Bhu Bharathi Bill: తెలంగాణలో చారిత్రాత్మకమైన రోజు.. కొత్త చట్టానికి నాంది
తెలంగాణలో ఇది చారిత్రాత్మకమైన రోజు. భూమి చుట్టూ మనిషి జీవితం.. పేదరికాన్ని దూరం చేసేది భూమి.
దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో ఇది చారిత్రాత్మకమైన రోజు. భూమి చుట్టూ మనిషి జీవితం.. పేదరికాన్ని దూరం చేసేది భూమి. కంటికి రెప్పలా కాపాడాల్సిన గత ప్రభుత్వం హక్కులను కొల్లగొట్టారని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బుధవారం అసెంబ్లీలో తెలంగాణ భూ భారతి(తెలంగాణ రికార్డ్ ఆఫ్ ల్యాండ్ 2024) బిల్లును ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్వోఆర్ 1971 ని అమల్లోకి తీసుకొచ్చి 49 ఏండ్ల పాటు అమలు చేసిందన్నారు. అసైన్డ్ ల్యాండ్స్ మొదలుకొని అనేకం కాంగ్రెస్ తీసుకొచ్చిందన్నారు. వేలాది పుస్తకాలు చదివిన మేధావి తీసుకొచ్చిన చట్టం, ధరణి ద్వారా లక్షలాది సమస్యలు ఉత్పన్నమయ్యాయి. అధికారులు పరిష్కరించాల్సిన సమస్యలు కూడా కోర్టుకే వెళ్లాల్సి వచ్చిందన్నారు. భూ యజమానులకు తెలియకుండానే హక్కులు మార్చేశారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కలు ప్రభుత్వం ఏర్పడకముందు చేసిన పాదయాత్రలో అనేక సమస్యలు గుర్తించారు. ఎన్నికల ప్రచారంలో చెప్పినట్లుగా ధరణి పోర్టల్ ని బంగాళాఖాతంలో కలిపేస్తున్నామన్నారు. ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చుకున్నారని, ఒక్క గుంట భూమి ఉన్న వారు కూడా తమను నమ్మారని, వారి నమ్మకాన్ని నిలబెట్టేందుకుగాను ఆర్వోఆర్ 2020ను పూర్తిగా ప్రక్షాళన చేసి భూభారతిని రూపొందించామని చెప్పారు. తాము ఆగస్టు 2న ముసాయిదాను ప్రవేశపెట్టడమేగాక ప్రత్యేకంగా 40 రోజుల పాటు వెబ్ సైట్‌లో పెట్టి ప్రజాప్రతినిధులు, కవులు, మేధావులు, రిటైర్డ్ అధికారుల సూచనలు స్వీకరించామన్నారు. మాజీ మంత్రి హరీష్ రావు 7 పేజీలు, వినోద్‌రావు 5 పేజీల సలహాలు ఇచ్చారని గుర్తు చేశారు. 33 జిల్లాల్లో ప్రత్యేక చర్చావేదికలు నిర్వహించి అందరి అభిప్రాయాలు తీసుకున్నామని చెప్పారు. 18 రాష్ట్రాలలోని ఆర్వోఆర్‌లను అధ్యయనం చేసి, ఉత్తమ విధానాలను క్షుణ్ణంగా పరిశీలించి వాటిని భూభారతిలో పొందుపరిచామని మంత్రి తెలిపారు.
