానం చెప్పాల్సి ఉంది. 

Tags:    

Similar News