బీఆర్ఎస్ కార్యకర్తలకూ దక్కని న్యాయం
ధరణి కారణంగా ఎంతో మంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని మంత్రి పొంగులేటి వివరించారు. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం నారాయణపురంలో కె.రవి అనే ఎంపీటీసీ సభ్యుడు భూ సమస్యలను బీఆర్ఎస్ ప్రభుత్వ పెద్దలందరి దృష్టికి తీసుకువెళ్లారని, ఏళ్ల తరబడి పరిష్కారం కాలేదన్నారు. 1398 ఎకరాల భూమి తరతరాలుగా అక్కడి గిరిజనుల సాగుబడిలో ఉన్నాయని, వాటిని ఫారెస్టుగా రికార్డులో నమోదు చేశారన్నారు. దీంతో గిరిజనులు తీవ్ర మనోవేదననకు గురయ్యారని మంత్రి వివరించారు. గత ప్రభుత్వ హయాంలో 4 నెలల పాటు రిజిస్ట్రేషన్‌లు ఆపివేశారని, దీంతో భూములు అమ్ముకొని కుటుంబంలో పెళ్లిళ్లు, చదువుల కోసం ఖర్చుచేద్దామనుకొనే సామాన్య రైతులకు తీవ్ర అసౌకర్యం కలిగిందని మంత్రి పొంగులేటి వివరించారు. భూ భారతి బిల్లుకు సంబంధించి 22-23 సార్లు అభిప్రాయాలు తీసుకున్నామని, అందువల్లే బిల్లు ప్రవేశపెట్టడంలో జాప్యం జరిగిందని క్లారిటీ ఇచ్చారు.
మేధావులు ఇంట్లో కూర్చొని..
వేలాది పుస్తకాలు చదివిన మేధావి 2020 ఆర్వోఆర్ చట్టం ద్వారా తీసుకొచ్చిన ధరణి పోర్టల్‌తో మూడేండ్లలోనే లక్షలాది కొత్త సమస్యలు తలెత్తాయని పొంగులేటి అన్నారు. రెవెన్యూ అధికారుల స్థాయిలో పరిష్కారం కావాల్సినవి కోర్టుల దాకా వెళ్ళాల్సి వచ్చింది. నాలుగు గోడల మధ్య కూర్చుని వారికి అనుకూలంగా ఉండేలా ధరణిని అప్పటి పాలకులు బలవంతంగా మన నెత్తిమీద రుద్దారు. ధరణి మానవ సంబంధాలను సైతం దెబ్బతీసిందన్నారు. భూ యజమానికి తెలియకుండానే చేతులు దాటిపోయేలా చేసింది. కాళ్ళకింద నేల కదిలిపోయినా పేదలు వారి ఆవేదనను చెప్పుకోడానికీ మార్గం లేకుండా చేసిందన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి సూచన మేరకు ధరణి కష్టాలను తెలుసుకుని వాటి పరిష్కారానికి భూ నిపుణులతో ఒక కమిటీని ఏర్పాటు చేశాం. అనేకసార్లు వివిధ రాష్ట్రాల్లో పర్యటించి అక్కడి రెవెన్యూ చట్టాలను ఈ కమిటీ అధ్యయనం చేసిందన్నారు. దొరలు గడీల్లో కూర్చుని తయారు చేసిన 2020 చట్టాన్ని పూర్తిగా ప్రక్షాళన చేసి ప్రజలు కోరుకున్న విధంగా తెలంగాణ భూభారతి డ్రాఫ్టు బిల్లును ఇదే అసెంబ్లీలో ఆగస్టు 2న ప్రవేశపెట్టామన్నారు. ప్రజల నుంచి చట్టం రావాలనే ఉద్దేశంతో అదే రోజున సీసీఎల్ఏ వెబ్‌సైట్‌లో కూడా ముసాయిదా బిల్లును అందుబాటులో ఉంచాం. దాదాపు పాతిక రోజుల పాటు ప్రజా ప్రతినిధులు, రైతు సంఘాల ప్రతినిధులు, మేధావులు, సామాన్య ప్రజానీకం, రిటైర్డ్ అధికారుల నుంచి సలహాలు, సూచనలను స్వీకరించాం. అన్ని జిల్లాల్లో కలెక్టర్లు సదస్సులు నిర్వహించి అభిప్రాయాలను స్వీకరించినట్లు చెప్పారు.
ప్రధానాంశాలివే
గత చట్టం (2020)లోని తప్పులను అధ్యయనం చేసి భూ-భారతి ద్వారా సరిదిద్దినట్లు మంత్రి చెప్పారు. అలాగే పార్టు-బీ లోని 18 లక్షల ఎకరాలకు పరిష్కారం చూపిస్తామన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని ఆబాదీ/గ్రామకంఠం సమస్యలకు, భవిష్యత్తులో భూ వివాదాలకు తావు లేకుండా ఎంజాయ్‌మెంట్ సర్వే ద్వారా శాశ్వత పరిష్కారం చూపిస్తున్నట్లు తెలిపారు. రిజిస్ట్రేషన్ దస్తావేజుల ద్వారా వచ్చే మ్యుటేషన్ జరిగేటప్పుడు ఏవైనా తప్పులు జరిగితే అప్పీల్ చేసుకునే వ్యవస్థ (అథారిటీ)ని ఏర్పాటు చేస్తున్నాం. ఏదైనా పనికొచ్చేదున్నదంటే గత ప్రభుత్వంలో రిజిస్ట్రేషన్, ఆ వెంటనే మ్యుటేషన్ జరిగే వెసులుబాటే. కానీ దురదృష్టవశాత్తూ తప్పులకు పరిష్కారం చూపే వ్యవస్థే లేదు.
సాదాబైనామాలకు పరిష్కారం
గత ప్రభుత్వం 2020 నవంబరు 10 వరకు ఆన్‌లైన్‌లో వచ్చిన సుమారు 9.24 లక్షల దరఖాస్తులకు పరిష్కారం చూపలేకపోయిందని మంత్రి మండిపడ్డారు. ఇప్పుడు వెసులుబాటును కల్పించినట్లు తెలిపారు. అలాగే దేశంలో ప్రతీ పౌరుడికి ఆధార్ నెంబర్ ఎలా ఉంటుందో మన రాష్ట్రంలో భూములకూ భూధార్ నంబర్ ఇస్తున్నట్లు తెలిపారు. 2014కు ముందు రెవెన్యూ రికార్డుల నిర్వహణ, జమాబందీ ఎలా ఉండేదో ఇకపైనా అదే విధంగా కొనసాగిస్తాం. త్వరలోనే ప్రతీ రెవెన్యూ గ్రామానికి ఒక అధికారిని నియమిస్తాం. గత ప్రభుత్వం రెవెన్యూ వ్యవస్థను భ్రష్టు పట్టించిందని ఆరోపించారు.
ట్రిబ్యునల్ ఏర్పాటు
భూ వివాదాల గ్రీవెన్స్, అప్పీళ్ళ కోసం లాండ్ ట్రిబ్యునల్స్ ఏర్పాటు చేస్తున్నామని, అవసరాన్ని, ప్రాంతాన్ని బట్టి సంఖ్యపై ప్రభుత్వ నిర్ణయం తీసుకుంటుందన్నారు. ప్రభుత్వ ఆస్తుల్ని, రికార్డుల్ని ఉద్దేశపూర్వకంగా ఎవరైనా తారుమారు చేస్తే సీసీఎల్ఏ ద్వారా రివిజన్ చేసుకునే ఆప్షన్ ను ఈ చట్టంలో పొందుపరిచినట్లు చెప్పారు. ప్రభుత్వ ఆస్తుల్ని ఉద్దేశపూర్వకంగా తారుమారు చేసే అధికారులపై చర్యలు తీసుకుని శిక్షించే అధికారాన్ని ఈ చట్టం ద్వారా తీసుకొస్తున్నామన్నారు.
కాస్తు కాలమ్
2014 కి ముందు పాస్ బుక్కులు కలిగి ఉంది అనుభవదారుడిగా పొసిషన్ లో ఉన్న వారు ధరణి తరువాత రోడ్డున పడ్డారని, గత ప్రభుత్వం ఈ అంశాన్ని పూర్తిగా విస్మరించిందని మంత్రి చెప్పారు. ఈ భూ భారతిలో పట్టాదారులు, అనుభవదారులు అభద్రతాభావానికి గురి కావాల్సిన అవసరం లేదు. ఈ చట్టం వీరికి సముచిత స్థానం కల్పిస్తామన్నారు. రెవెన్యూ రికార్డులు టాంపరింగ్ జరగకుండా కంప్యూటర్ రికార్డులతో పాటు నిర్ణీత కాల వ్యవధిలో మాన్యువల్ కాపీని కూడా రెవెన్యూ కార్యాలయాలలో భద్రపరుస్తామన్నారు.
ఆరు మాడ్యూళ్లతోనే..
ధరణిలో 33 మాడ్యూళ్లు (ఆప్షన్స్) ఉండేవి. ఇప్పుడు దాన్ని ఆరు మాడ్యూళ్ళకు కుదిస్తున్నామని మంత్రి పొంగులేటి వివరించారు. అలాగే మాన్యువల్‌గా పహాణీలో 32 కాలమ్‌లు ఉండేవి. వాటిని ధరణిలో ఒకే కాలమ్‌కు గత ప్రభుత్వం కుదించింది. ఇప్పుడు దాన్ని 11 కాలమ్‌లు చేస్తున్నామన్నారు. గత ప్రభుత్వం కొన్ని వివరాలను బహిర్గతం కాకుండా లాకర్లలో బంధించింది. ఇప్పుడు భూ-భారతితో ఎవరైనా ఎక్కడి నుంచైనా చూసుకునేలా డిస్‌ప్లే చేస్తున్నాం. ప్రభుత్వ భూములు అన్యాక్రాంతానికి గురికాకుండా ఎవరైనా భూ భారతి ద్వారా ప్రభుత్వానికి తెలియ చేయవచ్చు. ఆ భూముల్ని పరిరక్షించేలా ఈ చట్టాన్ని రూపొందిస్తున్నాం. భూ-భారతిలో దరఖాస్తు చేసుకున్న భూములున్న ఆసాములకు వారి మొబైల్ నెంబర్లకే అప్‌డేట్స్ వెళ్ళే సౌకర్యాన్ని కల్పిస్తున్నామన్నారు. గతంలో ధరణి కారణంగా అన్యాక్రాంతమైన భూముల వివరాలను భూ భారతి ద్వారా బట్టబయలు చేస్తామన్నారు. 2014కు ముందు సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల దగ్గర ఉన్న ప్రభుత్వ భూముల జాబితాలోని రెవెన్యూ, ఎండోమెంట్, వక్ఫ్, భూదాన్, ఫారెస్ట్ తదితర భూముల వివరాలను ధరణిలోని డేటాతో పోల్చి చూసి అన్యాక్రాంతమైన భూముల వివరాలను బహిర్గతం చేస్తామన్నారు. ప్రభుత్వ భూముల్ని ఆక్రమించినవారు ఎంత పెద్దవారైనా వదిలేది లేదు. ఆ భూముల్ని తిరిగి స్వాధీనం చేసుకుని పేదలకు పంచుతామన్నారు.
మూడు నెలల్లో రూల్స్
గత ప్రభుత్వం ధరణి తెచ్చిన తర్వాత మూడేండ్లు దాటినా రూల్స్ ఫ్రేమ్ చేయకపోవడంతో తప్పులు జరిగాయన్నారు. ఆ తప్పుల్ని ప్రజలపై బలవంతంగా రుద్దింది. ఇప్పుడు అలా జరగకుండా మూడు నెలల్లోనే రూల్స్ ఫ్రేమ్ చేస్తామని హామీ ఇచ్చారు. రూల్స్ ఫ్రేమ్ అయిన తర్వాత గ్రామ స్థాయిలో రెవెన్యూ సదస్సులు పెట్టి అధికారులతో పాటు ఎమ్మెల్యేలతో కలిసి పరిష్కారాన్ని యుద్ధ ప్రాతిపదికన కనుగొంటామన్నారు. గత ప్రభుత్వం మాటలతో మభ్య పెట్టింది. కానీ ఈ ఇందిరమ్మ ప్రభుత్వం అన్ని చట్టాలను కలిపి ఒకే చట్టాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుందన్నారు. ఇద్దరు వ్యక్తులు 2020 ఆర్వోఆర్ చీకటి చట్టాన్ని ప్రజలపై రుద్దారు. పూర్తి అవినీతితో నిండిపోయిన ఈ చట్టం మూడేండ్లకే నూరేండ్లు నిండిపోయేలా ప్రజలే మార్గనిర్దేశం చేశారు.
• అందరికీ ఆమోదయోగ్యంగా తీసుకొస్తున్న భూ-భారతి చట్టం కనీసం వందేళ్ళు వర్ధిల్లుతుందని ఈ ప్రభుత్వం బలంగా నమ్ముతున్నది.